Taadi Prakash …………………..
30 ఏళ్ల క్రితం ఉదయం దిన పత్రికలో రాసిన K.N .Y. Patanjali వ్యాసం ఇది. కవి నగ్నముని గురించి ఎంత Bold గా , ఎంత దూకుడుగా రాశాడో….చదవండి ….
నవ్య కవనఖని నగ్నముని
వాడు… పంద్రాగస్టునాడు ఎర్రకోట మీది జాతీయ పతాకను పీకి, పీలికలు చేసి గోపాతల్లేని వాళ్ళందరికీ పంచి- ‘ఇదే భారతీమాన సంరక్షణం ఇదే’ అని ప్రకటించగలడు . వాడు నగ్నముని!
వాడు ఒకానొక మంచి పౌర్ణమినాడు తాజమహల్ గోడల మీద పేడ పిడకలు పెట్టించి వాటిని పదిహేను వెన్నెల రాత్రులు ఎండనిచ్చి పొయ్యిలో కట్టెల్లేని వాళ్ళందరికీ వాటిని రిపబ్లిక్ దినోత్సవం రోజున పంచగలడు.
వాడు నగ్నముని…. మనసు నొచ్చినప్పుడల్లా కవిత్వం రాస్తూ లెజిస్లేచర్ రిపోర్టర్ కొలువు చేస్తూ, నీలగిరి కాఫీ తాగుతూ, ఫిల్టర్ సిగరెట్లు పీలుస్తూ వుంటాడు. వాడు నగ్నముని… మానేపల్లి హృషీకేశవరావుగా తెనాలిలో పుట్టి, బందరులో ఎదిగి ఉద్యోగరీత్యా . హైదరాబాద్ వచ్చేసి, ‘ఉదయించని ఉదయాల’ కేశవరావుగా గుబాళించడం మొదలు పెట్టాడు. ఆ కేశవరావు అదేతీరుగా నలుగురు మెచ్చే శిష్ట కవిత్వం రాస్తే విశేషమ్ లేక పోను.
అప్పటికి కవిత్వం ‘అన్నా ఈ పరుగు వృధాగా’ వుంది. కొంచెం గుడారాలు పీకేసి, కొంచెం గోడలుపడిపోయి, కొంచెం మంత్రుల కౌగిట్లో వుంది. కొంచెం మొద్దుబారిపోయి, దృష్టి మందగించి, కొంచెం చెవుడొచ్చి నీరసంగా వుంది. లంగోటా మీద ప్రియురాలు కుట్టిన పువ్వులాగుంది. కొంత సిగ్గులేకుండా వుంది. కవిత్వానికి టైం బాంబు స్వభావం వుందని గమనించిన కేశవరావు ‘నగ్నముని’గా అవతరించాడు.
దిగంబర కవితోద్యమం ఆరంభం అయింది. మర్యాద కవులు, షోకిల్లా కవుల, అడంగి కవుల పంచెలు నడిరోడ్డు మీద లాగేసిన రౌడీ కవులు దిగంబర కవులు. వారి నాయకుడు నగ్నముని.
దిగంబర కవిత్వం ఉద్యమం తెలుగుదేశాన్ని రెచ్చగొట్టింది. కిర్రెక్కించింది. చికాకు పెట్టింది. సవాలు చేసింది. ముసలి కవులు, మర్యాదస్తులు సీతాకోక చిలుకవులూ ముక్కులూ, చెవులూ మూసుకుని, పడక్కుర్చీల్లో దాక్కుండి పోయారు.
కానీ యువతరం దిగంబర కవులు కోరిన రీతిగా ప్రభావితం అయింది. కమ్యూనిస్టు పెద్దలు, మీకో ఆదర్శం లేనట్టుందర్రా… మీరో way out చూపాలర్రా అని గుర్తుచేశారు. ఆ దశలో శ్రీశ్రీ షష్టిపూర్తి జరిగింది. ఆ జ్వర వాతావరణంలో, శ్రీకాకుళ ఉద్యమస్ఫూర్తిలో విరసం ఆవిర్భావం జరిగింది. నగ్నముని దిగంబర కవితోద్యమంలోంచి విరసంలోకి సగర్వంగా నడిచాడు.
అయితే నగ్నమునికి విరసంలో తృప్తిలేదు. మార్భిజంతో తృప్తి లేదు. కార్ల్ మార్క్ష్స్ ఎక్కడో పొరబడినట్టు అతనికి అస్పష్టంగా అనిపించడం మొదలు పెట్టింది. ఇన్నేళ్ళ కమ్యూనిస్టు పోరాటాలూ మాయమైపోయాయా? త్యాగమంతా, నరుడు కార్చిన నెత్తురంతా ఏ పవిత్ర గంగలో కలిసిపోయింది? అని అతను చికాకుగా, ప్రశ్నించి విరసంలోంచి బైటికి వచ్చేసి నా కమ్యూనిస్టు నా నక్సలైటు సోదరులారా
వృధాగా చావకండి అని పిలిచి చూశాడు.
