తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేశారని …కట్టుకథలు అల్లారని ఈటల చెబుతున్నారు. ఒక ఎకరం భూమి కూడా తన స్వాధీనంలో లేదని … అంతిమ విజయం ధర్మానిదే అని తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు.
“పౌల్ట్రీ కి ఎక్కువ భూమి అవసరం కాబట్టి కెనరా బ్యాంక్ ద్వారా 100 కోట్ల ఋణం తీసుకున్నాం. విస్తరణ కోసం పరిశ్రమల శాఖ కు లేఖ కూడా రాసాను. ఇదే విషయాన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. భూమిని రైతులే స్వచ్చందం గా సరెండర్ చేశారు. అదసలు వ్యవసాయ భూమి కాదు. ఎకరా 6 లక్షలు చొప్పున 40 ఎకరాలు కొనుగోలు చేసాం. నేను ఎవరి భూమిని కబ్జా చేయలేదు. నా మొత్తం చరిత్ర .. ఆస్తులపై విచారణ జరిపించండి. ఎక్కడైనా తప్పుచేసినట్టు తేలితే ఏ శిక్ష కైనా సిద్ధం … ఈ పదవి గొప్పదేమీ కాదు నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కొన్ని చానళ్ళు పెయిడ్ మీడియా గా పనిచేస్తున్నాయి. ఈ ఆరోపణలపై సీఎం విచారణ చేయించాలి” అని ఈటల డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మంత్రి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీ ఆర్ ఎస్ లో ఈ ఆరోపణల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. మంత్రిని తొలగించవచ్చని ప్రచారం జరుగుతోంది. మిగతా ఛానల్స్ తో పాటు అధికార పార్టీ ఛానల్ లో కూడా ఆరోపణల కథనాలు ప్రసారమైనాయి.
ఇటీవల మంత్రి మేము కిరాయిదారులంకాదు … పార్టీకి ఓనర్లమంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి పార్టీ కీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందన ఏమిటో తెలియాల్సి ఉన్నది.