Competition for political heirs……………………….
గుజరాత్ ఎన్నికల్లో 20 నియోజక వర్గాల్లో రాజకీయ నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చాయి.
దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదివాసీ నేత మోహన్ సిన్హ్ రత్వా ఇటీవల హస్తం పార్టీతో తెగతెంపులు చేసుకుని కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోటా ఉదేపూర్ స్థానాన్ని బీజేపీ రత్వా కుమారుడు రాజేందర్ సిన్హ్ కు కేటాయించింది.
ఇక ఇదే స్థానంలో కాంగ్రెస్ సంగ్రామ రత్వాను బరిలోకి దించింది. ఈయన.. రైల్వే మాజీ మంత్రి నరన్ రత్వా కుమారుడు. రాజేందర్, సంగ్రామ్ ఇద్దరూ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.థస్రా శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యోగేంద్ర పార్మర్.. మాజీ ఎమ్మెల్యే రామ్ సిన్హ్ పార్మర్ కుమారుడు. రామ్ సిన్హ్ గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరారు.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలా మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన బయద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన మహేంద్ర సింగ్ ఆ మధ్య బీజేపీ లో చేరారు. ఇటీవల కాషాయ పార్టీని వీడి మళ్లీ.. హస్తం పార్టీలో చేరారు.
మరో మాజీ ముఖ్యమంత్రి అమర్ సిన్హ్ చౌదరీ కుమారుడు తుషార్ చౌదరీ.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరౌలీ నుంచి బరిలోకి దిగారు. గతంలో ఆయన రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. వీరితో పాటు అనేక మంది సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కుమారులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల పోరు ఆసక్తికరంగా మారింది.
మొత్తం మీద కాంగ్రెస్ 13 చోట్ల …. బీజేపీ 7 చోట్ల రాజకీయ నేతల వారసులకు టిక్కెట్లు ఇచ్చాయి.సాధారణ సమయంలో వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటాయనడానికి గుజరాత్ ఎన్నికలు ఒక ఉదాహరణ.