Keen contest ………………………………….
కొత్తగా ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మునుగోడు ఉపఎన్నిక కీలక పరీక్షగా మారనుంది.ఈ క్రమంలో కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పేరు మారినప్పటికీ టీఆర్‌ఎస్ తరపునే నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కేసీఆర్ కి సవాల్ గా మారనుంది.
ఓటమి పాలైతే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట గెలవలేని పార్టీ రచ్చ ఎలా గెలుస్తుందని విపక్షాలు హేళన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో పకడ్బందీ వ్యూహం అమలు చేయనున్నారు.
మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు.. ప్రతి యూనిట్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్ లుగా వ్యవహరిస్తారు.14 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలను ఇన్‌చార్జులుగా నియమించారు.. ఏడుగురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌లకు కూడా బాధ్యతలు అప్పగించారు.
ప్రతి ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే, మంత్రి బాధ్యత వహిస్తారు. ఒక్కో ఎమ్మెల్యేకు 800 నుంచి 1200 మంది ఓటర్లున్నారు. మంత్రులకు అత్యధికంగా 3 వేల ఓటర్ల బాధ్యతలు అప్పగించారు.వీరంతా ఓటర్లను కలుస్తూ పకడ్బందీగా ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేశారు. వీరందరూ చివరి రోజు వరకూ నియోజకవర్గం లోనే ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
రేపటి నుంచి 14 వరకు మునుగోడు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ లోగా అభ్యర్థి ప్రకటన, నామినేషన్ దాఖలుపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. టీఆర్ ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి కి టిక్కెట్ దొరికే అవకాశాలున్నాయి. కాగా బీజేపీ ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థి గా బరిలోకి దిగుతున్నారు. కోమటి రెడ్డి సోదరులకు ఈ ప్రాంతంలో అనుచరగణం ఎక్కువగా ఉంది.
2009 లో ఇక్కడ సీపీఐ విజయం సాధించింది. 2014 లో టీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపొందారు. 2018 లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి 23 వేల మెజారిటీ తో గెలిచారు.మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం మునుగోడులో విజయం కోసం వ్యూహ రచన చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.
స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గతంలో ఇక్కడ నుంచే పోటీ చేసి గెలుపొందారు. 2014 లో స్రవంతి కి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో అప్పట్లో ఆమె ఇండి పెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు . ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు రోజుకో సీనియర్ నేత మునుగోడుకు వెళ్లి ఆమె తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ ముక్కోణపు పోటీలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.