మళ్ళీ వార్తల్లోకి దుబాయ్ రాజకుమారి !

Sharing is Caring...

దుబాయి రాజకుమారి మళ్ళీ వార్తల్లో కెక్కారు. తాను జైలు లాంటి విల్లాలో ఉన్నానని చెబుతూ ఒక వీడియో తీసి తన స్నేహితులకు ఆమె పంపింది. తన జీవితం ఆందోళనకరంగా ఉందని, కనీసం బయటకెళ్ళి గాలి పీల్చుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో బందీగా ఉన్నానని రాకుమారి లతీఫా ఆ వీడియోలో చెప్పుకున్నారు.ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ BBC ఆ వీడియోను ప్రసారం చేసింది. నేనెప్పుడు విడుదలవుతానో … అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. నా జీవితం గురించి ప్రతి క్షణం భయపడుతున్నా అంటూ రాజకుమారి లతిఫా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను లతీఫా తన బాత్ రూమ్లో దాక్కుని రహస్యంగా ఫోన్‌లో రికార్డు చేసి పంపినట్టుగా  బీబీసీ తన కథనంలో చెబుతోంది.

లతీఫా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రధానమంత్రి షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తోమ్‌ కుమార్తె. 2018లో దుబాయి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ఒక వీడియోను విడుదల చేశారు. లతీఫా.. తనకు, తన కుటుంబానికి  స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేవని, తను అకృత్యాలకు గురయ్యానని చెబుతూ చిత్రీకరించిన వీడియో సందేశం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుబాయి నుంచి ఒక ఫ్రాన్స్ వ్యక్తి సహాయంతో సముద్ర మార్గంలో తప్పించుకున్న షేక్ లతీఫాను  గోవా సముద్ర తీరం లో సమీపంలో కోస్ట్ గార్డులు పట్టుకున్నారు.

ఆ తర్వాత భారత్-యుఏఈ సంయుక్త ఆపరేషన్ లో ఆమెను దుబాయ్ కి పంపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షేక్ మొహమ్మద్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ జాయింట్ ఆపరేషన్ కు అనుమతి ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.  ఇది చట్టవిరుద్ధమని అప్పట్లో భారత్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. లతీఫా వ్యవహారంలో భారత్ సహకారం తర్వాత యుఏఈ పరస్పర మార్పిడి కింద  ఆగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ డీల్ లో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ను భారత్ కి అప్పగించినట్టు సమాచారం.  ఆ తర్వాత న్యూఢిల్లీలో ఆసియా, యూరప్ దౌత్యవర్గాలు బ్రిటిష్ వార్తాపత్రికకు ఈ మార్పిడికి సంబంధించిన సమాచారం అందించాయి. భారత్ నుంచి పంపిన  లతీఫాకు బదులు మిషెల్ ను అప్పగించినట్టు దౌత్య వర్గాలు చెప్పాయి.  లండన్ కి చెందిన  అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది టాబీ క్యాడ్ మ్యాన్ లతీఫా కేసును యుఎన్ కు పంపారు.  మిషెల్ కుటుంబానికి కూడా అలాగే చేయమని అప్పట్లో అయన  సలహా ఇచ్చారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!