Taadi Prakash ………………………………………………………..
Who is this Bangore ……………………………
సాహిత్యం… బంగోరె… పరిశోధన… ఇవి మూడూ వేర్వేరు మాటలు కావు. ఒక్కటే. తపన… శోధన… రచన అన్నా అదే అర్థం. ఒక బ్రౌను. ఒక రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ. ఒక ఆరుద్ర, అవును… ఆ రాక్షస పరిశోధకుల వారసుడు బంగోరె ఒక్కడే. పుస్తకాల సేకరణ… ఆ పుస్తకాలతోనే బతుకు…పుస్తకం రాయడమే వ్యాపకం. బంగోరె అంటే నాకు… పుస్తకం అనే ఒక జ్ఞాపకం!
బండి గోపాలరెడ్డి అనే మొండి పరిశోధకుణ్ణి గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకలా చేశాడో అనుకున్నా, మనసుకి కష్టం అనిపించినా నేను ప్రేమించిన నా హీరో నా తలపుల్లో తచ్చాడటం ఎంతో యిష్టం.అది 1981వ సంవత్సరం అక్టోబరు నెల కావొచ్చు. విశాఖ ‘ఈనాడు’లో పని చేస్తున్న రోజులు.
మా ఇన్ ఛార్జులు, జర్నలిస్టులు సలీం, చంద్రమౌళి, సీతారాంరెడ్డి.ఆంధ్రా యూనివర్శిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ రీసెర్చి స్కాలర్ అయిన సీతారాంరెడ్డి గారు ఈనాడులో పని చేసేవారు. చాలాసార్లు నైట్ డ్యూటీ అయిపోయాక, సీతారామ్ గారూ, నేనూ అర్థరాత్రి నడుచుకుంటూ అడ్డదారిన యూనివర్శిటీకి వెళ్లేవాళ్లం.
woodhouse humor నుంచి ప్రసిద్ధ స్టేజి నటుడు కె.వెంకటేశ్వరరావు దాకా, సీతారాం అనేక విషయాలు ఎంతో బాగా చెప్పేవాడు. అప్పుడు యూనివర్శిటీలో బంగోరె వుండేవాడు. అప్పటికి జియో ఫిజిక్స్ లెక్చరర్ అయిన చందు సుబ్బారావు, బంగోరెకి మంచి మిత్రుడు. అందరం ఎక్కువగా ఫేకల్టీ క్లబ్బు దగ్గరే కలిసేవాళ్లం. చందు బంగోరెకి నన్ను పరిచయం చేశారు.
నిండైన మనిషి. పలకరింపు, మాటలు ఎంతో బావుండేవి. అప్పుడు ‘వేమన-సి.ఆర్.రెడ్డి’ ప్రాజెక్టు చేస్తున్నారు. ఫేకల్టీ క్లబ్ పైన నాలుగు గెస్ట్ రూంలు… ఒక దాంట్లో బంగోరె వుండేవారు. ఒక సాయంకాలం బంగోరెతోపాటు ఆయన రూంకి వెళ్లాను. నా ఆశ్చర్యానికి అంతులేదు. అలా ఆగిపోయాను. ‘కూర్చో’ అంటున్నారాయన.ఎక్కడ కూర్చోవాలి? కింది నుంచి పైదాకా అన్నీ పుస్తకాలే. ఆయనకి సరిపడా ఒక సింగిల్ కాట్.
ఎత్తుగా చక్కగా పేర్చి వున్నాయి పుస్తకాలు. పక్కన, అటూ ఇటూ అన్నీ పుస్తకాల గుట్టలే. ఇదేం పరిశోధన దేవుడా! బంగోరెని చూస్తే కాస్త భయం వేసింది నాకు.తర్వాత ఫేకల్టీ క్లబ్బు దగ్గరా, రెండు మూడు సభల్లోనూ ఆయన్ని కలిశాను. ఓ రోజు యూనివర్శిటీలో సాహిత్య సభ వుందని తెలిసి వెళ్లాను. ఒక లెక్చరర్ ఇంట్లో విశాలమైన హాల్లో గోడలకు చేరబడి 30 నుంచి 40 మంది కిందనే కూర్చుని వున్నారు. అందరి ముందూ విస్కీ గ్లాసులు వున్నాయి.
