సుదర్శన్ టి…………………………..
సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు, 18వ శతాబ్దంలో మరాఠా నౌకాధ్యక్షుడు కానౌజీ ఆంగ్రే ఆధ్వర్యంలో జరిగిన సముద్ర యుద్దాలు కావచ్చు.
అవి సముద్రాల మీద భారత దేశానికి ఉన్న సుదీర్ఘమైన చరిత్రకు ప్రతీకలు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్నింటికన్నా గొప్ప వీరోచిత ఘటన ఆపరేషన్ ట్రైడెంట్, ఆ రోజును ఇప్పటికీ నౌకా దినోత్సవం కింద మనం జరుపుకొంటున్నాము. ఈ సంఘటన బంగ్లాదేశ్ యుద్దాన్ని మలుపు తిప్పింది.
1968లో భారత నౌకాదళం అప్పటి సోవియట్ యూనియన్ నుండీ Osa-1s మిస్సైల్ బోట్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. రష్యన్ భాషలో Osa అంటే తేనెటీగ అని చెపుతారు. దీనికి కారణం ఆ బోట్లలో అమర్చిన స్టిక్స్ క్షిపణులు.
ఈ శక్తివంతమైన క్షిపణులు పెద్ద యుద్ధనౌకలను సైతం పేల్చేయ గల సామర్ధ్యాన్ని కలిగిఉండేవి. వీటికి తోడు అందులో అమర్చిన హోమింగ్ రాడర్లు శక్తివంతమైనవి. ఈ రాడార్లు సమకాలీన సమయంలోని అన్ని దేశాల రాడార్ల కంటే సమర్ధవంతంగా పనిచేస్తాయి. అలాంటి ఈ నౌకలు సుదూరంలో జరిగే విషయాలను గమనించి ఏ రాడార్ కు దొరకకుండా క్షిపణులతో దాడి చేస్తుండేవి.
కానీ వీటికున్న ఒక బలహీనత అవి తీరం వెంబడి గస్తీకి నిర్మించిన పడవలు కావడం తో ఎక్కువ దూరాలకు ప్రయాణించే సామర్థ్యము వాటికి ఉండేదికాదు. అయినా ఇండియా వాటిని కొనుగోలు చేసి ఒక క్షిపణి నౌకల స్క్వాడ్రన్ ను ఏర్పాటుచేసి నావికులకు సైబీరియా ప్రాంతంలో ఎముకలుకొరికే చలికాలంలో 8 నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించింది.
1971, Osa-1s భారత్ చేరాయి. ముంబై పోర్టులో ఈ బొట్లు దింపే సౌకర్యం లేకపోవడంతో వాటిని కలకత్తాలో దింపి అటునుండి వేరే నౌకల సహాయంతో ముంబైకి చేర్చారు. ఈ అనుభవం ప్రపంచంలోనే మొట్టమొదటి నేవల్ స్ట్రాటజీ కి మూలంగా మారింది. కలకత్తా నుండి ముంబై తీసుకురాగలిగినప్పుడు ముంబై నుండీ కరాచీ వరకు సులభంగా తీసుకెళ్లగలరు.
డిసెంబరు 3, 1971 సాయంత్రం 5.45గం సమయం, పాకిస్తాన్ యుద్ధ విమానాలు 6 భారతీయ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇందుకు ప్రతీకారంగా భారతీయ వైమానిక దళానికి చెందిన కానబెరా విమానాలు పాకిస్తాన్ స్థావరాలను ముట్టడించాయి, దాదాపు అన్ని సెక్టర్లలో యుద్ధం మొదలయింది.
భారత్ కు చెందిన “కిల్లర్ స్క్వాడ్రన్” తమ శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఆసన్నమయినది. డిసెంబర్ 3 రాత్రి 3 Osa-1s బోట్లు INS-nipat, INS-nirgat, INS-veer లు, లెఫ్టినెంట్ కమాండర్లు బి.ఎన్.కవీనా, ఐ.జె.శర్మ, ఓ.పి.మెహతా ల ఆధ్వర్యంలో ముంబై బేస్ నుండీ బయలుదేరాయి. డిసెంబరు 4న, రెండు పెట్యా క్లాస్ కు చెందిన నౌకలు INS-katchall, INS-kiltonలు కలసి ఆపరేషన్ ట్రైడెంట్ టీం గా ఏర్పడ్డాయి.
మొదట పడమటి దిశగా వెళ్లి తర్వాత ఉత్తరం వైపు పయనించి పాకిస్తాన్లోని అత్యంత పటిష్టమైన కరాచీ నౌకా స్థావరాన్ని చేరుకున్నాయి. టీం మొత్తం రష్యన్ భాషలో మాట్లాడుకోటంవల్ల శతృదేశీయులు వీళ్ళను గుర్తుపట్టే అవకాశం బాగా తగ్గిపోయింది. రాత్రి 10గం 43ని, INS-నిర్గట్ లోని రాడార్లు రెండు పెద్ద లక్ష్యాలను గుర్తించాయి.
