ఆయన ‘మాటలు’ తూటాల్లా పేలాయి !

Sharing is Caring...

Powerful dialogue writer ……………………….

‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు.ఒక్కొక్కడూ ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి, బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తికాదు, సమూహ శక్తి, సంగ్రామభేరి, స్వాతంత్య్ర నినాదం, స్వేచ్ఛా మారుతం’’.ఈ డైలాగు వినగానే టక్కున మాటల మాంత్రికుడు మహారథి గుర్తుకొస్తారు ఎవరికైనా. 

ఎపుడో విడుదలైన  సీతారామరాజు సినిమాలోవి ఆ డైలాగులు.ఈతరం ప్రేక్షకుల్లో అందరికి మహారథి గురించి తెలియక పోవచ్చు. కానీ ఆ డైలాగులు వినే ఉంటారు. ఇప్పటికి ఆ సినిమా చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా కోసం మహారథి చాలా కష్టపడ్డారు. ఫలితం కూడా దక్కింది.

అసలు సీతా రామరాజు కథ మొదట ఎన్టీఆర్ కోసం తయారు చేశారు మహారథి. ఆయనకు వినిపించారు. బ్రిటిష్ సైనికుల వేధింపుల తాళలేక పోతున్న మన్య ప్రజల క్షేమం కోసం రామరాజు తాను చేపట్టిన ఉద్యమానికి కొంత కాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అదే సినిమా ముగింపు. అది ఎన్టీఆర్ కి నచ్చక సినిమా ప్రతిపాదన ఆగిపోయింది.ఒకసారి కృష్ణ సోదరుడు హనుమంతరావు మహారథి ని కలిసినపుడు ఈ సినిమా ప్రస్తావన వచ్చింది.

వెంటనే కృష్ణ ను, డైరెక్టర్ రామచంద్రరావు ను మహారథి కలవడం.. కథపై చర్చలు జరగడం చకచకా జరిగిపోయాయి.రామచంద్రరావు , నటుడు జగ్గయ్య, విజయనిర్మల సూచనల మేరకు సీత పాత్ర ను యాడ్ చేశారు. రూథర్ ఫర్డ్ పాత్రను సాఫ్ట్ గా తీర్చిదిద్దారు. క్లయిమాక్స్ కూడా అద్భుతంగా కుదిరింది.

ఈ సినిమా కోసం మహారథి ఒకటి రెండు సినిమాలు వదులుకున్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు చింతపల్లి అడవుల్లో యూనిట్ తోనే  ఉన్నారు. క్లయిమాక్స్ మన్యంలో నే రాశారట. ఆరోజుల్లో మహారథి అటు ఎన్టీఆర్, ఇటు కృష్ణ సినిమాలకు ఎక్కువగా పని చేశారు. 

దర్శకునిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని మద్రాసు వెళ్లిన మహారథి అనుకోకుండా రచయితగా మారారు.కేబీ తిలక్, కేఎస్ ప్రకాశరావు తదితరుల దగ్గర పనిచేసినా అవకాశాలు మాత్రం రాలేదు. ఈ లోగా అనుకోకుండా అనువాద రచయితగా ఛాన్స్  వచ్చింది. ‘శివగంగ సీమై’ అనే తమిళ చిత్రాన్ని ‘యోధాను యోధులు’ పేరుతో అనువదిస్తూ మహారథికి అవకాశం ఇచ్చారు. దాంతో సత్తా చాటుకున్నారు.  

ఒక దశలో డబ్బింగ్ ఫీల్డులో శ్రీశ్రీ, అనిశెట్టిలతో పోటీపడ్డారు.ఈ క్రమంలోనే  ‘సతీ అరుంధతి’ అనే చిత్రానికి మాటలు రాసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆ సినిమాకు పని చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ ‘బందిపోటు’ కు రాసే ఆఫర్ వచ్చింది. రెండే రెండు రోజుల్లో స్క్రిప్టు సిద్ధం చేసారు. ‘సతీ అరుంధతి’ కన్నా ‘బందిపోటు’ ముందుగా విడుదలైంది. ఆ సినిమాతో మహారథి పేరు మారుమ్రోగింది. ఇక ఆయన వెనుదిరిగి చూడలేదు. 

తర్వాత కంచుకోట, రణభేరి, పెత్తందార్లు, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మను షులు, సింహాసనం వంటి ఎన్నో చిత్రాలకు రచన చేశారు. మంచిని పెంచాలి అనే సినిమా ను మహారథి డైరెక్ట్ చేశారు. కానీ అది సక్సెస్ కాలేదు.

నిర్మాతగా  భోగిమంటలు, రైతుభారతం సినిమాలు తీశారు. ఈ రెండు సినిమాల్లోనూ సూపర్ స్టార్ కృష్ణ హీరో గా నటించారు.‘రైతుభారతం’తో సౌందర్యను కథానాయికగా తెలుగు తెర కు పరిచయం చేసింది మహారధే. 

1978 లో ఆయన  జనతా పార్టీ తరఫున బోధన్‌లో పోటీ చేసి, ఇందిరాగాంధీ ప్రభంజనంలో ఓటమి చవిచూశారు. 2005లో ‘త్రిలింగ ప్రజా సమితి’ పార్టీ ని స్థాపించారు. 2009 ఎన్నికల ప్రచారం కోసం హీరో బాలకృష్ణకు ఆయనే రాజకీయ ప్రసంగాలు రాసిచ్చారు.

ఎన్టీఆర్ ‘బందిపోటు’తో మొదలైన ఆయన ప్రస్థానం కృష్ణ ‘శాంతి సందేశం’తో ముగిసింది. దాదాపు 150 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన మహారథి 2011 లో కన్నుమూసారు. ఆయన అసలు పేరు త్రిపురనేని బాల గంగాధర రావు 

 

———-  KNM 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!