సీరియస్ ఆడియన్స్ కు నచ్చే సినిమా !!

Sharing is Caring...

యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు బెల్ బాటమ్ సినిమా నచ్చుతుంది. 1980 దశకంలో జరిగిన విమాన హైజాక్ ఘటనలను ఆధారం గా చేసుకుని ఈ సినిమా తీశారు. ప్రధాని ఇందిర హయాంలో నాలుగు హైజాక్స్ జరిగి దేశ ప్రతిష్ట కి భంగం వాటిల్లిన క్రమంలో మరొక హైజాక్ జరుగుతుంది.

రా అధికారులు తీవ్రవాదులను ఎదుర్కొని ప్రయాణీకులను ఎలా రక్షించారు ? రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ) ఇంటెలిజెన్సీ అధికారిగా అక్షయ్ కుమార్ రంగంలోకి దిగి ఏం చేశారు ? తీవ్రవాదుల సవాల్ ను ఎలా తిప్పికొట్టారు అనేది కథాంశం. 

కథనం ఆసాంతం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకు బెల్ బాటమ్ టైటిల్ కి సంబంధం ఏమిటని సందేహం రావచ్చు. బెల్ బాటమ్ అనేది రా ఏజెంట్ కోడ్. వాళ్ళు అసలు పేర్లు బయటికి చెప్పరు. మొదటి భాగంలోనే అక్షయ్ కుమార్ తల్లి కూడా ఒక విమాన హైజాక్ ఘటనలో మరణిస్తుంది. తీవ్రవాదులు కర్కశంగా వ్యవహరించడంతో అతని తల్లి ప్రాణాలు కోల్పోతుంది. ఈ దృశ్యాలన్నీ ఎమోషనల్ గా ఉండి  ప్రేక్షకులను కదిలిస్తాయి.

కీలక సమస్యలు ఎదురైనపుడు ప్రభుత్వాన్నినడిపే ప్రధాని వంటి నేతలు ఏం చేస్తారు ? ఎవరెవరితో చర్చిస్తారు ? స్పాట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దర్శకుడు చక్కగా చూపించాడు. మొదటి భాగం కంటే రెండో భాగం ఉత్కంఠ తో నడుస్తుంది. ప్రయాణీకుల పరిస్థితి ఏమిటి ? అక్షయ్ వారిని ఎలా రక్షిస్తాడు ? అన్న ఉత్కంఠ చివరి వరకు నడుస్తుంది. వాస్తవ ఘటనలకు కొంచెం మసాలా పెట్టి దర్శకుడు రంజిత్ కథను చక్కగా తెరకెక్కించారు.

మొదటి భాగం కొంచెం బోర్ అనిపిస్తుంది. అసలు కథ మొదలయ్యాక ఆడియన్స్ అందులో లీనమవుతారు.  ప్రేక్షకుడు ఊహించేలా కథ సాగదు. దర్శకుడు ఆ విషయంలో శ్రద్ధ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు ఊహించిన ట్విస్టులు చివర్లో వస్తాయి. క్లయిమాక్స్ సన్నివేశాలు సినిమాకు బలాన్నిఇచ్చాయి.ఇసుక తుఫాను వచ్చిన సీన్లను బాగా చిత్రీకరించారు. 

ఇందిరా గాంధీ పాత్రలో లారా దత్తా బాగుంది.. మేకప్ బాగా చేశారు. తనదైన హావభావాలతో ఇందిరను తలపించింది. వాణీ కపూర్ చిన్న రోల్ అయినా పాత్రలో ఒదిగి పోయింది. అక్షయ్ తల్లిగా డాలీ అహ్లువాలియా నటన ఆకట్టుకుంటుంది. అక్షయ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించాడు.

ఆ పాత్రకు కరెక్టుగా ఫిట్ అయ్యాడు. న్యాయం చేసాడు. మ్యూజిక్ … ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. ఇదే కథను తెలుగులో తీస్తే పాటలు పెట్టి అంక చండాలం చేస్తారు. అలాంటి ప్రయోగాలు లేకుండా ఈ సినిమా తీయడం విశేషం. ఇంటిల్లిపాది హాయిగా సినిమా చూడవచ్చు. ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చూడనివారు చూడవచ్చు.  

——–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!