ఆపాట కోసం అంత కష్ట పడ్డారా ?

Sharing is Caring...

A song loved by music lovers ………………………………………..

సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని  సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే  సంగీత ప్రపంచం లోనే  ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది.

ఆపాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి,  మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, పాత్రధారి ఎన్టీఆర్, గీత రచయిత పింగళి నాగేంద్రరావు ఎంతగానో  శ్రమించారు. అలాగే ప్రముఖ ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ ట్లే  కూడా ఆ పాట ను అద్భుత రీతిలో  చిత్రీకరించి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశారు.  

‘జగదేకవీరుని కథ’ సినిమాలో మిగతా పాటల రికార్డింగ్, వాటి చిత్రీకరణ తర్వాత ఈ శివశంకరి’ పాటను  స్వరపరిచారు. క్లైమాక్స్ షూటింగ్ ఇంకా రెండు నెలల్లో ఉందనగా దర్శకుడు కే. వీ.రెడ్డి,  సంగీత దర్శకుడు పెండ్యాలను ఒక రోజు పిలిపించారు. 

“పూర్వం నారదుడు, తుంబురుడు  సంగీతానికి ఉన్నశక్తి గురించి వాదనకు దిగారు. ఆ సందర్భంలో  హనుమంతుడు ఒక పాట పాడగా శిలలు కరిగాయట. ఈ యుగంలో కూడా తాన్సేన్ పాడితే దీపాలు వెలిగాయట,  బీహార్ రాష్ట్రం క్షామంతో తల్లడిల్లిపోతుంటే పండిట్ ఓంకార నాథ్ ఠాకూర్ వరుసగా ఆరు రోజుల పాటు ‘మేఘ మల్హర్’ రాగం పాడితే  వర్షాలు కురిశాయట.  

ఇప్పుడు  మన సినిమాలో అలాంటి  పాట చేయబోతున్నాం .. మీరు చేయబోయే ఆ పాట సినిమాకు ప్రాణం .. అంటూ కథా సందర్భం గురించి వివరించారు కే. వీ.రెడ్డి. ఆమాటలు  విన్నపెండ్యాల వారు ఆలోచనలో పడ్డారు. ‘మద్రాసులో ఇప్పుడు ‘జగదల ప్రతాపన్’ అనే సినిమా ఆడుతోంది. మన కథకు బేస్ అదే. కావాలంటే వెళ్లి చూడండి” అంటూ కే. వీ. రెడ్డి చెప్పారు.”వద్దండీ…. చూస్తే ఆ ప్రభావం నా ఆలోచనకు అడ్డు పడొచ్చు . మనమే తయారు చేద్దాం, నా శక్తి మేరకు ప్రయత్నిస్తా ” అన్నారు పెండ్యాల.

మరుసటి రోజు  సిట్టింగ్ లో చిన్నపేపర్ మీద “శివశంకరీ శివానందలహరి’ అంటూ రాసి కే. వీ.రెడ్డి కి చూపించారు రచయిత పింగళి నాగేంద్రరావు. దానికాయన ‘బాగుందండీ… అంటూ పెండ్యాల గారికి ఇచ్చారు.  “ఆర్తి బాగా కనబడాలి… మీ ఇష్టమొచ్చిన రాగాల్లో వినిపించండి” అన్నారు.పెండ్యాల బాగా ఆలోచించి ముల్తానీ, ఘూర్జరీ, తోడీ, కాళింగడా, దర్బారీ, అసావేరి రాగాలలో ఆ పల్లవిని పాడి వినిపించారు.

కే. వీ.రెడ్డి, పింగళి నాగేంద్రరావు లకు దర్బారీ రాగంలో చేసిన ట్యూనే నచ్చింది. పాట చరణాలను రెండో రోజు  ఇచ్చారు పింగళి.  ‘నాగేశ్వరరావు గారూ…. మొత్తం పాటంతా మీ చేతికొచ్చింది…… ఇక మీ ఇష్టం.. మీరెప్పుడు వినిపిస్తానంటే అప్పుడే  వింటాం. ” అన్నారు కే. వీ.రెడ్డి . నాటి నుంచి  ఓ పదిహేను రోజుల పాటు ఇంటి వద్దనే  కూర్చొని స్వరరచన చేశారు పెండ్యాల. ఒకరోజు మళ్ళీ సిట్టింగ్ వేశారు.  

