‘మౌస్ ట్రాప్’ నాటకం ప్రత్యేకత గురించి విన్నారా ?

Sharing is Caring...

సుమ పమిడిఘంటం…………………………………. 

యు.కె. లో మనం షేక్‌స్పియర్ నాటకాలే అనుకుంటాం గానీ విచిత్రంగా 60, 65 సం.ల నుంచీ ప్రతిరోజూ రాత్రి 8.గం.లకు ప్రారంభమై 10.15 ని.లకు ముగుస్తుంది అగథా క్రీస్టీ వ్రాసిన నాటకం “మౌస్ ట్రాప్”. ఈ నాటక ప్రదర్శన 1952 సం.లో మొదలై నేటికీ ప్రదర్శిస్తున్నారు.

ఒక్క లండన్ లోనే గాకుండా 44 దేశాల్లో ప్రదర్శించారు. ఇప్పటికి 352 మంది నటీనటులు, 23 మంది దర్శకులు మారారు. ఏరోజుకారోజు పాత్రధారులు ఎవరికైనా నటించటానికి కుదరదేమోనని అన్ని పాత్రలను నటించటానికి వీలుగా 187 మంది సిద్ధంగా ఉంటారు.

గాంధీ సినిమా డైరెక్ట్ చేసిన ‘రిచర్డ్ అటెన్ బరో’ నాటక ప్రారంభంలో కొంతకాలం ప్రధాన పాత్ర ధరించారు. ఈనాటక ప్రదర్శన కాలంలో 12 మంది బ్రిటీష్ ప్రధానులు మారారు. ఈ నాటకం అనేక గిన్నిస్ బుక్ ట్రస్ట్ అవార్డులు సొంతం చేసుకుంది. ‘లండన్ ఈవినింగ్ న్యూస్’ అనే పత్రిక ఒక పోటీ నిర్వహించి బహుమతి ప్రకటించింది.

అదేమిటంటే ఒంటరిగా ఈనాటకాన్ని చూడొచ్చు లేదా ప్రదర్శనకు వసూలయ్యే మొత్తం తీసుకోవచ్చు. ఆ బహుమతి ఒకమహిళకు వచ్చింది. ఆమె డబ్బు తీసుకుని తన కూతురు కంటిచూపు కాపాడిన చిన్నపిల్లల హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చింది.మరొకసారి ఇలాగే ‘ది సండే పీపుల్’ పత్రిక ఒక పోటీ నిర్వహించితే ఆరుగురికి ఇదే బహుమతి ప్రకటించారు. ప్రదర్శన ఆదాయాన్ని పత్రిక వారు చెల్లించి ఆ ఆరుగురికి ఒక రోజు ప్రదర్శన ఇచ్చారు.

మరొకసారి నాటకాన్ని కేవలం మూగ చెవిటి వారి కోసం ప్రదర్శించారు. ఒకవైపు నాటకం ఆడుతుండగా స్టేజి ముందు భాగంలో సౌంజ్ఙభాష లో సైగలతో నాటకం గురించి తెలియపరచారు.ఈ నాటక రచయిత్రి మరణించిన రోజు కూడా ప్రదర్శన ఆగలేదు. నాటకం ఆడిన తరువాత ఆమె మరణం ప్రకటించి థియేటర్ మౌనం పాటించింది. 40సం.లు ఈనాటకానికి ప్రయోక్తగా వ్యవహరించిన ‘పీటర్ సాండర్స్’ ని బ్రిటిష్ రాణీ ‘సర్’ బిరుదుతో సత్కరించింది.

నాటకానికి టికెట్ ఖరీదు 36 పౌన్లు అంటే ₹.2600/- చాలా ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. నేరుగా నాటకానికి వెళితే టికెట్స్ వుండవు.ఊరికి దూరంగా ఒక గెస్ట్ హౌస్. ఆరోజురాత్రి మంచుతుఫాను. ఇరువురు దంపతులు ఆహౌస్ నడుపుతుంటారు. ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు అతిధులు వస్తారు. ఎక్కడో జరిగిన ఒక హత్య పరిశోధన నిమిత్తం ఒక డిటెక్టివ్ ఆహౌస్ కు వస్తాడు. ఆహత్యలో ఈ వచ్చిన ఐదుగురిలో ఒకరికి సంబంధం వుందని ప్రకటిస్తాడు.

వీళ్ళని విచారిస్తుండగా ఒక గావుకేక వినబడి అక్కడ మరొక హత్య జరుగుతుంది. దానితో మొదటి రంగం ముగుస్తుంది ‌. హౌస్ లో వున్నవారంతా ఎలుకల బోను చిక్కినట్లు చిక్కున్నారు. రెండవ రంగంలో డిటెక్టవ్ చాలా ఉత్కంఠత కలిగేలా విచారణజేసి హత్యచేసింది ఫలానా అని రుజువు కావటంతో నాటకం ముగుస్తుంది.

“ఐతే వీరిలో ఈహత్యచేసిందెవరో నాటకంచూసిన మీకుతెలుసు. దయచేసి ఎవరు హత్యచేశారో బయటకువెళ్ళి ఎవరికీ చెప్పకండి. ఈనాటకంలో మీరూ భాగస్వాములు” అని ప్రేక్షకులకు ఒక అప్పీల్ చేస్తాడు ప్రధాన పాత్రధారి. ఇంతవరకు ఆ సస్పెన్స్ ఏ ప్రేక్షకుడు ఎవరికీ చెప్పలేదు. నాటక విజయానికి కీలకం సస్పెన్స్ ఐతే ఆ సస్పెన్స్ ఆడియన్స్ ఎవరికీ చెప్పకపోవటం అత్యంత కీలకం.

“నల్లూరన్న” పేరిట ఒక పుస్తకం తిరుపతి వారు ప్రచురించారు. అందులో శ్రీ యస్సే రావు గారు అనే ఆర్టిస్ట్ లండన్ వెళ్ళి నాటకం చూసి వ్రాసిన వ్యాసాధారంగా ఈపోస్టు. యస్సే.రావుగారు కూడా ఈనాటకం సస్పెన్స్ ప్రయోక్త మాటకు కట్టుబడి ఎవరికీ రివీల్ చేయలేదు. ఈ నాటకం సస్పెన్స్ ఎవరికీ చెప్పకపోవటం బ్రిటన్ పౌరులు ఒక హక్కుగా, బాధ్యతగా భావిస్తారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!