Dr. Vangala Ramakrishna………………
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం…….
వ్యాసేన కథితాం పురాణ మునినాం మధ్యే మహాభారతం
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబా! త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం
కృష్ణ భగవానుడు గీతను మానవజాతికి అందించిన సుదినం మార్గశిర శుక్ల ఏకాదశి. దీని అసలుపేరు గీత మాత్రమే! భగవంతుడు ఉపదేశించాడు కనుక ఇది భగవద్గీత అయింది.ఎవరీ భగవంతుడు? అంటే నారాయణుడు అంటోంది ఈ శ్లోకం.
కృష్ణుడు స్వయం నారాయణుడు. నారాయణుడు ఒక్కడే.. భగములు కలిగినవాడు కనుక భగవానుడు అనే పేరు ఆయనకే వర్తిస్తుంది. విష్ణుమూర్తికి వేయి నామాలు క్రోడీకరించి చెప్పిన మహాభారతంలోని ఈ శ్లోకం కృష్ణుడే నారాయణుడని ఎందుకు అంది?
నారా+ఆయన= నారాయణ. నారా అంటే జలం, జ్ఞానం. జ్ఞానం జలరూపంలో ఉండి ప్రవహించేది. కనుక నారాయణుడు జలధిశాయి, జ్ఞానావృతుడు. జ్ఞానశయనుడు కనుక సకలోపనిషత్సారమైన గీతను కదన రంగంలో చెప్పాల్సివచ్చినా మంచినీళ్ళ ప్రాయంగా చెప్పగలిగాడు.
కరస్థమైన జ్ఞానం, కంఠస్థమైన విద్య ఎలా అలవోకగా ఉపయోగపడుతుందో నిరూపించిచూపించాడు. కనుక విద్యను చక్కగా ఒంటబట్టించు కోవాలి అనే సందేశాన్ని ఈ శ్లోకంలోని నారాయణ శబ్దం మనకు అందిస్తోంది.
భగవంతుని నుంచి వచ్చిన 18 అధ్యాయాల మహాభారతం మధ్యలో ఉన్నా భగవద్గీత ప్రత్యేకమైన ఉనికితో, అస్తిత్వంతో విడిగా ఒక గ్రంథంగా అవతరించింది.
80కి పైగా భాషలలో రూపాంతరంచెంది అంతర్జాతీయంగా ఆరాధ్య గ్రంథమైంది. భగవంతుని నోటినుండి వెలువడినందున గీత భగవతి రూపిణిగా పూజలందుకుంటోంది. విశ్వానికీ విశ్వావతారుడైన నారాయణునికి తేడాలేదని అనేక విభూతులు చూపించి అద్వైతామృత వర్షిణిగా మొక్కులందుకుంటోంది. సంసార బంధాలను తెగతెంపులుచేసుకోమని పుణ్యమార్గాన్ని చూపించి భవద్వేషిణిగా సన్నుతులందుతోంది.
నారాయణుడు తానుగా గీత ఉపదేశించాడా? లేదు. ప్రతిస్పందించి ఉపదేశించాడు. స్పందన ఉంటే కదా ప్రతిస్పందన ఉండేది. నారాయణుడు ఎవరి స్పందనలకు ప్రతిస్పందించాడు? విషాదంతో ప్రకంపించి పోయిన అర్జునుని మనసులోని భావాలకు, భయాలకు, అనుమానాలకు ప్రతిస్పందనగా నారాయణుడు గీతనుపదేశించాడు.
కృష్ణుడు తనకు తానుగా చెబితే బోధ అయ్యేది. అర్జునుడు అడిగిన అనేక ప్రశ్నలకు ప్రతిస్పందించి చెప్పాడు కనుక ఇది ప్రతిబోధ అయింది. అందుకే వ్యాసుడు దీన్ని “ప్రతిబోధిత గీత” అన్నాడు.ఆస్తికుని, నాస్తికుని, హేతువాదిని కూడా సమాన స్థాయిలో ఆకర్షించే సకలోపనిషత్సారం భగవద్గీత. ఉపనిషత్ అనే పదం అప్ (సమీపంలో) + నిషాద్ (కూర్చోవడం) అనే పదాల సమ్మేళనం.
పురాతన కాలంలో శిష్యులు గురుకులానికి వెళ్లి గురువు దగ్గర కూర్చుని అంతిమ సత్యం గురించి వినయంతో విని అర్థం చేసుకునేవారు. గురువు దగ్గరికి వెళ్లి నిగూఢ జ్ఞానాన్ని పొందే సంప్రదాయాన్ని ‘ఉపనిషత్సంప్రదాయం’ అంటారు. అర్జునుడు కూడా కృష్ణుని పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పిన గీతను విన్నాడు.
తనకున్న సందేహాలన్నీ అప్పటికప్పుడే అడిగి తెలుసుకున్నాడు. గీతాపఠనమంటే గుడ్డిగా చదవడంకాదు. ఎక్కడికక్కడ ఆగి అర్థంచేసుకుని సారాంశం ఒంటబట్టించుకొని ముందుకుసాగాలి. సమయం పట్టినాసరే శాంతంగా సాకల్యంగా సంపూర్ణంగా అర్థం చేసుకుని చదవాలి. అర్థంకాని చదువు వ్యర్థం కదా..!
గీతోపదేశం అనాది. గతంలో గీతను అర్జునుడికన్నా చాలా ముందుగా సూర్యుడు విన్నాడు. అర్జునుడు వింటున్నప్పుడు ఆయనతోపాటే రథం జెండాపై ఉన్న కపిరాజు హనుమంతుడు, వ్యాసుడు, వ్యాసుడిచ్చిన దివ్యదృష్టితో ధృతరాష్ట్రుడి సలహాదారుడు సంజయుడు, సంజయుని ద్వారా ధృతరాష్ట్రుడు, ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు, సకల దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెర, కింపురుషులు, గరుడోరగఅప్సర గణాలు మూకలై పెనుమూకలై విన్నారు.
లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు కూడా విని విశ్వరూపదర్శనం చేసుకున్నారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.కృష్ణుడు చెప్పిన గీతను పురాణముని అయిన కృష్ణద్వైపాయనుడు (వేదవ్యాసుడు) గణపతికి బోధించాడు. గణపతి అక్షరబద్ధం చేసి మనకు అందించాడు.
ఆ తర్వాత వేదవ్యాసుడి ద్వారా ఆయన శిష్యులైన వైశంపాయనుడు, జైమిని, పాలసంహితులు గీతను విన్నారు. తర్వాతి కాలంలో వైశంపాయనుని ద్వారా జనమేజయుడు విన్నాడు. నైమిశారణ్యంలో 12 ఏళ్ల సత్సంగ్ ను నిర్వహించిన సైనిక మహారాజు వైశంపాయనుని ద్వారా గీత విన్నాడు. ఇలా గీతోపదేశానికి ఒక శుభ పరంపర ఉంది.

