Supports in difficult times………………………………………
చాలామంది ఆరోగ్య బీమా అంటే పెద్దగా ఆసక్తి చూపరు. ప్రీమియంకు డబ్బు వృథా అనుకుంటారు. కానీ ఆరోగ్య బీమా ఉంటే ఆ ధీమా యే వేరు. కష్ట కాలంలో ఆరోగ్య బీమా ఖచ్చితం గా ఉపయోగపడుతుంది.ఈ రోజుల్లో బీమా లేకుండా వైద్య ఖర్చులు భరించడం అంటే.. నెలవారీ ఆదాయం ఉన్నవారికి కూడా కష్టమే.
ఇక సీనియర్ సిటిజన్లకు ఈ ఖర్చులను సొంతంగా భరించడం మరింత కష్టం అవుతుంది. అందువల్ల సీనియర్ సిటిజన్లకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. మీరు పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నా, పదవీ విరమణ చేసిన వారైనా, ఇప్పటికీ ఆరోగ్య బీమా లేకపోతే… వెంటనే ఆరోగ్య బీమా తీసుకోవడం తెలివైన నిర్ణయం.
చాలా బీమా సంస్థలు 60 ఏళ్లు దాటిన వారికి కూడా పాలసీలను ఇస్తున్నాయి. అయితే, ఈ ప్లాన్లను కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకోవాలి. బీమా సంస్థకు సరైన సమాచారం ఇవ్వాలి. ఆరోగ్య బీమా కొనుగోలు కోసం ప్రతిపాదనా పత్రం పూర్తిచేస్తున్నప్పుడు అన్ని సరైన వివరాలే ఇవ్వాలి. పేరు, వయసు వంటి వివరాలతో పాటు మీ ఆరోగ్య స్థితిగతులను తెలియజేయాలి.
మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే.. వాటి గురించి ముందుగానే తెలియజేయాలి. అలాగే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే..వాటి గురించి తెలియపరచాలి. అప్పుడే పాలసీ క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది.
వివరాల్లో ఏదైనా తప్పులు ఉంటే… తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంతో సంస్థలు పాలసీని తిరస్కరిస్తాయి. దీంతో క్లిష్ట పరిస్థితిలో మీకు బీమా సాయం అందదు. అలాగే మీరు చెల్లించిన ప్రీమియంలు వృథా అవుతాయి.
60 ఏళ్ల వయసు చేరుకునే సరికి చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్య మొదలవుతుంది. ఇబ్బందులు పడుతుంటారు. ఈ అనారోగ్యాలు వెయిటింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ముందుగా ఉన్న అనారోగ్యాలను అనుసరించి వెయిటింగ్ పిరియడ్ 1-4 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. బీమా సంస్థను బట్టి కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అందువల్ల తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీ ఇచ్చే బీమా సంస్థ కోసం వెతకాలి.
ఇక్కడే ఆయుష్ చికిత్స గురించి కూడా చెప్పుకోవాలి. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి చికిత్సలు ఆయుష్ కిందకి వస్తాయి. ఒకవేళ మీరు అల్లోపతి మెడిసిన్ కంటే ఆయుష్ చికిత్సను ఇష్టపడేవారైతే, బీమా సంస్థలు దానికి కూడా కవరేజీని అందిస్తున్నాయి. కానీ కొన్ని బీమా సంస్థలు ఆయుష్ చికిత్సకు సబ్-లిమిట్స్ పెడుతున్నాయి. కాబట్టి, మీరు ఆయుష్ చికిత్సలకు ఎక్కువగా వెళ్లేవారైతే.. దీనిపై గరిష్ఠ కవరేజీని అందించే బీమా సంస్థను ఎంచుకోవడం మంచిది.
ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమాకు యాడ్-ఆన్/రైడర్లు జతచేసుకుంటే అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే వీటికి కొంత అదనపు ప్రీమియం చెల్లించాలి. రైడర్లలో చాలా రకాలు ఉంటాయి. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సరైన రైడర్‌ను ఎంపిక చేసుకుని మీ పాలసీకి జతచేస్తే ఆరోగ్య బీమా పాలసీ నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్నిపొందే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు తీవ్రమైన ఆనారోగ్యాలకు రైడర్‌ను తీసుకుంటే, బీమా సంస్థ జాబితా లో ఉన్న తీవ్రమైన అనారోగ్యం బారిన పడినప్పుడు, 15 రోజుల వ్యవధి తర్వాత బీమా సంస్థ పాలసీలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లిస్తుంది. బీమా సంస్థలు సాధారణంగా పాలసీలో గది అద్దెపై సబ్-లిమిట్ ను వర్తింపజేస్తుంటాయి. ఇలాంటప్పుడు మీరు ‘రూమ్ రెంట్ వేవర్’ రైడర్ తీసుకుంటే గది అద్దెను ఏ మాత్రం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అలాగే వెయిటింగ్ పీరియడ్ రైడర్‌ను తీసుకుంటే… ముందస్తు వ్యాధుల నిరీక్షణ వ్యవధిని తగ్గించుకోవచ్చు. ఇలా మీ అవసరాన్ని బట్టి రైడర్‌ను ఎంచుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య బీమాకు టాప్-అప్, సూపర్ టాప్-అప్ పాలసీలు అదనపు ప్రయోజనం కల్పిస్తాయి.మీ ప్రాథమిక ఆరోగ్య బీమా కవరేజీ దాటినప్పుడు ఇవి అమల్లోకి వస్తాయి.
అత్యవసర పరిస్థితుల్లో ఇవి రక్షణగా ఉంటాయి. ఇప్పటికే తక్కువ బీమా మొత్తంతో ఆరోగ్య బీమా తీసుకున్న వారు కవరేజీపెంచుకునేందుకు ఈ ప్లాన్లను ఎంచుకోవచ్చు . బేస్ పాలసీ తక్కువ బీమా హామీతో తీసుకుని, మిగిలిన బీమా హామీ కోసం టాప్ అప్ | సూపర్ టాప్ అప్ పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది.
ఆరోగ్య బీమా పాలసీలు నగదు రహిత చికిత్సను అందిస్తాయి. ఎంచుకున్న బీమా సంస్థకు దగ్గర్లో ఉన్న ఆసుపత్రులతో ఒప్పందం ఉందో ? లేదో ?చూసుకోండి. ఆసుప్రతి దగ్గర్లో ఉంటే అత్యవసర సమయాల్లో సులభంగా చేరుకొని చికిత్స పొందవచ్చు. పేరున్న ఆసుపత్రులు, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే స్పెషాలిటీ హాస్పిటళ్లూ నెట్ వర్క్ జాబితాలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు దూర ప్రాంతాల్లో నివసిస్తున్నా, ఇబ్బంది లేకుండా స్వయంగా వెళ్లి చికిత్సపొందవచ్చు.
పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ పత్రాలను క్షుణ్ణంగా చదవాలి. సహ-చెల్లింపులు, తగ్గింపులు మొదలైన వాటిని తనిఖీ చేయాలి. వీటి వల్ల చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది.. కానీ క్లెయిమ్ సమయంలో మీరు ఆసుపత్రి బిల్లులో కొంత మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు. అలాగే, పునరుద్ధరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదు.ఎన్నో కంపెనీలు వివిధ రకాలైన పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. మెరుగైనదానిని ఎంచుకోండి.