పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది. ఈ నారాయణ సరోవరం పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు.
ఈ ప్రదేశాన్ని టెంపుల్ కాంప్లెక్స్ గా మార్చారు. ఇందులో చిన్న ఆలయాలను దర్శించవచ్చు. కాంప్లెక్స్ కు ఒక పక్క నారాయణ సరోవరం ఉంది. ఎండా కాలంలో అతి తక్కువ నీళ్లతో కనిపిస్తుంది. కాంప్లెక్స్ వెనుక వైపు సముద్రం ఉంది. సముద్రంలో బోట్ షికారు సదుపాయం ఉంది. కాల క్రమంలో ఈ సరోవరం రూపురేఖలు చాలా మారాయి.
శివుడు ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరించాడట. ఆ లింగాన్ని అందుకున్న స్వీకరించిన రావణుడు అశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేసాడట.దీంతో కోపగించిన శివుడు లక్షల కోట్ల లింగాలుగా మారిపోయాడట. రావణుడు అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగమో గ్రహించలేక పోయాడట.
అసలు లింగాన్ని అక్కడే వదిలేసి చేతికి అందిన మరో లింగంతో వెళ్లిపోయాడని పురాణ కథనం. ఇలా శివుడు ఈ సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణ వన సరోవరం గా ఖ్యాతిగాంచింది అంటారు.
నారాయణ సరోవరం గురించి హిందూ పురాణ గ్రంథాలలో ఉందని భక్తులు చెబుతుంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజలు, జంతువులు, పక్షులు కరువు దెబ్బకు విలవిలాడిపోయాయి. ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితిలో సహాయం చేయమని శ్రీ విష్ణువును ప్రజలు కోరుకున్నారు. విష్ణు తన బొటనవేలుతో భూమిని తాకి, సరస్సు ను సృష్టించారనే కథనంకూడా ప్రచారంలో ఉంది. చైత్ర … కార్తీక మాసాలలో ఇక్కడ జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
నారాయణ సరోవర్ చుట్టుపక్కల ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. భుజ్ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం కు రెండుగంటల ప్రయాణమే. నారాయణ వన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఉచిత భోజనం , ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంది. కచ్ లేదా భుజ్ ప్రాంతానికి వెళ్ళినపుడు ఈ నారాయణ సరోవరం చూసి రావచ్చు.
————-Theja
ఇది కూడా చదవండి>>>>>>>>>>>>>> ఇదే రామాయణం నాటి పంపా సరోవరం !