లాభదాయక సంస్థలను కాపాడే నాథుడెవరు?

Sharing is Caring...

Govardhan Gande…………………………….

బీమా మార్కెట్‌లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించి సాటిలేని మేటి సంస్థ గా నిలబడిన ఎల్‌.ఐ.సి 65 వసంతాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఎల్‌.ఐ.సి 41 కోట్ల పైగా పాలసీలను జారీ చేసి ..ప్రతి సెకనుకు నాలుగు క్లైయిమ్స్‌ చొప్పున పరిష్కరిస్తూ ప్రపంచ బీమా మార్కెట్‌లో అరుదైన రికార్డ్‌ నెలకొల్పింది.

‘నమ్మకం’ అనే మాటకు ప్రతీక గా నిలిచింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రతి ఏటా 99శాతానికి పైగా క్లైయిమ్స్‌ పరిష్కరించడం ఎల్‌.ఐ.సికే సాధ్యమైంది. దేశీయ బీమా మార్కెట్‌లోకి ఎన్నో ప్రైవేటు, బహుళజాతి సంస్థలు ప్రవేశించినప్పటికీ పాలసీదారుల సంపూర్ణ నమ్మకాన్ని పొందిన ఎల్‌.ఐ.సి బీమా మార్కెట్‌ లీడర్ గా మొన్నటివరకు కొనసాగింది. అలాంటి లాభదాయక సంస్థ వాటాల విక్రయాలకు రంగం సిద్ధమౌతోంది.

బంగారు గుడ్లు పెట్టే బాతును ఒకేసారి కోసి దాని కడుపులోని గుడ్లన్నీ సొంతం చేసుకుందామనే ధోరణి ఫలితం గా ప్రయివేటురంగంలోకి వెళ్ళబోతున్నది. ఇకపై బీమాకు ధీమా ఉండే అవకాశం సన్నగిల్లుతుంది.మన కేంద్ర సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం పర్యవసానం ఎల్ఐసీ ఇకపై సర్కారీ అనుబంధ వ్యవస్థగా కొనసాగే అవకాశం కోల్పోనున్నది.

కేవలం 5 కోట్ల మూలధనంతో మొదలైన సంస్థ ఇప్పటి వరకు 28,695 కోట్ల సొమ్మును ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లించింది.41 కోట్ల పాలసీదారులుతో ఎంతో నమ్మకమైన సంస్థగా వర్ధిల్లుతున్న ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల పెట్టుబడులను అతి జాగ్రత్తగా వెచ్చించి లాభాలను ఆర్జిస్తున్నది.దేశీయ బీమా మార్కెట్ లో సంస్థ వాటా 70 శాతానికి పైగానే ఉన్నది.

ఇదంతా ఎల్ఐసీ కృషి ఫలితమే.ఇంత పెద్ద,ఆకర్షణీయమైన బీమా మార్కెట్ పై పలు విదేశీ కంపెనీలు కన్ను పడింది.20 ఏళ్లకు పైగా విదేశీ బీమా సంస్థలు దేశంలో చేస్తున్న బీమా వ్యాపారం ఎల్ఐసీ విశ్వనీయత ను ఇసుమంత కూడా దెబ్బతీయ లేక పోయాయి.ఆ సంస్థలు ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయాయి. ఎందుకంటే ఎల్ ఐ సీ ప్రజల మదిలో అంత విశ్వాసాన్ని కలిగించింది.

ఈ క్రమంలో విదేశీ బీమా లాబీ ఎల్ఐసీ ని బలహీనపరచి భారత బీమా మార్కెట్ లో భారీ వాటాను చేజిక్కించుకోవాలని ప్రణాళికలు వేసి సర్కారు పెద్దలను ప్రభావితం చేసిన ఫలితమే వాటాల అమ్మకం నిర్ణయమని నిపుణుల విశ్లేషణ.ఇప్పుడు 10 శాతం వాటా మార్కెట్లో పెట్టినట్లుగానే భవిష్యత్తులో మరింత వాటాను అంగట్లో పెడితే ఎల్ఐసీ క్రమంగా యాజమాన్య నిర్వహణా పద్ధతుల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

క్రమంగా సంస్థ నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా.అప్పుడు విదేశీ బీమా కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకునే వీలు కలుగుతుంది. ఇప్పటికే దాని ఆస్తుల విలువను అతి తక్కువగా చూపే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు అంగట్లో పెట్టిన వాటాల ద్వారా లక్ష కోట్లను సమకూర్చుకోవాలన్నది సర్కారు వారి వ్యూహం.దశాబ్దాల కృషి ఫలితంగా మహా వృక్షాలుగా ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే నాథుడెవరు?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!