Surya Temple …………………………………………………….
తమిళనాడు లోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువైవున్నాయి. ఇక్కడ నవ గ్రహాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో సూర్యనార్ దేవాలయం వుంది. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే, ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి.
అన్ని నవగ్రహాల్లో శివుడు ప్రధాన దైవమైతే, ఈ ఆలయంలో మాత్రం సూర్యుడు ప్రధాన దైవం. సూర్యనార్ ఆలయాన్ని పవిత్రమైన హిందూ దేవాలయంగా భక్తులు భావిస్తారు. ఇది తంజావూరు జిల్లాలోని సూర్యనార్కోవిల్ గ్రామంలో ఉంది. ఇది అత్యంత ప్రసిద్ధిగాంచిన సూర్య నవగ్రహ దేవాలయాలలో ఒకటి.
సూర్యనార్ ఆలయాన్ని క్రీస్తుశకం 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించారు.
ఈ ఆలయంలో ఇతర గ్రహాధిపతులకు ప్రత్యేకమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయక, మురుగన్ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయ మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం ఉంది.
కుళోత్తుంగ చోళ శాసనాలు ఈ ఆలయాన్ని మార్తాండ దేవాలయంగా సూచిస్తున్నాయి. కుళోత్తుంగ చోళులు కనౌజ్ గహద్వాల్ రాజవంశంతో మంచి సంబంధాన్నికలిగి ఉన్నారని అంటారు. దీని పాలకులు సూర్యుడిని ఆరాధించేవారు, కాబట్టి సూర్యనార్ ఆలయం దక్షిణ భారతదేశంలో వారి ప్రభావం మేరకు నిర్మితమైందని అంటారు.
ఈ ఆలయంలోనే మూలవిరాట్టు అయిన సూర్యభగవానుడు తన ఇద్దరు సతులైన ఉషా, ప్రత్యూషలతో ఆసీనులై భక్తులకు దర్శనమిస్తుంటాడు. రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో ఉంటాడు. ఇక్కడ ప్రార్థనా మందిరం .. మంటపం రాతితో చెక్కబడ్డాయి, మిగిలిన మందిరాలు ఇటుకతో నిర్మితమయ్యాయి.
వినాయక్ మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఇక్కడ వేడిగా ఉండటం ప్రత్యేకత. అన్ని శివాలయాల్లో మహాదేవుడుకి ఎదురుగా నంది ఉంటుంది. కానీ, ఇక్కడ సూర్యదేవుడుకి ఎదురుగా అశ్వం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి రథాన్ని లాగేది గుర్రాలే కాబట్టి అశ్వం దర్శనమిస్తుంది.
ఈ ఆలయంలో పూజ చాలా నియమ నిష్ఠలతో చేస్తారు. పూజానంతరం ఆలయం చుట్టూ 9 సార్లు భక్తులు ప్రదక్షిణం చేస్తారు. ఈ నవగ్రహ దేవాలయాల ప్రదక్షిణను భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య భగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు. భక్తులకు ప్రసాదంగా కూడా దానినే పంపిణీ చేస్తారు.
శని, అష్టమ శని, ఏలినాటి శని, జన్మశని … గ్రహాల ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తున్న వారు ఆలయాన్ని సందర్శించి పూజలు చేయటం ద్వారా వారి కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని అంటారు. సూర్యభగవానుడితో పాటు గురుడుని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.