రాజకీయ సన్యాసం తీసుకున్నానని ప్రకటించిన దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ అలియాస్ చిన్నమ్మ త్వరలో జిల్లా పర్యటనలు చేయబోతున్నారు. మరో వైపు చిన్నమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ లోకి రానీయకూడదని పళని స్వామి , పన్నీర్ సెల్వమ్ పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నేత, అసమ్మతి వర్గం నాయకురాలు శశికళ తిరిగి పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. అయితే మాజీ సీఎం, అన్నా డీఎంకే నేత పళనిసామి..ఆమె చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిన్నమ్మ తిరిగి పార్టీ లో చేరితే తనకు ముప్పు తప్పదన్న భయం పళని స్వామిని వెన్నాడుతోంది.
పైగా పార్టీలోనే కొందరు కార్యకర్తలు చిన్నమ్మ పట్ల ఇప్పటికీ సానుకూల ధోరణితోనే ఉన్నారని, ఆమె నాయకత్వాన్ని కోరుతున్నారని తెలిసి పళని స్వామి ఆందోళన పడుతున్నారు. ఇవన్నీ గమనించే చిన్నమ్మ అలియాస్ శశికళ తమిళనాడులో రాజకీయ పర్యటన ప్రారంభించనున్నారు.
మే 10 నుంచి చిన్నమ్మ పర్యటనలు మొదలు కానున్నాయి. గుమ్మిడిపూండి నుంచి కన్యాకుమారి వరకూ ఆమె పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో చిన్నమ్మ ప్రసంగిస్తారట. అలాగే పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. చిన్నమ్మ పర్యటన కార్యక్రమాలను ఆమె సలహాదారులు సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆ తర్వాత గుమ్మిడి పూండి నుంచి కన్యాకుమారి వరకు రోజుకు మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 234 నియోజకవర్గాలలోనూ ఆమె పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారు. స్తున్నారు. అన్నాడీఎంకే అధిష్టానవర్గంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రులు, మాజీ జిల్లా శాఖ కార్యదర్శులను చిన్నమ్మ కలుసుకుని మంతనాలు జరుపుతున్నారు.
శశికళ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల్లో ఘన స్వాగతం పలికేందుకు ఆమె మద్దతుదారులు భారీ ఏర్పాట్లు చేయబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత పర్యటన తలపించే రీతిలో శశికళ పర్యటన కొనసాగుతుందని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు.ఈ నెలాఖరున అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి భారీ సన్నాహాలు జరుగుతున్న సమయంలో శశికళ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలిగా చిన్నమ్మకు రాష్ట్రంలో ఇప్పటికీ కొంత ఆదరణ ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చిన్నమ్మ సుమారు నాలుగేళ్లకు పైగా బెంగుళూరులోని జైల్లో శిక్ష అనుభవించి బెయిలుపై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకొచ్చిన చిన్నమ్మను కేసులు చుట్టు ముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే చిన్నమ్మ రాజకీయాలపై దృష్టి సారించారు.
పోలీసుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాకపోయినా కొంత మేరకు ఒత్తిడి తగ్గుతుంది, ఆ ఎత్తుగడతోనే చిన్నమ్మ అన్నా డీఎంకే పై పట్టు సాధించే యత్నాలు చేస్తున్నారు. ఇక కేసుల వివరాలకొస్తే వాటి నుంచి బయట పడటం కష్టమే అంటున్నారు. వాటి వివరాల్లో కెళ్తే ఏడాదన్నర క్రితం శశికళ కు చెందిన 1600 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది.
ఇంకా చెన్నై శివార్లలో ఉన్న భూములు , మరికొన్ని ఆస్తులపై కూడా ఐటీ శాఖ దృష్టి పెట్టింది. జయ ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో శశి బంధువులు నిర్మిస్తున్న భవన నిర్మాణం పై కూడా అధికారులు కన్నేశారు. ఇది 300 కోట్ల విలువైన స్థలం . ఇది శశి బినామీ ఆస్తిగా భావిస్తున్నారు. ఇక జయ ఆస్తుల పంపకం జరిగిపోయింది . జయ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
చిన్నమ్మ ఆర్ధిక వనరులపై ఇప్పటికి ఐటీ శాఖ కన్నేసి ఉంచింది.ఇక తమిళనాడులోని కొడనాడు ఎస్టేట్ కేంద్రంగా జరిగిన మరణాల కేసులో చిన్నమ్మ అలియాస్ శశికళ ఇరుక్కోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈమధ్యనే కొడనాడు మరణాలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం శశికళను ఆమె ఇంట్లోనే సుమారు 3 గంటలపాటు విచారించింది. ఇప్పటివరకు మరణాలకు సంబంధించి సాక్ష్యులు ప్రత్యక్ష్యసాక్ష్యులు సుమారు 220 మందిని పోలీసులు విచారించారు.
