సుమ పమిడిఘంటం ………………………………..
His style is different ………………………………………..
విజయవాడకు చెందిన కాట్రగడ్డ వారి కుటుంబం ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీలోనూ, సినిమాపరిశ్రమలోనూ లబ్ధప్రతిష్టమైంది. కాట్రగడ్డ ఇంటిపేరుతో చలామణి అవటం ఆయనకిష్టం లేదు. మురారి బావ డా.పిన్నమనేని నరసింహారావు గారు గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉండటం వలన బంధువుల వద్ద చదవటం ఇష్టం లేక వరంగల్ మెడికల్ కాలేజ్ లో డొనేషన్ కట్టి మరీ చేరారు.
నాలుగుసంవత్సరాలు చదివి మెడిసన్ మానేసి సినిమా డైరెక్టర్ అవుదామని మద్రాసు చేరారు. మురారికి ఇంగ్లీషు సినిమాలు, నవలలు చదవడం బాగా అలవాటు. తెలుగు సరేసరి.ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, వి.రామచంద్రరావు వద్ద అల్లూరి సీతారామరాజు కు … కె.యస్.ప్రకాశరావు లాంటి దిగ్దంతుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు.
శోభన్‌బాబు, మురారి ఒరే ఒరే అని పిల్చుకునే స్నేహితులు. మురారి మొదటి సినిమా సీతామహాలక్ష్మికి శోభన్‌బాబు హామీవుండి కె.విశ్వనాథ్ ని దర్శకుడిగా ఒప్పించి నిర్మింపజేశారు. వి.మధుసూదనరావు వద్ద ఏ.కోదండరామిరెడ్డి, మురారి అసిస్టెంట్సుగా చేశారు. తరువాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సినిమా కూడ తీశారు మురారి.
అంత స్నేహంవున్న శోభన్‌బాబుతో దాసరి దర్శకత్వంలో ఒకే ఒక్క సినిమా గోరింటాకు తీశారు మురారి. ఆత్రేయ రాసే ప్రతి పాట పల్లవికి చరణానికి విడివిడిగా వెయ్యేసి రూపాయలు ఇచ్చేవారు మురారి OK అయిన దాకా. వేటూరికైతే మొదటి పల్లవి ఓకె ఐతే ఆ వెయ్యితోనే సరి. లేకపోతే ఓకె అయినదాకా ప్రతి పల్లవికి వెయ్యిచొప్పున ఇవ్వాలి. ఇక చరణాలకు వేరే ఇచ్చేపనిలేదు.
కాట్రగడ్డ వారికి సినిమా పరిశ్రమలో గొప్ప పేరుప్రఖ్యాతులున్నాయి.ఊరికే గాలికి తిరగడం దేనికి, నావద్దకు వచ్చి పని జెయి అని చక్రపాణి అనగానే ఠపీమని ఆయన వద్ద చేరారు మురారి. మురారికి చక్రపాణి, దేవులపల్లి, పాలగుమ్మి పద్మరాజు , కె.వి.మహదేవన్, శ్రీశ్రీ అంటే చాలాఇష్టం. వారితో సాన్నిహిత్యం కూడా ఎక్కువే.
అన్ని సినిమాలకు మహదేవన్ చేతనే మ్యూజిక్ చేయించుకున్నారు.మురారి ముక్కోపి. కథ, పాటలు తను స్వయంగా చర్చలలో పాల్గొని చేయించుకోవటం అలవాటు. చాలా కాంట్రవర్షియల్ అనే పేరుంది. కె.విశ్వనాథ్ “నాకథా, మ్యూజిక్ చర్చలలో నిర్మాతను ఎలౌ చెయ్యను” అంటే నేను లేకుండా నాసినిమా చర్చలు జరగటానికి లేదని భీష్మించుకుని కూర్చున్నారు మురారి. విశ్వనాథ్ కు తప్పనిసరి అయింది.
విజయ బాపినీడుతో కలిసి సినిమా తీస్తుంటే ” మంచి టేస్టున్నవాడివి. మంచి మంచివి తీసినవాడివి. బూతుపత్రికలు నడిపేవాళ్ళతో తియ్యడానికి నీకేం కర్మపట్టిందని తిట్టారట శ్రీశ్రీ. ‘ఆఖరుగా మహదేవన్ గారిని పిలిపించి ‘పవమాన సుతుడు పట్టు’ కీర్తనను తనకిష్టమైన హిందోళంలో చెయ్యమన్నారట మురారి.
మామ పుహళేంది వైపు ‘వీడికేమైనా పిచ్చిపట్టిందా’ని వింతగా జూసి “ఒరే మురారి! ఇది కచేరీలలో ఆఖరున మంగళం పాడే కీర్తనరా!” అన్నారట. అంతే. 1990 తరువాత మురారి సినిమా తీయలేదు. మహదేవన్ మరణించినపుడు మురారి, బాలసుబ్రమణ్యం , జయలలిత తప్ప సినిమా వారెవరూ రాలేదు; మహదేవన్ సహ వాయిద్యకారులుతప్ప.
మురారి యువచిత్ర బ్యానర్ లో సీతామాలక్ష్మ,గోరింటాకు,జేగంటలు,త్రిశూలం, అభిమన్యుడు,సీతారామ కల్యాణం, శ్రీనివాస కళ్యాణం,జానకిరాముడు, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలు తీశారు. ఆయన సినిమాల్లో పాటలన్నీ హిట్ సాంగ్స్ కావడం విశేషం. ఈయన తెలుగు నిర్మాతల చరిత్ర, తన అనుభవాలతో నవ్విపోదురుగాక… రెండు పుస్తకాలు వ్రాశారు. ఇది పది పన్నెండు ఎడిషన్లు పడింది. కె.మురారి 15.10’22 న మరణించారు.