ఇంతకూ దీదీ గెలుస్తున్నారా ?  

Sharing is Caring...

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఒక వేళ గెలిచినా స్వల్ప మెజారిటీ తో గెలుస్తుందని అంటున్నారు. బీజేపీ విసిరిన సవాల్ ట్రాప్ లో పడి దీదీ భవానిపూర్ నియోజకవర్గం వదిలి ఇక్కడ పోటీ చేశారు. 2016 లో దీదీ భవానీపూర్ లో దాదాపు 25 వేల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు 2011 లో జరిగిన ఉప ఎన్నికలో 54 వేల ఆధిక్యతతో విజయం సాధించారు.

నందిగ్రామ్ లో కూడా తృణమూల్ కి మంచి పట్టు ఉంది. ఈ అసెంబ్లీ స్థానం 1951 నుంచి 1962 వరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. తరువాత 1967 నుంచి 2006 వరకు కమ్యూనిస్టుల చేతిలో ఉన్నది. మధ్యలో ఒకసారి జనతాపార్టీ అభ్యర్థి గెలిచారు. 2009 జరిగిన ఉపఎన్నిక నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ పట్టు బిగించింది. 2009 ఉపఎన్నికలో, 2011సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజా బేబీ తృణమూల్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. 2016 లో సువెందు అధికారి తృణమూల్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అతగాడు బీజేపీ లోకి మారడం తో దీదీ కి కోపమొచ్చి సువెందు ను అసెంబ్లీ గడప తొక్కనివ్వనని శపథం చేశారు. దాంతో దమ్ముంటే నందిగ్రామ్ లో పోటీ చేయాలని బీజేపీ నేతలు సవాల్ విసిరారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన  సువెందు అధికారికి ఈ నియోజక వర్గం పై కొంత పట్టు ఉంది.అతని బంధుగణం అంతా అక్కడే ఉంది. భూపోరాటాలలో సువెందు కూడా నాడు కీలకపాత్ర పోషించారు.

ఇక నందిగ్రామ్ బరిలోనే మమతా 2011 లో భూపోరాటాలు చేశారు. కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడారు. అక్కడ మమతాకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఎలాగైనా దీదీ ని ఓడించాలనే లక్ష్యంతో బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డింది. నియోజకవర్గంలో మమత ప్రచారం చేసినప్పటికీ ఓటర్లను స్వయంగా కలవలేకపోయారు.  భవానీపూర్ లో పోటీ చేద్దామనుకుని కూడా బీజేపీ నేతల విమర్శలను పట్టించుకుని నందిగ్రామ్ కే పరిమితమైనారు. అక్కడ గెలుపు కోసం  హిందూ కార్డును ఉపయోగించారు. ఆలయ దర్శనాలకు వెళ్లారు. ఇక్కడ 70 శాతం ఓట్లు హిందువులవే.మరో 25 శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. రెండు వర్గాల్లోనూ దీదీకి పలుకుబడి ఉంది. 

ఇక ఇప్పటివరకు మమతా పొలిటికల్ కెరీర్ లో ఒకే ఒక్కసారి ఓడిపోయారు. మమతా 29 ఏళ్ళ వయసులో 1984లో జాదవపూర్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోకసభ స్పీకర్ సోమనాథ ఛటర్జీని ఓడించారు. అప్పట్లో ఆ ఎన్నిక ఓ సంచలనం.ఆ తర్వాత 1989 లో అదే స్థానం నుంచి పోటీ చేసి మాలినిభట్టాచార్య చేతిలో 30900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బోఫోర్స్ కుంభకోణం, రాజీవ్ గాంధీ పై వచ్చిన వ్యతిరేకత దీదీ ఓటమి కి కారణాలు అయ్యాయి. 91 లో కలకత్తా సౌత్ నుంచి మళ్ళీ విజయం సాధించారు. 96 లో కూడా గెలిచారు.

98 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక మళ్ళీ అదే స్థానం నుంచి 2.24 లక్షల భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఓటమే లేదు. దీదీ రాజకీయ జీవితంలో పార్లమెంట్ కే ఎక్కువ సార్లు పోటీ చేశారు.తాజా ఎన్నికల్లో పార్టీ గెలిచి ఆమె ఓడినా మళ్ళీ సీఎం అవడం ఖాయం. ఆరునెలలలోగా మరో స్థానం నుంచి గెలుస్తారు. అందుకే దీదీ ధీమాగా ఉన్నారు. 

—————-KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!