త్వరలో రాజ్యసభకు జస్టిస్ చలమేశ్వర్ ?

Sharing is Caring...

త్వరలో పెద్దల సభకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను పంపే యోచన లో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాజ్య సభకు మేధావి వర్గానికి చెందిన వారినే పంపాలి. అయితే రాజకీయ పార్టీలు  ఎక్కువగా రాజకీయ నేతలనే ఎంపిక చేస్తుంటాయి.మేధావులను,రాజ్యాంగ నిపుణులను  పంపితే కీలకమైన బిల్లులు తదితర అంశాల్లో తమ వాదనలను వినిపిస్తారు. సూచనలు చేస్తారు. ప్రజలకు మేలు జరిగేలా సభలో మాట్లాడతారని, ప్రభుత్వాన్ని నిష్పాక్షింగా ప్రశ్నిస్తారని రాజ్యాంగం ఈ అవకాశం కల్పించింది. అయితే చాలామంది సభ్యులు నోరెత్తి మాట్లాడిన ఉదాహరణలే లేవు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈసారి రాజ్యసభకు అన్ని విధాలా అర్హులైన జస్టిస్ చలమేశ్వర్ ను ఎంపిక చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను రాజ్యసభ కు పంపడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలామంది రాజ్యసభ కు వెళ్లారు. కొంతకాలం క్రితం  పదవీ విరమణ చేసిన జస్టిస్ గొగోయ్ ను రాష్ట్రపతి ఈ సభకు నామినేట్ చేశారు. అంతకు ముందు జస్టిస్ రంగనాథ్ మిశ్రాను కాంగ్రెస్ రాజ్యసభకు పంపింది. ఇందిరాగాంధీ హయాంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బెహరూల్ ఇస్లామ్ గౌహతి హైకోర్టు జడ్జీగా  నియమితులయ్యారు. తర్వాత సుప్రీం జస్టిస్ కూడా అయ్యారు.

ఇక జస్టిస్ చలమేశ్వర్ విషయానికొస్తే ఆయన నిర్భయంగా దేన్నైనా ప్రశ్నించగల సత్తా ఉన్నవారు. న్యాయవ్యవస్థ పనితీరు విధానాన్ని ప్రశ్నించి సంచలనం సృష్టించారు. “అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్వహణ దాని ప్రమాణాలకు తగినట్లుగా లేదు” అంటూ 2018 జనవరి లో మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చారు. నాడు జస్టిస్ చలమేశ్వర్ తో కలసి వచ్చిన  న్యాయమూర్తుల్లో  జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు ఉన్నారు.సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కేసుల కేటాయింపు సరిగా లేదని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ విషయంపై మాట్లాడినా ఫలితం లేకపోయిందని గత్యంతరం లేక, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని జస్టిస్ చలమేశ్వర్ అప్పుడు వివరించారు.

ఆ తర్వాత ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూ లో ‘‘ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరి పనితీరునూ ప్రజలు నిశితంగా పరీక్షిస్తారు. మంత్రులు, గవర్నర్ల పనితీరు పైనా ప్రతి రోజూ ప్రజలు, మీడియా మాట్లాడుతుంటాయి. అవి అన్నివేళలా వారిని మెచ్చుకునేలా ఉండవు. న్యాయమూర్తులు కూడా ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారే. వారు కూడా తమ బలాలు, బలహీనతల మేరకు పనిచేస్తుంటారు. వారిని కూడా ప్రజలు నిశితంగా పరీక్షించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పదవిలో ఉన్న వారు ఎవరూ ఈ పరీక్షకు అతీతం కాదు’’ అని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ స్పష్టంగా చెప్పారు.ఆ రోజు మా ప్రెస్ మీట్ వలన ఆశించిన ఫలితం రాలేదు కానీ.. ప్రజల్లో అవగాహన పెరిగిందని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.కొలీజియం వ్యవస్థను ఆయన బహిరంగంగా వ్యతిరేకించారు. ప్రధాని మోడీ ప్రతిపాదించిన నేషనల్ జుడీషియరీ అపాయింట్మెంట్ కమీషన్ ను ఏర్పాటు చేయాలని కోరిన ప్రముఖుల్లో చలమేశ్వర్ ఒకరు.

జస్టిస్ చలమేశ్వర్ 2011 అక్టోబర్ 10వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఏడు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగిన ఆయన 2018 జూన్ 22వ తేదీన పదవీ విరమణ చేశారు. జస్టిస్ చలమేశ్వర్ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు లభించింది.1995 అక్టోబర్ 30వ తేదీన అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తిగా పనిచేశారు. పలు కీలక తీర్పుల్లో ఆయనకు ప్రశంసలు లభించాయి. రాజ్యాంగ  నిపుణుడిగా మంచి పేరు సంపాదించారు.

కాగా జస్టిస్ దీపక్ మిశ్రా .. చలమేశ్వర్ అరగంట తేడాలో న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాని కారణంగా చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి పదవికి జరిగిన ఎంపిక లో వెనుక బడ్డారు. ఆల్ఫాబెట్ ప్రకారం ముందు జస్టిస్ చలమేశ్వర్ కే అవకాశం రావాలి.  కానీ అలా రాకుండా చంద్రబాబు,మరొకరు అడ్డం పడ్డారనే ప్రచారం కూడా వ్యాప్తిలో ఉంది.
చలమేశ్వర్‍ దివంగత నేత ఎన్టీరామారావుకు దూరపు  బందువు అవుతారు. ఎన్టీఆర్‍ రెండవ కుమారుడైన సాయికృష్ణ కుమార్తెను చలమేశ్వర్‍ బావమరిది వివాహం చేసుకున్నారు. కాకతీయ సిమెంటు అధినేత కీ.శే.వేంకటేశ్వర్లు కు స్వయాన అల్లుడు చలమేశ్వర్‍. ఆయన  కొన్నాళ్ళు టీడీపీ లాయర్ గా కూడా చేశారు. పార్టీ ఆస్తులు .. హక్కులకు సంబంధించిన కేసు ఆయనే వాదించారు. అందరూ జస్టిస్ చలమేశ్వర్ చంద్రబాబుకి సన్నిహితుడు అనుకుంటారు.  కానీ అది నిజం కాదు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఆయన సన్నిహితుడు.
కృష్ణా జిల్లా కు చెందిన జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు నాగభూషణం కూడా న్యాయవాదే. ఇటీవలే  ఆయన ను  ఏపీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది.

————— KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!