తేజస్వి యాదవ్ …. అతగాడి వయసు జస్ట్ 31 ఏళ్ళు మాత్రమే … చిన్నవాడైనేతనేమి కాకలు తీరిన రాజకీయ వేత్త నితీష్ కుమార్ ను పరుగులు తీయించాడు. అనితర సాధ్యమైన పోరాట పటిమను చూపాడు. అతగాడి దెబ్బకు నితీష్ ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ రాజకీయాలకు దిగాడు. 2015 ఎన్నికల్లో నితీష్ గురించి ప్రధాని మోడీ చేసిన విమర్శల వీడియోలను జనంలోకి వదిలి బీజీపీ నేతల గుండెల్లో వణుకు పుట్టించాడు. వాటికి జవాబు చెప్పుకోలేక బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడ్డారు.
తేజస్వీ తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నాడు. ఒంటి చేత్తో ప్రచారాన్నినిర్వహించాడు. నిరుడు లోకసభ ఎన్నికల ప్రచారం లోకూడా తేజస్వి యే ప్రధాన ప్రచార కర్త. ఈ సారి ఎన్నికల ఫలితాలను బట్టి చూసుకుంటే బీజేపీ కంటే ఆర్జేడీ ఒక సీటు ఎక్కువే సాధించింది. 75 సీట్లు గెలిచి సింగల్ లార్జెస్ట్ పార్టీ స్థాయికి చేరుకుంది. బీజేపీ 110 సీట్లలో పోటీ చేయగా 74 మాత్రమే వచ్చాయి. 2015 లో బీజేపీ 157 చోట్ల పోటీ చేస్తే 53 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఎన్డీయే తరపున ప్రధాని మోడీ 12 చోట్ల ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ఇతరనేతలు రంగంలోకి దిగారు. అయినా సీట్లు ఆశించిన స్థాయిలో రాలేదు. 21 సీట్లు పెరిగాయి. బలం కొంత మేరకు పెరిగింది.
ఇక నితీష్ జేడీయు పార్టీ 2015 లో 71 సీట్లు గెలవగా ఇపుడు 43 స్థానాలకే పరిమితం అయింది. ఈ పరిణామం నితీష్ కి మైనస్ కావచ్చు. 2015 తో పోలిస్తే ఆర్జేడీ కి 5 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ ఎన్డీయే కి గట్టి పోటీ ఇచ్చాడు. తేజస్వి అనుభవ లేమి వలన సరైన రాజకీయ వ్యూహాలు అమలు చేయలేకపోయాడు. కాంగ్రెస్ బలాన్నిసరిగ్గా అంచనా వేయలేకపోయాడు. కాంగ్రెస్ కి 70 సీట్లు ఇచ్చి పెద్ద తప్పిదం చేసాడు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచింది కేవలం 19 సీట్లు మాత్రమే. గత ఎన్నికలో 41 చోట్ల పోటీ చేసి 27 చోట్ల ఆ పార్టీ గెలిచింది.
అప్పటితో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలహీన పడినట్టే అని చెప్పుకోవాలి . ఇక ఆపార్టీ ప్రచారానికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు రాకపోవడం మేజర్ మైనస్ పాయింట్. పార్టీ పరిస్థితి బాగాలేదని రాంగ్ సిగ్నల్స్ జనంలోకి వెళ్లాయి. సోనియా ఆరోగ్యం బాగాలేదు. ఆమెను ఏమి అనలేం. కానీ ఇతర నాయకులకు ఏమైందో తెలీదు. ప్రియాంక గాంధీ ఇటు కేసి తొంగి కూడా చూడలేదు. పార్టీ వ్యూహ కర్త అశోక్ గెహ్లాట్ కూడా మొహం చూపించలేదు. ఒక్క రాహుల్ మాత్రమే 8 చోట్ల ప్రచారం చేశారు.
రాహుల్ ప్రభావం కూడా పనిచేయడం లేదని ఈ ఎన్నికలతో మరోసారి తేలిపోయింది. 70 సీట్లలో పోటీ చేసి ఆపార్టీ నేతలు చేయాల్సిన స్థాయిలో సీరియస్ గా ప్రచారం కూడా చేయలేకపోయారు. బీహార్ కాంగ్రెస్ ను అనాథను చేశారు.అందుకే ఫలితాలు అంత ఘోరంగా ఉన్నాయి. కనీసం ప్రచారం కూడా చేయలేని పార్టీని ఎవరైనా నమ్ముతారా ? అందుకే ఓటర్లు కాంగ్రెస్ కి చెయ్యిచ్చారు. అలాంటి పార్టీ తో పొత్తు పెట్టుకున్నందుకు తేజస్వి ఇపుడు వాపోతున్నారట. మరో నలభై సీట్లలో తానే పోటీ చేసినా లేదా మొత్తం స్థానాల్లో సింగిల్ గా ఆర్జేడీ యే బరిలోకి దిగినా ఫలితాలు వేరే విధంగా ఉండేవి.
మొత్తం మీద బీహార్ గడ్డపై ఒక సత్తా ఉన్ననాయకుడు ఉన్నాడని దేశం అందరికి తెల్సింది. తన నేతృత్వంలోని మహాకూటమిని విజయం అంచులదాకా తెచ్చిన తేజస్వి అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా అధికార పార్టీకి చుక్కలు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2015 లో నితీష్ క్యాబినెట్లో తేజస్వి డిప్యూటీ సీఎం గా కూడా చేశారు కాబట్టి తన సత్తా చాటుకునే ప్రయత్నాలు తప్పక చేస్తాడు. కాంగ్రెస్ తో కూడిన కూటమి నుంచి దూరంగా జరిగితే తేజస్వికి ఉజ్వల భవిష్యత్ ఉండొచ్చు. కాంగ్రెస్ నుంచి బయట కొచ్చి సత్తా చాటిన యువనేతలు జగన్, ఫెమా ఖండు వంటి వారిని చూసి ఒంటరి పోరాటాలు చేయడం నేర్చుకోవాలి.
———— K.N.MURTHY
ఇది కూడా చదవండి >>>>>>> దుర్యోధనుడికి డ్యూయెట్ ? ఎన్టీఆర్ కే సాధ్యం!