ఎవరూ పట్టించుకోకపోయినా నగ్నముని పట్టించుకోలేదు. నగ్నముని పెంకివాడు, నగ్నముని గొంతు ఎంతో బాగుంటుంది. స్వామి శివశంకరస్వామి మొదలు నేటి కుర్రకారు కవుల వరకు ముఖ్యమైన ప్రతి కవితోనూ అతనికి పరిచయాలున్నాయి. ప్రతి కవి గురించి కనీసం ఒక అద్భుతమైన Anecdote నైనా అతను ఎంతో చక్కగా.. వర్ణించగలడు.
అతని ధారణ శక్తి కూడా అద్భుతమైంది. అజంతా రాసి, మరిచిపోయిన వచన కవితను అతను ఎంతో చక్కగా వినిపించడాన్ని నేను కూడా విన్నాను. విరసంలోంచి బైటికి వచ్చేసిన నగ్నముని
ముక్కు మూసుకొని కూర్చోలేదు. ఈ యుగం శ్రీశ్రీది కాదని లోకంతో పేచీకి దిగాడు. శ్రీశ్రీ భావాలు మార్క్సిస్టు భావాలు మాత్రమే.
ఆయన మార్క్సిస్టు ఆలోచనా ధోరణిని మాత్రమే మనకి పరిచయం చేశాడు. కాబట్టి ఆయన మహాకవి మాత్రమే కానీ యుగకర్త కాదని సింహకంఠనాదంతో తెలుగు దేశానికి చెప్పి చూశాడు. ఇదంతా గిట్టని కవులు, రచయితలు, మేధావులూ నగ్నమునిని వెక్కిరించారు. అయితే నగ్నముని పెంకి.
అతనొక్కడే మిగిలిన లోకాన్ని నాలుకతో వెవ్వెవ్వె అని తిరిగి వెక్కిరించాడు.
నగ్నముని రచయిత కాదుగానీ విలక్షణమైన కధలు రాసి రచయిత కూడానా.. అనే అనుమానం కలిగించాడు. అతను రాసిన సిమెంట్ సంతతి చదివి అప్పట్లో నేను కొంచెం జడుసుకున్నాను.
బందరు తుఫాను బీభత్సం గురించి అందరూ అమ్మయ్యో, అయ్యో అయ్యో అని ఏడుస్తుంటే నగ్నముని ‘కొయ్యగుర్రం’ రాసి చూపించాడు. మనందరం, మన ఏలికలూ తోటిమనిషిని ఎంత ఘోరంగా fail చేస్తున్నామో నగ్నముని అందులో శక్తివంతంగా చెప్పాడు.
I have come here to quarrel with the world అని ఎవరో అన్నారు. అలాంటి వాడు నగ్నముని, లోకంతో అతను మౌలికంగా విభేదిస్తాడు. ఈ తిరస్కరణ ఎంత తీవ్రమైనదంటే తుదకు తనను కూడా తాను తృణీకరించి, Disown చేసుకోగలడు. అతని స్వభావంలో ఆ తీవ్రత, ఆ కాఠిన్యం రెండూ వున్నాయి. ఈ తపనతోనే అతను, ఈ లోకానికి ఒక కొత్త ఫిలాసఫీ, ఒక కొత్త దృష్టి కావాలి. కొత్తవిలువ కావాలని ఆవేశంగా వాటికోసం అన్వేషిస్తూ వుంటాడు.
నగ్నమునిని ప్రేమించలేక, అతని కవిత్వాన్ని ద్వేషించలేక ఇబ్బంది పడేవాళ్ళని కూడా నేను ఎరుగుదును. నగ్నముని కవిత్వాన్ని చూసి జడుసుకుని, కేశవరావుగా ఆయన చిన్నతనంలో రాసిన కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళ గురించి విన్నాను. నగ్నముని కవిత్వాన్ని ప్రేమిస్తూ, అతడ్ని ద్వేషించేవాళ్ళని కూడా ఎరుగుదును. నగ్నముని కవిత్వాన్ని చిన్నచూపు చూసే మూర్ఖుల్ని మాత్రం ఎరగను.
As a man he is fascinating
As a poet he is wonderful and complete
– కె.ఎన్.వై.పతంజలి
(ఉదయం, దినపత్రిక, ‘సంతకాలు’ శీర్షికన)