ఆ ఇద్దరి మధ్య మాటల్లేవా ?

Sharing is Caring...

No words…no greetings……………………………..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కుటుంబాల మధ్య ఆరు దశాబ్దాలు గా ఉన్న బంధం బీటలు వారింది. ప్రస్తుతం ఆ కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయి బచ్చన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాలమధ్య సంబంధం మొదలైంది. అప్పటి ప్రధానితో హరివంశరాయ్ కి మంచి పరిచయాలున్నాయి.

రెండు కుటుంబాలు అప్పట్లో అలహాబాద్ లో ఉండేవి. దీంతో రెండుకుటుంబాల మధ్య సంబంధాలు పెరిగాయి. అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ ,నెహ్రు కుమార్తె ఇందిరా గాంధీ మంచి స్నేహితులు అయ్యారు. కొన్నాళ్ల తర్వాత రెండుకుటుంబాలు ఢిల్లీకి మారాయి. ఈ క్రమంలోనే అమితాబ్ .. రాజీవ్ గాంధీలు కూడా బాల్యంనుంచే మంచి స్నేహితులు అయ్యారు.రెండు కుటుంబాల మధ్య స్నేహం బలమైన బంధంగా మారి కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండేవారు.

రాజీవ్ తో  వివాహానికి ముందు సోనియా ఇండియా వచ్చారు. అపుడు అమితాబ్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఆమెను స్వయం గా తమ ఇంటికి తీసుకెళ్లారు.ఇందిరా గాంధీ కి కాబోయే కోడల్ని హోటల్/ గెస్ట్ హౌస్ లో ఉంచడం ఇష్టం లేదు. తేజీ బచ్చన్ తో మాట్లాడి సోనియా కు భారతీయ సంప్రదాయాలు,కట్టుబొట్టు, ఆచారాలు నేర్పించాలని కోరారు.

సుమారుగా 43 రోజులు బచ్చన్ల కుటుంబంలో ఉన్న సోనియా అత్తగారి కోరిక మేరకు అన్ని నేర్చుకున్నారు. తర్వాత 1968 ఫిబ్రవరి 25 న రాజీవ్, సోనియాల వివాహం జరిగింది.అపుడు దగ్గరుండి పెళ్లి పనులన్నీ అమితాబ్ చూసుకున్నారు. సోనియా ఓ సందర్భంగా తేజీ బచ్చన్ తన కు తల్లి లాంటిదని , అమితాబ్ ,అజితాబ్ తన తోబుట్టువులని కూడా చెప్పారు.వారే లేకుంటే చాలా ఇబ్బందులు పడే దాన్నిఅని కూడా అన్నారు. 

1984 లో రాజీవ్ గాంధీ అడగగానే  అమితాబ్ వెనుకాముందు చూడకుండా అలహాబాద్ వెళ్లి పోటీ చేసాడు.ఎన్నికల్లో రికార్డు మెజారిటీ తో గెలిచాడు. గెలిచినవాడు ఊరుకోలేదు . ఎన్నికల ప్రచారంలో ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చేందుకు  అమితాబ్ ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి పనులు చేయించే వారు. దీంతో ప్రజలు అమితాబ్ చుట్టూ తిరిగే వారు…ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది.

ఇది గిట్టని నేతలు అమితాబ్ పై ఫిర్యాదులు చేయడం మొదలెట్టారు. అమితాబ్ అదే తీరులో దూసుకుపోతే యూపీ కి సీఎం అవుతారేమో అని కొందరు నేతలు భయపడ్డారు. దీంతో అమితాబ్ మరో అధికార కేంద్రం గా మారుతున్నారని .. అధికారుల నియామకాలలో అమితాబ్ జోక్యం చేసుకుంటున్నారని …మంత్రులపై పనుల కోసం ఒత్తిడి తెస్తున్నారని  రాజీవ్ కు ఫిర్యాదులు పంపారు.

రాజీవ్ అమితాబ్ పై వచ్చిన ఫిర్యాదులను నమ్మారు. ఒక రోజు అమితాబ్ ఢిల్లీ వెళ్లి రాజీవ్ ను కలిసినపుడు అక్కడ సీనియర్ నేత ఫోతేదార్ , రాజీవ్ వ్యక్తిగత సహాయకుడు  విన్సెన్ట్ జార్జి లు ఉన్నారు. అపుడు రాజీవ్  అమితాబ్ నుద్దేశించి మాట్లాడుతూ “ఫోతే దార్ మీ రాజీనామా కోరుతున్నారు” అన్నారు. దానికి స్పందించిన అమితాబ్ ” ఫోతేదార్ కోరుకుంటే అలాగే చేస్తాను” అంటూ వెంటనే జార్జి ఇచ్చిన పేపర్లపై సంతకాలు చేసి, రాజీనామా పత్రం రాసి ఇచ్చారు.

