నామిని…మిట్టూరోడ్ని మర్చిపోయినట్టున్నారు.

Sharing is Caring...

Taadi Prakash ………………………………..

పతంజలి కాల్జేతుల్లేని సాహిత్యం చదివి ‘ నాన్ వెజ్ కథల’ గురించి నాలుగైదు ఉదాహరణలన్నా చెబుతారనుకున్నా. కనీసం నామిని సుబ్రమణ్యం నాయుణ్ణి అయినా గుర్తు చేస్తారనుకున్నా. అలా జరగలేదు మరి. పతంజలి గారిలాగే తెలుగు సాహిత్యంలో నామిని కూడా ఒకే ఒక్కడు.

1985 లో హైదరాబాద్ ఉదయం దినపత్రికలో నామిని పనిచేస్తున్నపుడు ‘పచ్చనాకు సాక్షిగా’ అనే కాలమ్ రాసాడు. బంపర్ హిట్ అయిన ఆ శీర్షిక జనాన్ని ఊపేసింది.బ్రీఫ్ గా ఎఫెక్టీవ్ గా ఉండే ఆ వ్యాసాల్లాంటి, కథల్లాంటి, కన్నీటి ఉప్పదనం లాంటి అనుభవాలు అంతతేలిగ్గా మర్చిపోయేవి కావు.పైగా తియ్యని తేనెలాంటి ఆ చిత్తూరు జిల్లా మాండలికం ఒకటీ.

నామిని ఒకచోట రాశాడు… “మా చిత్తూరు జిల్లాలో పేద ఇళ్లలో ఇద్దరు కొడుకులుంటే, తల్లి ఒక్క గుడ్డుని రెండు ముక్కలు చేసి ఇద్దరికీ పెడుతుంది. అలాగే అమ్మణ్ణమ్మ కూడా చంద్రబాబుకీ రామ్మూర్తి నాయుడికీ ఒక గుడ్డుని రెండు ముక్కలు చేసిపెట్టే ఉంటుంది” అని. 37 సంవత్సరాల క్రితం ‘ఉదయం’ లో నామిని రాసిన ‘మా ఇంట్లో మాంసం కూర’ ఇపుడు చదవండి.

ఆ విషాదాన్ని ఎంత దారుణంగా సెలబ్రేట్ చేస్తాడో! అప్పుడు ఏబీకే ఉదయం చీఫ్ ఎడిటర్. పతంజలి గారు ఎడిటర్. నామిని ఆ కొన్ని పేరాల్లోనే సెంటిమెంటూ, పేదరికంతో పరాచికం, సస్పెన్సు, కన్నీళ్లూ క్లైమాక్సూ…ఎలా రాస్తాడో ఏంటో!తిరుపతి రోడ్ల మీద రికామిగా తిరుగుతుండే నామిని అనేవాడు సాక్షాత్తూ లియో టాల్ స్టాయ్ కన్నకొడుకని అక్కడెవరికీ తెలీదు.’నాకెందుకు తెలీదూ’ అంటాడేమో సాకం నాగరాజు.

—-

మా ఇంట్లో మాంసం కూర………………………. By namini subramanyam nayudu

మాంసాన్ని చూస్తే నాకు అమ్మా అబ్బను చూసినట్టే. మా వూళ్లో ప్రతీ ఆదివారం ఒక యేట తల తెగి పొయ్యేది.పొట్టేలు తోలు తీసి ఆయాలు ఒక వారగా, మెత్తని కూర ఒక వారగా, ఎముకల్ని ఒక వారగా… వేస్తూ వుంటే మా పిలకాయలమంతా ఒళ్లు మరిచిపోయి చూస్తుండే వాళ్లం. వేటను కోసే గొడ్ల కొట్టంలో ఏదో గంగిరెద్దులాట జరగతా వుండినట్టు అక్కడ నిలబడుకోని, కూర కోసం గిన్నెలు తెచ్చే ఆడోళ్లకు కూడా తావు ఇచ్చే వాళ్లం కాము.

మా గుంపును జూసి యేటను నరికిన మనిషి ఒక వరి పోచను చేతికి తీసుకుని, “ఏందిక్కడ చూసేది! -ఇదేమన్నా గంగ జాతరా! ఇక్కడేమన్నా పప్పులు బెల్లాలు పెడతా వుండారా? పొండి పొండి” అంటూ అదిలించేవాడు. మా పిలకాయలం ఆయన బెదిరింపులకు బయపడిపోయి కొట్టం బయటకు వచ్చేసి తడికల గుండా మాంసాన్ని చూస్తూ వుండి పోయేవాళ్లం.మా మా అమ్మలు ఎంత సేప్పటికీ గిన్నెలు తీసుకుని మాంసం కోసం వచ్చే వాళ్లు కారు.

మేం ఆత్రం ఆత్రంగా ఇండ్లకు పరుగులు పెట్టే వాళ్లం. నేను మా అమ్మ కొంగు పట్టుకొని, “అమ్మా, అమ్మా, వూళ్లో యేటను కోస్తా వుండారు. కూర తేమ్మా” అని అడుక్కునే వాడ్ని. మా అమ్మ గోగాకు కాడల్ని తుంచి తుంచి చాటలో వేస్తూ వుండి పోయేది. ఆరోజు సంగటిలోకి గోగాకు వూరుబిండి అని నాకు తెలిసిపోయే సరికి నేను మొకం మటమటా పెట్టుకోని, “ఎప్పుడూ గోగాకు వూరిబిండీ, వుత్తి మిరపకాయ కూరేనో!” అని నిష్టూర పోయే వాడ్ని. నా నిష్టురాన్ని చూసి మా అమ్మ ఫలానా “చట్టిలో చెని క్కాయలుండాయి. వలుచుకుని తినుపో” అనేది.

