పసందైన రుచులకు చిరునామా పట్టాభి స్వీట్స్ !

Sharing is Caring...

K Hari Krishna   ………… 

“కనమర్లపూడి పట్టాభి రామయ్య ” ఆ పేరు  వినగానే  చీరాల చుట్టుపక్కల ఒక ఇరవై మండలాల ప్రజలు నోట్లో ఒక జీడిపప్పు లడ్డు ముద్ద ఉన్న అనుభూతికి లోనవుతారు. పేద మధ్యతరగతి ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా పట్టాభి గారి లడ్డో, బాదుషానో, జాంగ్రీనో విస్తట్లో పడాల్సిందే.

నలుగురన్నదమ్ములలో పట్టాభి గారు పెద్ద. మొదట మా చీరాల ప్రసాద్ థియేటర్ సెంటరులో ఒక చిన్న బడ్డీకొట్లో స్వీట్ షాప్ ప్రారంభించిన పట్టాభి గారు మొదటినుండి పాలతో తయారయ్యే ఖరీదయిన స్వీట్ల జోలికిపోకుండా ఏవో ప్రధానంగా ఒక ఐదు రకాలు మాత్రమే మంచి నాణ్యత తోబాటు అతి చవగ్గా అందించటం మొదలెట్టారు.

ఏ స్వీటు అయినా “కిలొ యనభై రూపాయాలు మాత్రమే”. సగం జీడిపప్పు కూరిన  (త్రిబుల్ ఎక్స్) లడ్డు మాత్రం కిలోకి నూటఇరవై రూపాయాలు . అదికూడా జీళ్ళ రేటు పెరగటంవల్లే. అంత క్వాలిటీ ఉన్న లడ్లు అంత తక్కువరేటుకు ఇవ్వడం వలన చీరాలకి రెండువందల కిలొమీటర్ల దూరంలో ఉన్న గిద్దలూరు ప్రాంతం వాళ్ళు కూడా  పెళ్లిళ్లకి  ఆర్టీసీ బస్సు ల వాళ్ళ చేత తెప్పించుకుంటారు.

షాప్ ఎపుడూ రద్దీగానే ఉంటుంది . కొట్లో కుర్రాళ్ళకి టి తాగటానికి టైముండదు. మనం అడ్వాన్స్ ఇవ్వకుండా ఒక వంద కేజీలు ఆర్డర్ చెప్పి, వెళ్లకపోయినా… మనకి కనీసం ఫోను కూడా చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే  వాటిని షాప్ లో పెడితే ఒక నాలుగు గంటల్లో అమ్ముడుపోతాయ్. చాలా షాపుల్లో మిఠాయిలు పెట్టిన పళ్లెం అట్లాగే ఉంటుంది.  రెండుమూడు రోజులకి కూడా అవ్వి అమ్ముడుపోవు..

పట్టాభి గారి షాప్ లో మాత్రం పది కేజీల పళ్ళాలు వస్తూ ఉంటాయ్…అయిపోతూ ఉంటాయ్ ..నాకయితే మాయాబజార్ సినిమాలో  ఎస్వీ రంగారావు గారి వివాహ భోజనంబు పాట గుర్తొస్తుంది ఆషాపుకెళ్లినప్పుడల్లా. విచిత్రం గా పట్టాభి గారి షాప్ ప్రక్కనే మరొ రెండు మిఠాయి షాప్ లున్నాయి. ఇక్కడ సరుకు దొరకక ఉత్త చేతుల్తో వెళ్లడం ఇష్టపడని వాళ్ళు అక్కడ కెళ్లి కొనుక్కుపోతూ వుంటారు .పట్టాభి గారిషాప్ లో  సీజన్లో రోజుకి వెయ్యి కిలొల వరకు చేస్తారని అంటారు.

కేవలం మిఠాయిలు అమ్మే జనాల మనసు దోచుకున్నాడా అంటే…. కానే కాదు … ఆయనది దొడ్డమనసు.  ఏదన్నా గుడి కట్టాలన్నా..  చర్చిల్లో వేడుకయినా.. దర్గాల్లో గంధ మహోత్సవాలయినా … అందరూ ఆయన దగ్గరకే వస్తారు. అడిగితే కాదనకుండా సహాయం చేసే గుణం పట్టాభి గారిది. చీరాల అయ్యప్ప స్వామి గుళ్లో ఒక రెండునెలల పాటు రెండు పూటలా పంచభక్ష్య పరమాన్నాలతో అన్నదానం చేసే వారాయన.

ఆయన వున్నరోజుల్లో ఏదన్నా కొత్త వ్యాపారానికి మొదటి కొనుగోలుదారులు పట్టాభి గారే. ఆయన హస్తవాసికి అంతమంచి పేరుంది .మునిసిపల్ ఎన్నికల్లో మా చీరాల్లో ఉనికిలేని బీజేపీ తరఫున కొన్సిలర్ గా పోటిచేసి గెలిచిన తర్వాత ఓటేసిన వాళ్లకి, వెయ్యని వాళ్లకి కూడా పెద్ద పెద్ద లడ్లు పంచాడాయన.

విశేషం ఏమిటంటే  ఆ వార్డులో “నవాబ్ పేట” లోని సగం ఇళ్ళు కలిసి ఉంటాయ్ ..చీరాల లో పాతుకుపోయిన మిఠాయి కొట్లు రవి, రమ్య షాపులకు నీళ్లు పోసింది పట్టాభి గారే. ఆయన మరణించిన చాల రోజులు మాత్రం చీరాల చుట్టుపక్కల ఏ స్వీటు నోట్లో వేసుకున్నా చేదుగా మారిపోయింది .ఒక నెలరోజుల పాటు అనధికార సంతాపదినాలు పాటించారు మా జనాలు .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!