ఆ ఇద్దరూ ముత్యాల సాగులో నిమగ్నమైనారు. వారు లాభాలు గడిస్తూ మరెందరికో శక్షణ కూడా ఇస్తున్నారు. ఆమె పేరు కుల్జానా దూబే .. అతని పేరు అశోక్ మన్వాని. ఈ జంట దేశంలోని 12 రాష్ట్రాల్లో ముత్యాల పెంపకాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ముత్యాల సాగు ద్వారా ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు.
ఈ జంట మొదటి సారిగా ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. అభిరుచులు .. ఆసక్తి ఒకటే కావడం తో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ వ్యవసాయ కుటుంబానికే చెందినవారు కావడం విశేషం. ముత్యాల సేద్యానికి అవసరమయ్యే కొత్త పరికరాలు, నూతన నైపుణ్యాలను కనిపెడుతూ పలు పురస్కారాలనూ ఇద్దరూ అందుకుంటున్నారు.
అశోక్ మంచినీటి ముత్యాల పెంపకం గురించి కొన్ని బుక్స్ లో చదివాడు. దాంతో ఈ విషయంపై అతనికి ఆసక్తి పెరిగింది. తర్వాత ముత్యాల పెంపకంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. అయితే వరుసగా విఫల మయ్యాడు. 2000లో భువనేశ్వర్‌లోని పెరల్ కల్చర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాడు.ఆ కోర్సు తర్వాత ఇతరులకు కూడా ఈ సాగును నేర్పించగలననే నమ్మకం అతనిలో కలిగింది.
2003లో కుల్జానా కలిసిన తర్వాత ఇద్దరు వివిధ రకాల పద్ధతులలో ప్రయోగాలు చేశారు.అటవీ ప్రాంతాల్లోనే ఉంటూ ముత్యాల సాగు మీద దృష్టి పెట్టారు. వైఫల్యాలు ఎదురైనా నిరాశ పడలేదు. సొంత కృషితో నైపుణ్యాలను సాధించారు. ‘ఇండియన్ పెరల్ కల్టివేషన్’ సంస్థను ప్రారంభించారు. సాగుపట్ల ఆసక్తి ఉన్న వారికి ముత్యాల సాగు పై శిక్షణ ఇస్తున్నారు.
సహజంగా ఒక ఆల్చిప్పలో ఒకటి లేదా రెండు ముత్యాలు ఉంటాయి. వీటి సంఖ్యను పెంచడానికి ఈ జంట ఎన్నో ప్రయోగాలు చేశారు. అవి ఫలించాయి. ఒక్కో ఆల్చిప్పలో ముత్యాల సంఖ్య ఆరుకి చేరుకుంది. ఈ టెక్నిక్ ను రైతులకు తెలియ చెబుతున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటున్నారు. కేవలం ఉప్పు నీటిలోనే కాకుండా గ్రామాలు, నగరాల్లోని నదులు, చెరువులు వంటి మంచినీటి వనరులలోనూ ముత్యాలు దొరుకుతాయని ఈ జంట తమ కృషి ద్వారా నిరూపించారు.
డిజైనర్ ముత్యాలను పండించడానికి మస్సెల్ ఓపెనర్… చెక్క మస్సెల్ స్టాండ్ వంటి సాధనాలను ఈ జంట తయారు చేశారు. ఈ సాధనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి గుల్లల మరణానికి దారితీయవు. ఇప్పటివరకు మణిపూర్, మేఘాలయ, అసోం,మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ లో ‘నాణ్యమైన ముత్యం ఖరీదు రూ 500 వరకు ఉంటుంది.
ఇక ఈ ముత్యాల సాగుకి ఇంటి వెనక ఖాళీ స్థలం సరిపోతుంది. దాన్ని చెరువుగా మార్చి, సాగు చేయాలంటే రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.12.5 లక్షల మేరకు సబ్సిడీ ఇస్తుంది. ఈ దంపతులు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 400 శిక్షణా తరగతులు నిర్వహించారు. రైతుల ఉపాధి కోసం కృషి చేస్తున్నఈ దంపతులకు జాతీయ స్థాయిలో ఎనిమిది అవార్డులు … మరెన్నో పురస్కారాలు లభించాయి.
——KNM