అవే పాకిస్తాన్ యుద్ధనౌకలు PNS-ఖైబర్, PNS-షాజహాన్. వీటికి తోడుగా వీనస్ ఛాలెంజర్ అనే వాణిజ్య నౌక పాకిస్తాన్ కు ఆయుధ మందుగుండు సామగ్రి తీసుకొచ్చి అక్కడే ఉంది. మన సైనికులు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా Osa-1s లు తమ స్టిక్స్ క్షిపణులను ఒకటి వెనుక ఒకటిగా ప్రయోగించి మూకుమ్మడి దాడి చేశారు.
ఏమి జరుగుందో అర్థం కాని పాకిస్తాన్ నేవీ అది ఇండియా యుద్ద విమానాల దాడి అనుకోని స్టిక్స్ క్షిపణులను తమ anti aircraft guns తో ఎదుర్కోవటానికి విపరీత ప్రయత్నాలు చేశాయి. (అదే సమయంలో భారత యుద్ద విమానాలు వేరే సెక్టార్ లో కేమారీ ఆయిల్ డిపో మీద దాడి మొదలెట్టాయి). PNS-ఖైబర్ రెండుముక్కలై సముద్ర గర్భానికి చేరింది. అప్పటికే ఇండియన్ స్క్వాడ్రన్ తీరం వెంబడి ఉన్న ఆయిల్ ట్యాంకులను తమ లక్ష్యంగా చేసుకొన్నారు.
తమ సామర్ద్యానికంటే ఎన్నో రెట్లు దూరం వెళ్లి, యుద్ద విమానాల దాడినుండి ఎటువంటి రక్షణ లేకుండా తమవద్ద మిగిలిన క్షిపణులను ప్రయోగించి తమ చిన్నపాటి పడవల్తో మొత్తం కరాచీ హార్బర్ ను అగ్నికి ఆహుతి చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం ట్రైడెంట్ టీం ఆపరేషన్ ను విజయవంతంగా ముగించుకొని వెను దిరిగింది.
ఇండియా టీం వెనుదిరిగిన చాలా సేపటి తర్వాత పాకిస్తాన్ యుద్దవిమానాలు తమ దేశానికే చెందిన PNS-జులిఫికర్ ను నీట ముంచి శతృదేశ పడవను నీట ముంచినట్టు ప్రకటించుకున్నారు. డిసెంబర్ 7న ఈ కిల్లర్ స్క్వాడ్రన్ ముంబై బేస్ చేరింది. 90 నిముషాల వ్యవధిలో 6 క్షిపణులు ప్రయోగించి, 3 యుద్ధ నౌకలను నీట ముంచి, ఆయిల్ నిల్వవుంచే అన్ని డిపోలను పూర్తిగా ధ్వంసం చేసి ఏమాత్రం ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా క్షేమంగా తమ స్థావరాన్ని చేరుకుంది ట్రైడెంట్ టీమ్.
మన టీమ్ ఆపరేషన్ ట్రైడెంట్ ఘనవిజయంతోనే తృప్తిపడకుండా … నాలుగురోజుల తర్వాత అదే పంథాలో ఆపరేషన్ పైథాన్ నిర్వహించి ఇంకో మూడు యుధ్దనౌకలను నీట ముంచి, ఆయిల్ డిపోలను పూర్తిగా ధ్వంసం చేసి పాకిస్తాన్ నేవీ నడుం విరిచేసింది. ఈ రెండు ఘటనలతో పాకిస్తాన్ భారత్ ను ఎదుర్కొనే శక్తిని పూర్తిగా కోల్పోయింది.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచ దేశాలు భారత నౌకా దళాల శక్తి సామర్ధ్యాలను ఆశ్చర్యచకితులై గమనించే స్థాయిలో ఈ రెండు సంఘటనలు జరిగాయి. ఇవి ఎంతలా ప్రపంచాన్ని ప్రభావితం చేసాయంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ కు ఇచ్చే morning- press brief లో ఈ విషయాన్నే ముందుగా ప్రస్తావించారు.
ఎవరూ అంచనా వేయని ప్రణాళిక, పక్కా వ్యూహాలు .. వాటిని సాహసోపేతంగా టీమ్ అమలు చేసిన తీరు ను ప్రభుత్వం ప్రశంసించింది. టీమ్ అసమాన ప్రతిభ, ధైర్యానికి గుర్తింపుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ముగ్గురు కమాండర్లకు వీర్ చక్ర, ఆపరేషన్ కమాండర్ BB యాదవ్ గారికి మహావీర్ చక్ర ప్రధానం చేశారు. ఈ వీరులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తుగానే ప్రతి ఏటా డిసెంబరు 4ను నేవీ-డే గా జరుపుకుంటున్నాం .