ఒక్క గొంతు మాత్రం గంభీరంగా వినిపిస్తోంది. బంగోరె కవిత్వం చదువుతున్నారు. అంతా శ్రద్ధగా వింటున్నారు. ఖలీల్ జిబ్రాన్, ప్రాఫెట్ చదుతువున్నారాయన. ‘‘ఓహ్, భలే వుంది. ఏదీ ఆ stanza మళ్లీ చదవండి’’ అంటున్నారెవరో. బంగోరె జర్నలిస్టు అనీ పరిశోధకుడనే మనకి తెలుసు. ఆ రోజు బంగోరె baritone voiceతో ఆ గది ప్రతిధ్వనిస్తోంది. ఖలీల్ జిబ్రాన్ గాని చదవడం లేదు కదా అన్పిస్తోంది! ఆ కవిత్వ పఠనం, ఆ సీరియస్ నెస్ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. బంగోరెకి షేక్ హ్యాండిచ్చి వచ్చేశా.
విశాఖలో యూనివర్శిటీ పక్కనే వుండే తుమ్మల వేణుగోపాలరావు, కృష్ణాబాయి, చలసాని ప్రసాద్, అత్తలూరి నరసింహారావు గార్లతో బంగోరె సన్నిహితంగా వుండే వారు. అక్కడ ఒంటరి జీవితం గనక కొన్ని సాయంత్రాలు బంగోరె, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, పురిపండా అప్పలస్వామిగార్లతో గడిపేవాడు.
ఎక్కువగా చందు సుబ్బారావుతో కబుర్లు, ఈవెనింగ్ పార్టీలూ నడిచేవి. ఆంధ్రా యూనివర్శిటీకి 26 సంవత్సరాలు రిజిస్ట్రారుగా పని చేసి రిటైరైన కె.వి.గోపాలరావు నాయుడు, బంగోరెనీ, చందూనీ సాయంకాలం కబుర్లకీ, మందు పార్టీకీ పిలిచేవాడు. ‘లా’లో నిష్ణాతుడైన గోపాలరావు గారు పిలవడం అంటే యూనివర్శిటీలో అదో పెద్ద గౌరవం కింద లెక్క.
వేమన సాహిత్యంపై విశాఖలో జరిగిన ఒక సభకి రావిశాస్త్రిని పిలిచారు. బంగోరె, చేకూరి రామారావు, పురిపండా సభలో వున్నారు. రావిశాస్త్రి మాట్లాడుతూ ‘‘నా గురించి వేమనకి ఎంత తెలుసో, నాకు వేమన గురించీ అంతే తెలుసు’’ అని జోకేశారు! సభ అయిపోయాక రావిశాస్త్రి టీ తాగుతూ, చుట్టూ చేరిన రచయితలతో కబుర్లు కొడుతూ, ‘‘కొన్ని పెద్దల సభలకి, జ్యోతిలక్ష్మిని కూడా పిలుస్తుంటారు. జనం వస్తారని. నన్ను వాళ్లు అలా పిలిచారన్న మాట’’ అన్నారు. అంతా గొల్లున నవ్వారు. ఆ జోకుని పదే పదే చెప్పుకుని విశాఖ రచయితలు చాలా రోజులు ఎంజాయ్ చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన బంగోరె 1938 అక్టోబరు 12న జన్మించారు. ఓ మామూలు రైతు కుటుంబం. ఆంధ్రా యూనిర్శిటీలో ఎం.కాం ఆనర్స్ చదివారు. పాత్రికేయుడు, రచయిత, విమర్శకుడు, పరిశోధకునిగా మంచి పేరు. సి.పి.బ్రౌన్, గురజాడ, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, వేమనల మీద అనితర సాధ్యమైన రీసెర్చి చేసి పుస్తకాలు ప్రచురించారు.
బ్రౌన్ జర్నలిజం చరిత్ర, బ్రౌన్ సాహిత్య చరిత్ర, ఉన్నవ మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు వంటి అంశాలపై గ్రంథాలు రాశారు. 1964 నుంచి 1971 దాకా ‘జమీన్ రైతు’ పత్రిక సహాయ సంపాదకునిగా ఉన్నారు. మద్రాసులో ‘అమెరికన్ రిపోర్టర్’ పత్రిక జర్నలిస్టుగా ఒక ఏడాది పని చేశారు.
Pl.read it also ……………. సట్లెజ్ కెరటాలు పిలిచాయా బంగోరె! (2)