“నిన్నిప్పుడు చెనిక్కాయలు అడిగినానా? చియ్యల కూర తెమ్మంటే ‘చెనిక్కాయలు ఎత్తుకోరా’ అంటిందీమె” అంటూ నేను మా అమ్మ ఒడి చేరి ముదిగారానికి పోబోతాను. ఒకటికి పదిసార్లు అడిగితే మా అమ్మ చియ్యల కూర తెచ్చినా తేవచ్చుననిపించి నేను మళ్లీ మళ్లీ “అమ్మా, లెయ్, ఈ ఒక్క రోజుకి కూర తే” అని అడుక్కునే వాడ్ని.మాంసం కూర కోసం నేను గోజారడాన్ని జూసి మా అమ్మ, “నన్ను వురిబాదలు పెట్టొద్దొరేయ్. నా చేతిలో రూక వుంటే నీ చేత అడిగించుకుంటావా? నాయినా! నేనే తేనా?” అంటుంది.

ఆ మాటతో నా మొకం చిన్నదైపోతుంది! నేను నిన్ను ఉరి బాదలు పెడతా వుండానో! నిష్టూరంగా అనేసి వీధిలోకి వచ్చేస్తాను.-మా అమ్మ మాంసం కూరను సంవచ్ఛరంలో పండగ రోజుల్లో మాత్రమే తెచ్చేది. పండగ పూట కూడా అర కేజీ మాత్రమే తెచ్చేది. నాలుగు రూపాయలు పెట్టి ఒక కేజీ తెస్తే ఏమో?” అని నేనే గాదు, మా నాయిన కూడా అని వుండాడు.మా అమ్మ అర కేజీ తేగానే నేను గుండెకాయ ముక్కను నిప్పుల్లో కాల్చుకొని – మా అన్న, మా అక్క కళ్లు కప్పి తినేసే వాడ్ని!

ఇంట్లోకి మాంసం తెచ్చిన రోజునైతే నేనెప్పుడూ పొయ్యి ముందర్నే వుండి మా అమ్మతో ఎంతో కులుకుగా లక్ష మాట్లాడే వాడ్ని. కూరను పొయ్యి మీద నుంచి దించగానే మేమంతా కూర్చునే వాళ్లము.మా అమ్మ అతి జాగర్తగా గరిటను కూర చట్టిలో పెట్టి మాంసం వేసే తీరు చెప్పనలవి గానిది. అటువంటి సమయాల్లో మా నాయిన శానా సార్లు, “బంగారు బంగారు… జాగర్త జాగర్త… తూకం తూకం…” అని మా అమ్మను నవ్వుతూ ఎగతాళి చేసేవాడు.

అది ఎగతాళిగా తీసుకోకుండా మా అమ్మ మొకం నల్లంగా పెట్టుకోని, “ఒకరికి ముగ్గురి బిడ్డల్ని కనిపించి, నా ఎదాన తోస్తివి గదే-” అనేది. మా నాయినకు గూడా మాంసం కూర తెచ్చిన రోజున రెండు కడుపులు వుండేవి. చింతకాయ వూరుబిండితో రెండు ముద్దలు తినే మా అయ్య పండగ రోజున మాంసం కూర (వాసన) తో మూడు ముద్దలు మింగేసి గుటగుటా గుండు చెంబుడు నీళ్లను తాగేసేవాడు.

మా నాయిన వొంగుకొని మాంసం కూర (వాసన) తో సంగటి తింటూ ఉంటే నా కంటికి మా నాయినలో – ఏనుగెక్కిన రాజానందం కనిపించేది. మా నాయన కూడా, తూచితూచి మాంసం కూర వేసే మా అమ్మతో, పసి పిల్లవాడి మాదిర, ‘ఇంకొంచెం ఇంకొంచెం’ అని గోజారే వాడు. మా నాయిన మాంసం కూర కాడ గోజారింపుకు మా అమ్మ కుమిలి పొయ్యేది.

“నా స్వామికి కడుపు నిండికీ, ‘ఇంక నాకొద్దు’ అనేటట్టు ఎప్పుడు పెట్టబోతానో గదా!” అని మా అమ్మ మదనపడేది. మాంసం కూర తెచ్చిన పండగ పూట మా అందరికి మా అమ్మ వడ్డించే సరికి – మా అమ్మ పెద్ద కార్యం జరిపించేసినట్టు పొడుగ్గా గాలి వొదిలేది. ఆరోజు మా అమ్మ కుశాలగా కూడా వుండేది.చియ్యల కూర పులుసులో సంగటి ముద్దలను అద్దుకుని తినేది మా అమ్మ.

ఆమె జన్మంలో ఒక కారపు చియ్యను నోట్లో వేసుకుని నమిలి చీమిడి తుడుచుకుంటూ వుంటే నేనీ పాపిష్టి కళ్లతో చూసి వుండలేదు.పండగల పూట నేనూ, మా అన్న, మా అక్క, మా అయ్య మాత్రం ఆ కాసిని చియ్యల్ని నమిలి, ఎముకల్తో కుస్తీ బట్టినాక -కనకాంబరాల పూలతోట మాదిరి కేళీ విలాసంగా కళకళలాడిపోయే వాళ్ళం.

– నామిని సుబ్రహ్మణ్యం(పచ్చనాకు సాక్షిగా…. నుంచి)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!