కురుక్షేత్ర యుద్ధం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా, తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ ఇది: భీముడు కొడుకు ఘటోత్కచుడు, ఓ యాదవ రాజు కూతురు అహిలావతి ని పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. స్కందపురాణం ప్రకారం బర్బరీకుడు ఘటోత్కచుడికి ముర అనే ప్రాగ్జోతిష పుర రాజు కూతురైన మౌర్వికి పుట్టినవాడు.
అతనికి ఉంగరాల జుట్టు ఉండడం మూలంగా బర్బరీకుడనే పేరు వచ్చింది. ఇతని బాల్యమంతా తల్లి వద్దే గడిచింది. శస్త్రాస్త్ర విద్యలన్నీ తల్లి వద్దే నేర్చుకున్నాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ఇతడికి 3 బాణాల్ని ప్రత్యేక వరంగా ఇస్తుంది. అందుకే రాజస్థాన్ ప్రాంతంలో ఇతడిని ‘త్రిబాణధారి’ పేరిట పూజిస్తారు.
కౌరవ పాండవ యుద్ధం అనివార్యం అని తెలిశాక తల్లితో, ‘యుద్ధం చూడాలన్నది నా కోరిక. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను’ అని బయల్దెరతాడు బార్బరీకుడు.యుద్ధం ప్రారంభం కావటానికి ముందు శ్రీకృష్ణుడు ప్రతి యోధుడినీ. “నీకే మొత్తం బాధ్యతలు ఇస్తే, యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు?”అని ప్రశ్న వేస్తాడు.
“20 రోజులని భీష్ముడు, 25 రోజులని ద్రోణుడు, 24 రోజులని కర్ణుడు, 28 అని అర్జునుడు… ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తూ నవ్వుకుoటూన్న బర్బరీకుడిని ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి “నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా?” అని అడుగుతాడు కృష్ణుడు.. “నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది” అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, ‘అదెలా సాధ్యం’ అనడుగుతాడు.
తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపించి, “ఎవరిని హతం చేయాలో మొదటి బాణo, ఎవరెవరిని రక్షించాలో రెండో బాణo నిర్ణయిస్తుంది. రక్షించాల్సిన వాళ్లను విడిచి పెట్టి, మిగతా ప్రతిదాన్నీ మూడో బాణం ధ్వంసం చేస్తుంది” అంటూ వాటి శక్తి వివరిస్తాడు బర్బరీకుడు.“ఈ సృష్టిలో నేనే కాదు, ఎవరూ దీన్ని నమ్మరు. ఏదీ, ఆ రావి చెట్టు ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా?” అంటాడు కృష్ణుడు.
దానికి వప్పుకుని, విల్లు సంధిస్తాడు. బాణం వదిలే ముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకున్నప్పుడు, ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు కృష్ణుడు. బార్బరీకుడు వదిలిన బాణం చెట్టుకున్న ప్రతి ఆకును వృత్తం చేసి, చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది.“ఇదేమిటి” అనడుగుతాడు శ్రీకృష్ణుడు అమాయకంగా. “నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. పాదం తీసివేయి. లేకపోతే దాన్ని చీల్చుకుని వెళ్లి ఆ ఆకును గుర్తిస్తుంది” అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు కృష్ణుడు.
ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమని శ్రీకృష్ణుడికి.అర్థమవుతుంది.బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేనని, ఇలా ఓ సంభాషణ ఆరంభిస్తాడు. “ఏమోయీ, కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంది…! అంటే పాండవులే బలహీనులు కదా. నీవు వారితో జతకూడితే, నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు.
అప్పుడు తిరిగి నువ్వు కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. దాని వల్ల పాండవులు బలహీనులు అవుతారు కదా” అని అడుగుతాడు.తన వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. ‘…తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోతాయనీ’ బోధపడుతుంది.
నిజమైన ఆనందం ఎక్కడ ఉన్నదో తెలుసుకోలేక సతమతమయ్యే సగటు మానవ జాతికి ప్రతీకగా… అయోమయంతో కృష్ణుడి వైపు చూస్తూ “ఎవరు మహాశయా మీరు” అని ప్రశ్నిస్తాడు.అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. “భారీ యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు” అంటాడు శ్రీకృష్ణుడు.
“ప్రాణాలకు తెగించి వచ్చిన ఇంతమంది యోధులు ఉండగా, నన్నే ఎందుకు బలి ఇవ్వాలి?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి” అంటూ, “…ఓసారి దేవుళ్లంతా ‘భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి’ అంటూ నా దగ్గరకు వచ్చారు. ‘దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను’ అని వాళ్లకు చెప్పాను.
ఇదంతా వింటున్న నువ్వు “ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా” అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నోచ్చుకున్న బ్రహ్మ “ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం దానికి మొట్టమొదట బలయ్యేది నువ్వే” అని శపించాడు. అందుకే ఇప్పుడు నీ బలి. అంతేకాదు. నీ శాపవిమోచనం కూడా” అని వివరిస్తాడు.
“కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది” అంటాడు బర్బరీకుడు. “యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. నా పై నమ్మకంతో నీ తలను ఇవ్వు” అంటాడు శ్రీకృష్ణుడు. సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది.
‘ఈ విజయానికి నేనంటే నేనే కారణ’మంటూ వాదించుకుంటూ విజయ గర్వంతో ఉన్న పాండవుల్ని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు కృష్ణుడు. అతని కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడిని “వత్సా! మొత్తం యుద్దం చూసింది నువ్వే. ఏ క్షణమేం జరిగిందో… ఏం గమనించావో చెప్పు?” అని ప్రశ్న వేస్తాడు.
“స్వామీ! శత్రు మరణం సంతోషం. స్వపక్షo విషాదం. రెండూ మనిషి కొని తెచ్చుకున్నవే. యుద్ధo జరుగుతున్న సమయంలో ఆ రణభూమిలో నిరంతర వినిపించిన విజయ వికటాట్ట హాసాలు ఒక వైపు, ఆర్తనాద రోదనలూ మరోవైపు … ఇవి విని నేను తెలుసుకున్న సత్యo ఏమిటంటే…..
‘ఏదీ ఆనoదం కాదు, ఎందులోనూ విషాదం లేదు. ఇది తెలుసుకున్నవాడు నిర్వాణ యోగి” అని సమాధానమిస్తాడు . దాంతో శాపం ముగిసిపోయి ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ బర్బరీకుడి కథ. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట ఈ బర్బరీకుడిని ఇప్పటికీ కొలుస్తారు.
కర్టసీ.. un known writer
యండమూరి వీరేంద్రనాథ్ గారి వాల్ పై నుంచి తీసుకున్నది.
ఇది కూడా చదవండి>>>>>>>>>>>>>>>>>> కర్ణుడు ప్రకృతిలో కలసిందిక్కడే !