సూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ పెట్టేది లేదని స్పష్ష్టం చేసిన నేపథ్యంలో తమిళనాట ఎన్నికల బరిలో పోటీ పడే గట్టి పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే లే. మొన్నటి వరకు రజనీ వస్తారు రాజకీయ శూన్యత ను భర్తీ చేస్తారు అనుకున్నారు. కానీ రజనీ ఆరోగ్యకారణాల వలన వెనుకడుగువేశారు. అన్నాదురై, ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి కానీ జయలలితకానీ ఇపుడు లేరు. ఇక అన్నాడీఎంకే అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్నా.. బలమైన నాయకత్వం మాత్రం ఆ పార్టీకి లేదనే చెప్పుకోవాలి . ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య ఏమాత్రం పొసగడం లేదు.
ఇక కమల్ హాసన్ పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో సందేహమే. ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేదు. నటుడిగా కమల్ హాసన్ కి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆ బలం ఆయనను గెలిపిస్తుందా అనేది డౌటే. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించి పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు కమల్ శ్రమిస్తున్నారు. గత లోకసభ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ఓటర్లపై ప్రభావం చూపలేకపోయారు. నటుడు విజయకాంత్ పార్టీ బాగా బలహీన పడింది. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా లేని క్రమంలో జనంలోకి ఆయన పార్టీ దూసుకుపోవడం కూడా కష్టమే. విజయకాంత్ సతీమణి ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్నారు. అన్నాడీఎంకే ఫ్రంట్ నుంచి బయటకొచ్చిన డీఎండీకే భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీతో కలసి బరిలోకి దిగినా ఫలితాలు సాధించలేక పోయారు. విజయ్ కాంత్ ప్రచారంలో పాల్గొనలేకపోవడం వల్లనే సరైన ఫలితాలు సాధించలేకపోయామని ఇప్పటికీ అభిమానులు చెబుతుంటారు.
ఇక మిగిలింది … ప్రజలకు కనబడుతున్నది స్టాలిన్ మాత్రమే. రజనీ కాంత్ పక్కకు తప్పుకోవడం స్టాలిన్ కి ప్లస్ కావచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. డీఎంకే కి బలమైన క్యాడర్ ఉంది. పార్టీ కార్యకర్తలు మంచి కసి మీద ఉన్నారు. ఇపుడున్న నాయకులతో పోలిస్తే స్టాలిన్ తక్కువైనవాడు కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తండ్రి కరుణానిధే స్టాలిన్ కి రాజకీయ గురువు. ఆయన దగ్గరే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు.అందుకే తన తర్వాత రాజకీయ వారసుడు స్టాలిన్ అని స్పష్టం గా ప్రకటించారు. ఇక స్టాలిన్ గురించి చెప్పుకోవాలంటే కరుణానిధి రెండో భార్య కుమారుడు.
చెన్నై లోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి (96 నుంచి 2016 వరకు) 5 మార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు 1989 లో ఒక మారు గెలిచాడు. ఇక 1991,1984 ఎన్నికల్లో ఓడిపోయారు. 14 వ సంవత్సరం నుంచే స్టాలిన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఎమర్జెన్సీ రోజుల్లో మీసా ఆక్ట్ కింద జైలు కెళ్ళిన తరుణంలో స్టాలిన్ పేరు వెలుగులో కొచ్చింది. చెన్నై మునిసిపల్ మేయర్ గా కూడా చేశారు. తర్వాత డిప్యూటీ సీఎం గా, ప్రతిపక్ష నేతగా చేసిన అనుభవం ఉంది మొదటినుంచి తండ్రి మాట జవ దాటని వ్యక్తి అని పేరుంది. ప్రస్తుతం పార్టీ ప్రెసిడెంట్ ఆయనే. కరుణానిధి మరణించాక పార్టీ పై పట్టు సాధించారు . పార్టీలో స్టాలిన్ కి తెలియని వారంటూ ఎవరూ లేరు. కాకపోతే సోదరుడు అళగిరికి స్టాలిన్ కి అసలు పడదు. అళగిరి సొంత పార్టీ పెడతానని ఈ మధ్య ప్రకటించారు. కానీ అళగిరి పెద్దగా ప్రభావం చూపలేరని స్టాలిన్ నమ్మకం. పార్టీ పగ్గాలు చేపట్టాక స్టాలిన్ ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు ఇవే అవుతాయి. ఇప్పటికే ప్రచారం మొదలెట్టిన ఆయన తన సత్తా ఎలా చాటుకుంటారో ? ఓటర్లు కరుణానిధిపై చూపిన అభిమానం స్టాలిన్ పై చూపుతారో లేదో వేచి చూడాలి.
————– KNM