అన్నగారితో సూపర్ స్టార్ నటించిన సినిమా!!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………….

An entertaining film…….. 

ఎన్టీఆర్, కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ఈ ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే చేశారు. ఎన్టీఆర్ తో కృష్ణ నటించిన ఐదు సినిమాల్లోనూ ఆయన తమ్ముని పాత్రలే చేశారు. కృష్ణ హీరోగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో ‘నిలువు దోపిడీ’ సినిమా 1968 లో విడుదలైంది. 

ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడైన యు.విశ్వేశ్వరరావు ఈసినిమా తీశారు. అంతకు ముందు హిట్ సినిమా ‘కంచుకోట’ కూడా ఆయనే నిర్మించారు. ఈ సినిమా తర్వాత విశ్వేశ్వరరావు కూతురును ఎన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ కిచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ వియ్యంకులు అయ్యారు. మంజులా సినీ సిండికేట్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సి. యస్.రావు దర్శకత్వం వహించారు.

‘నిలువు దోపిడి’ కథ క్లుప్తం గా చెప్పుకోవాలంటే  జమీందార్ జగపతి రాయలుకు ఇద్దరు కొడుకులు- రాము, కృష్ణ. జగపతి రాయలు ఎన్నో దానధర్మాలు, సేవాకార్యక్రమాలు చేసిన మనిషి. ఆయన  కుమారుల బాధ్యతను చెల్లెళ్ళు చుక్కమ్మ, శేషమ్మకు అప్పగించి కన్నుమూస్తాడు. 

కానీ చుక్కమ్మ ఆస్తి కాజేయాలని సమీప బంధువు భూషణం సాయంతో ఆ ఇద్దరు పిల్లలను మట్టుపెట్టాలని కుట్రలు చేస్తుంది. రాము,కృష్ణలు వాటి నుండి ఎలా తప్పించుకున్నారనేది అసలు కథ ..

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన దేవిక, కృష్ణ జోడిగా జయలలిత నటించారు. సాధారణంగా దేవిక ఒద్దికగా ఉండే పాత్రలనే వేస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్  నే మించిపోయి ర్యాగింగ్  చేస్తుంది.  వీళ్ళిద్దరి శృంగారం కూడా శృతి మించి ఆ రోజుల్లో విమర్శలకు గురయింది.సినిమా ముఖ్యంగా B ,C క్లాస్ సెంటర్లో బాగా ఆడింది. వాళ్ళ శృంగారం జనాలకు బాగా ఎక్కింది.

జయలలిత, కృష్ణ జంట బాగుంది. కృష్ణ ను జయ టీజ్ చేసే పాట .. చిత్రీకరణ బాగుంటుంది. ఆ ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. నాగభూషణం, నాగయ్య, రేలంగి, కాంతారావు, రాజనాల, ధూళిపాళ, ప్రభాకర రెడ్డి, పద్మనాభం, హేమలత, సూర్యకాంతం ఇతర పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి త్రిపురనేని మహారథి మాటలు రాయగా, శ్రీశ్రీ, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, యు.విశ్వేశ్వర రావు పాటలు అందించారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు.

ఇందులో “లోకం ఇది లోకం……….”, “ఆడపిల్లలంటేనే…”  , “అయ్యలారా ఓ అమ్మలారా…”, “నీ బండారం పైన పటారం..”, “జీవులెనుబది నాల్గు లక్షల చావు పుట్టుక ఇక్కడ.”, “అయ్యింది అయ్యింది… అనుకున్నది…” అంటూ సాగే పాటలు ఉన్నాయి. ఇవి పెద్దగా హిట్ కాలేదు.

‘చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్’ పాట మాత్రం సూపర్ హిట్ సాంగ్ ఆరోజుల్లో. ఎన్టీఆర్ ఇష్టమొచ్చినట్లు గోల గోల చేసే సినిమా. ఎన్టీఆర్ తో పాటు కృష్ణ కూడా కోయ దొర వేషం వేశారు. ఎన్టీఆర్ అదనంగా పహిల్వాన్ వేషం వేశారు.

ఆరోజుల్లో సినిమాలంటే హీరోకి మారు వేషాలు ఉండాల్సిందే . యూట్యూబులో సినిమా ఉంది.. పాటల వీడియోలు విడిగా ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనూ ప్రేక్షకులను అలరించింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!