పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.దీంతో అందరి చూపు నందిగ్రామ్ పై కేంద్రీకృతమైంది. అక్కడి ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. దీదీ 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు.2011లో తొలిసారిగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు మమతా 29 ఏళ్ళ వయసులో 1984లో జాదవపూర్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక సభ స్పీకర్ సోమనాథ ఛటర్జీని ఓడించారు. అప్పట్లో ఆ ఎన్నిక ఓ సంచలనం. ఆ తర్వాత 1989 లో అదే స్థానం నుంచి పోటీ చేసి మాలిని భట్టాచార్య చేతిలో 30900 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బోఫోర్స్ కుంభకోణం, రాజీవ్ గాంధీ పై వచ్చిన వ్యతిరేకత దీదీ ఓటమి కి కారణాలు అయ్యాయి.91 లో కలకత్తా సౌత్ నుంచి మళ్ళీ విజయం సాధించారు. 96 లో కూడా గెలిచారు. 98 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక మళ్ళీ అదే స్థానం నుంచి 2.24 లక్షల భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఓటమే లేదు.
దీదీ రాజకీయ జీవితంలో పార్లమెంట్ కే ఎక్కువ సార్లు పోటీ చేశారు. ఎన్నోఢక్కా మొక్కీలు తిన్నారు. ఇక ఇప్పుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కూడా తృణమూల్ కి మంచి పట్టు ఉంది. ఈ అసెంబ్లీ స్థానం 1951 నుంచి 1962 వరకు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. తరువాత 1967 నుంచి 2006 వరకు కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళింది. మధ్యలో ఒకసారి జనతాపార్టీ అభ్యర్థి గెలిచారు.2009 లోజరిగిన ఉప ఎన్నిక నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ పట్టు బిగించింది. 2009 ఉపఎన్నికలో , 2011సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజా బేబీ తృణమూల్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. 2016 లో సువెందు అధికారి తృణమూల్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అతగాడు బీజేపీ లోకి మారడం తో దీదీ కి కోపమొచ్చి సువెందు ను అసెంబ్లీ గడప తొక్కనివ్వనని శపథం చేసి తానే స్వయంగా నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
సువెందు అధికారికి ఈ నియోజక వర్గం పై కొంత పట్టు ఉంది.అతని బంధుగణం అంతా అక్కడే ఉంది. భూపోరాటాలలో సువెందు కూడా నాడు కీలకపాత్ర పోషించారు. 2016 లో గెలిచాక మమతా సువెందు ను క్యాబినెట్లోకి తీసుకున్నారు. మొన్న మొన్నటివరకు క్యాబినెట్లో సువెందు నంబర్ 2 గా ఉన్నారు.అతగాడు బీజేపీలోకి మారడంతో నందిగ్రామ్ టిక్కెట్ ను అతనికే ఇచ్చారు. ఇపుడు దీదీ బరిలోకి దిగడంతో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అన్నివిధాలా మద్దతు ఇస్తోంది . ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక అందరిని ఆకర్షిస్తోంది. దీదీ గెలవడం కష్టమనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక నందిగ్రామ్ బరిలోనే మమతా 2011 లో భూపోరాటాలు చేశారు. కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడారు.
అక్కడ మమతాకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఎలాగైనా దీదీ ని ఓడించాలనే లక్ష్యంతో బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. తృణమూల్ కూడా చావో రేవో తేల్చుకోవాలని పోరాడుతోంది. దీదీ దేనికి భయపడే రకం కాదు. ఇపుడు కొంచెం వయసు పైబడి దూకుడు కొంత తగ్గి ఉండొచ్చుకానీ సివంగిలా పోరాడే తత్వం ఆమెది. ఎవరూ ఊహించని రీతిలో నందిగ్రామ్ కొచ్చిన మమతా విజయం సాధించేందుకు హిందూ కార్డును వాడుతున్నారు. ఆలయ దర్శనాలకు వెళుతున్నారు. మొత్తం మీద నందిగ్రామ్ లో పోరు రసవత్తరం గా మారింది.
———— K.N.MURTHY