పెండ్యాల పాడడం మొదలు పెట్టారు. అంతా శ్రద్ధగా వింటున్నారు. పాట వినడంలో  లీనమయ్యారు. తల, కాళ్ళు, చేతులు రిథమిక్ గా ఊపుతున్నారు. అది చూసి పెండ్యాల మరింత ఉత్సాహంతో పాడారు. పాట పూర్తయిన కాసేపటి  వరకూ నిశ్శబ్దం. ‘నాగేశ్వరరావు గారూ…… పాట చాలా బావుంది..  కానీ….’ అంటూ ఆగారు కేవీరెడ్డి. ఆ మాటతో పెండ్యాల టెన్షన్ పడ్డారు. 

“ఏం లేదండీ….. టైం చూసుకున్నారా…..పాట  పదమూడు నిమిషాలు వచ్చింది … ఆ పదమూడు నిమిషాలపాటు తెరమీద ఏం చూపించమంటారు మమ్మల్ని? కాబట్టి నిడివి తగ్గాలి ..  ఆరున్నర నిమిషాలు మేగ్జిమమ్ ….. అంతే…..’ అన్నారు కే. వీ. రెడ్డి.  మరో నాలుగు రోజులు కష్టపడి పాటకు  చిత్రిక పట్టి .. నిడివి తగ్గించి …  ఆ తర్వాత వినిపించారు పెండ్యాల. కే. వీ.రెడ్డి ఒకే అన్నారు వెంటనే ఘంటసాల ను పిలిపించి పాట వినిపించారు.

పాట వినగానే…  బ్రహ్మాండం.. …. ఈ పాట కోసం  పదిహేను రోజులైనా సరే నేను రిహార్సల్ కి వస్తాను అన్నారు ఘంటసాల. అలాగే క్రమం తప్పకుండా వచ్చి సాధన చేశారు కూడా. అద్భుతంగా ఆ పాట పాడారు. పాట రికార్డింగ్ ముగిసింది. అపుడు ఎన్టీఆర్ ని పిలిపించి పాట వినిపించారు. 

హిందూస్థానీ విద్వాంసులు పాడుతున్నప్పుడు, పరికరాలు వాయిస్తున్నప్పుడు కొన్ని కొన్ని విన్యాసాలు చేస్తారు. మాస్టారితో పాటు కూర్చుని అవన్నీ ప్రాక్టీస్ చేస్తాను” అన్నారు ఎన్టీఆర్.  నాలుగు రోజులు రిహార్సల్సు చేయటమే కాకుండా, ‘మాస్టారూ…… షూటింగ్ సమయంలో కంప్లీట్ గా మీరు సెట్ మీదే ఉండాలి” అన్నారు.

ఘంటసాల పాట పాడిన విధానాన్ని దగ్గరుండి గమనించారు. ముఖ్యంగా లిప్ కదలిక పై దృష్టి పెట్టారు. పాటను ఎన్నో సార్లు విని కంఠతా వచ్చేలా ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేశారు. తర్వాత వారం రోజుల పాటు  శివశంకరీ పాట షూటింగ్ జరిగింది. పాట మొత్తంలో ఎక్కడా కూడా తడబడకుండా  లిప్ మూవ్మెంటు ఇస్తూ .. అద్భుతమైన హావభావాలను ప్రదర్శించారు.

ఈ పాటలో అయిదుగురు ఎన్టీఆర్లు కనిపిస్తారు తెరపై. ఎన్టీఆర్ తన నటనా విన్యాసంతో  యూనిట్‌ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. వెండితెరపై ఆ పాటకు, ఎన్టీఆర్‌ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ పాట చిత్రీకరణ తీరు కూడా నభూతో నభవిష్యత్ అన్నట్టు ఉంటుంది. ఆ  పాట ఎంతటి చరిత్రను సృష్టించిందో…. అందరికీ తెలిసిన విషయమే.

 

పాట  చూడండి……

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!