దివంగత జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ చాలా ఫేమస్. ఎప్పుడైనా వేసవికాలంలో వచ్చి జయ ఇక్కడ కొద్దిరోజులుండేవారు. ఆమె మరణం తర్వాత ఎస్టేట్ ను జయకు అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన శశికళ సొంతం చేసుకోవాలని కుట్రలు పన్నినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో నిజమెంతో తెలుసుకునేందుకు ఆదాయపు పన్నుశాఖ అధికారులు చిన్నమ్మ ఇంటిపైన.. ఆస్తులపైన దాడులు జరిపారు.
ఈ క్రమంలోనే కొడనాడు ఎస్టేట్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ చనిపోయాడు.అలాగే జయకు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి తర్వాత కొడనాడులో పనిచేసే మరోవ్యక్తి కూడా చనిపోయాడు. అంతకు ముందు ఎస్టేట్ లో దొంగలుపడి విలువైన డాక్యుమెంట్లు, కంప్యూటర్లను ఎత్తుకెళ్ళినట్లు కేసు నమోదైంది. అదే సమయంలో ఎస్టేట్ వాచ్ మెన్ కూడా హత్యకు గురయ్యాడు.
ఈ వరుస మరణాలపై పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళంతా చిన్నమ్మకు బాగా సన్నిహితులనే ప్రచారం జరుగుతోంది. దాంతో అందరి అనుమానాలు శశికళమీదకే మళ్ళాయి. దొంగతనం చేశారనే అనుమానం ఉన్నవారు వరుసగా చనిపోవటం కేసుల దర్యాప్తులో విపరీతమైన అడ్డంకులు ఎదురు కావడంతో పోలీసులకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు.
కొన్నాళ్ళు నత్తనడక నడిచింది. స్టాలిన్ సీఎం కాగానే స్పెషల్ టీమ్ ను నియమించారు. అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది.
అన్నాడీఎంకే లో ప్రవేశానికి అప్పటి సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ బాగా నిరాశ పడింది. నాకు ఈ దుస్థితి కల్పించిన వారిపై పగ తీర్చుకుంటా అంటూ ముమ్మార్లు జయ సమాధి పై తట్టి మరీ శపథం చేసిన చిన్నమ్మ ఆ శపథం తీర్చుకోకుండానే పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. మళ్ళీ కొంత కాలం నుంచి రాజకీయాలపై దృష్టి పెట్టారు.
కాగా మరో అయిదేళ్ల పాటు చిన్నమ్మ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 8 ప్రకారం ఒక వ్యక్తి ఏదేని నేరాలకు పాల్పడి, జైలుశిక్ష అనుభవిస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులు. అదేవిధంగా 1988 సెక్షన్ 8.. 1ఎం అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు.
కనీసం ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనే ఛాన్స్ లేదు. చిన్నమ్మ లాయర్లను పిలిపించి సంప్రదించినప్పటికీ .. అందరూ అదే మాట చెప్పారట. జైలు నుంచి విడుదలైన రోజు నుంచి ఆరేళ్ల పాటు.. అనగా 2027 జనవరి 26వ తేదీలోగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం అసాధ్యం అని తేల్చి చెప్పారట.
దీంతో శశికళ అప్పట్లో నీరు కారిపోయారు. బీజేపీ పెద్దలతో మాట్లాడి పోటీ చేసే అవకాశం కల్పించమని కోరినప్పటికీ అటు నుంచి రెస్పాన్స్ లేదట. దీంతో చిన్నమ్మ అంచనాలన్నీ విఫలమైనాయి. మరి ఈ సారి ఎలా ఉంటుందో ? చిన్నమ్మ ఏం చేస్తుందో చూడాలి .