రామప్పగుడి అందాలు వర్ణించ తరమా !

Sharing is Caring...

ఆంజనేయులు మాముడూరు .……………………………………..

Stunning sculptural beauty………………………………..అరుదైన దేవాలయాలు ..అద్భుతమైన శిల్పకళా సౌందర్యం రామప్ప గుడి(పాలంపేట),కోటగుళ్లు(గణపురం) లో మనకు కనిపిస్తాయి. అక్కడి అందాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవి కానివి. కాకతీయుల శిల్ప చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తుంది.

భరత నాట్య శాస్త్రమంతా మూర్తీభవించి, స్థంభాల మీద, కప్పుల మీద కనబడుతుంది. రామప్ప గుడిలో విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్ల రాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల  అలంకరణలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తాయి. దేవాలయంలో స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల రేఖా చిత్రాలు అద్భుతంగా ఉంటాయి.  

జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ కనిపిస్తుంది. 
చరిత్రలోకి వెళితే ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు.

ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం ఉంటుంది.  అంతర్భాగం లో  మూడు వైపుల ప్రవేశ ద్వారం గల మహామండపం కనిపిస్తుంది.  గర్భాలయం లో ఎత్తైన పీఠంపై నల్లని  రాతితో చెక్కిన పెద్ద శివలింగం  భక్తులను ఆకట్టుకుంటుంది. మహామండపము మధ్య భాగంలో కుడ్య స్తంభాలు ..వాటిపై రాతి దూలాలపై  రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన రమణీయ శిల్పాలు కనువిందు చేస్తాయి.

ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకలపై వివిధ భంగిమలతో  మదనిక, నాగిని శిల్పాల సోయగాలు కాకతీయుల శిల్ప కళాభిరుచికి దర్పణంగా నిలుస్తాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలు ఆలయాలు చూడదగినవి. దేవాలయం లోని  శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి కి అద్దం పడతాయి. ఈ దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవని  అంటారు. 

ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్టు కనిపిస్తుంది. ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నవిధంగా గోచరిస్తుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు మనల్ని ఆకట్టుకుంటాయి.  మండపం పైకప్పు మీద  శిల్ప కళా సౌందర్యం అద్భుతం. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. ఈ గుడి పై  ఎన్నో దండయాత్రలు జరిగాయి.  

17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం కారణంగా ఆలయ ముఖద్వారం దెబ్బతిన్నది.. నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం  నృత్య రీతిని ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు.కోటగుళ్లు: గణపురం(ము) మండల కేంద్రంలోని కాకతీయ చక్రవర్తుల అపూర్వ శిల్పకళా వైభవ శాల గణపేశ్వరాలయ సముదాయం(కోటగుళ్లు). అబ్బురపర్చే శిల్ప సౌందర్యంతో శతాబ్దాలుగా అలరిస్తోంది. ఈ ఆలయ సముదాయం ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట శిల్ప సంపదకు ఏ మాత్రం తీసిపోదు.ఇన్నాళ్లకు యునెస్కో రామప్ప ఆలయాన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. 

PL.WATCH VEDEO  ………………….  రామప్ప గుడి

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!