ఈ విషయాలన్నీ ఫోతేదార్ తన ఆత్మకథ “ఆల్ టెల్” లో రాసుకున్నారు. ఆ దరిమిలా రాజీవ్ వాస్తవాలు తెలుసుకున్నారు. ఉప ఎన్నిక టిక్కెట్ కూడా అమితాబ్ కే ఇచ్చారు. అమితాబ్ పోటీ చేస్తానని చెప్పి .. చేయలేదు. చివరికి లోపాయికారీగా వీపీ సింగ్ కి కాంగ్రెస్ మద్దతు పలికింది. వీపీ సింగ్ ఆ ఎన్నికలో గెలిచారు. అప్పటి నుంచి మెల్ల మెల్లగా రాజీవ్ కుటుంబానికి అమితాబ్ దూరమయ్యారు.

రాజీవ్ మరణం తర్వాత లండన్ లో ఉన్న సోనియాను బచ్చన్ల కుటుంబం పలకరించి వచ్చింది. సోనియా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక కూడా రెండు కుటుంబాల మధ్య కొంత మేరకు మాటలు ఉన్నాయి.1996 -98 మధ్యకాలంలో అమితాబ్ డ్రీమ్ ప్రాజెక్టు ఏబీసీఎల్ కార్పొరేషన్ ఆర్ధిక ఇబ్బందుల్లో పడింది. బ్యాంకులు అమితాబ్ పై కేసులు పెట్టాయి. ఆ సమయంలో  సోనియా కుటుంబం ఎలాంటి సహాయం చేయలేదని అంటారు. ఇక అక్కడ నుంచి సోనియా .. అమితాబ్ ల మధ్య మాటలు తగ్గిపోయాయి.

రెండు కుటుంబాల మధ్య బంధాన్ని రాజీవ్ పిల్లలు.. తమ పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోలేక పోయారని ఓ సందర్భంగా అమితాబ్ చెప్పారు. బచ్చన్ల కుటుంబం  తమతో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకొని లాభ పడిందని  సోనియా భావిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఇక పిల్లల పెళ్లిళ్లు మరింత దూరాన్ని పెంచాయి.

1997, ఫిబ్రవరి 18న ప్రియాంక వివాహం రాబర్ట్ వాద్రాతో జరిగింది. అంతకు ముందే రోజే అమితాబ్ కుమార్తె  శ్వేతా పెళ్లి పారిశ్రామికవేత్త నిఖిల్ నందాతో జరిగింది.. ప్రియాంక పెళ్లి సంగతి ముందుగానే తెలిసినప్పటికీ అమితాబ్ కావాలనే 45 రోజుల ముందు నిశ్చితార్థం జరిపి ప్రియాంక పెళ్ళికి ముందు రోజు అట్టహాసంగా తన కూతురు పెళ్లి చేసి యావద్దేశం దృష్టిని మరల్చారని  సోనియా కుటుంబం భావించింది.

రెండు పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన అతిథుల్లో కొందరు ప్రియాంక మ్యారేజీకి హాజరు కాలేదు.ఈ తతంగం అంతా యాదృచ్చికంగా జరిగిందా ? కావాలనే అమితాబ్ చేసారో  ఎవరికి తెలీదు.  సోనియా ఈ వ్యవహాలరాలపై తీవ్రంగా మనస్థాపం చెంది బచ్చన్ కుటుంబంతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నారని అంటారు.  శ్వేతా పెళ్లికి కూడా ఆమె వెళ్లలేదు.

ఆ తర్వాత 1999లో అభిషేక్ బచ్చన్ తొలి సినిమా  ‘రెఫ్యూజీ’ ప్రీమియర్ షోకి రావాల్సిందిగా ఆహ్వానం అందినప్పటికీ సోనియా వెళ్ళలేదు. అక్కడితో సంబంధాలు తెగిపోయాయి. అనుకోకుండా ఎపుడైనా సోనియా, జయా బచ్చన్ పార్లమెంట్ లో ఎదురైనపుడు కూడా ఇద్దరు కేవలం నమస్కారాలకే పరిమితం అవుతుంటారు.

———————-K.N.Murthy

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!