Srinivasreddy Lethakula………………… A novel describing the ‘Indigo Revolt’
ఇచ్చామతీ తీరాన… ఈ నవలను బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ రాశారు. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా? సాహిత్య ప్రయోజనం గురించి చాలామంది చర్చిస్తూ ఉంటారు. ఆ మాట కొస్తే సాహిత్యమే ఊహాజనితమైనది. రచయిత ఊహల్లోంచి జన్మించిన ఒక కళాకృతి లేక సమాజ దర్పణం ‘సాహిత్యం’,ఉత్త మిథ్యే.ఇందులో నిజం లేదు అని ఒక వాదం ఉంది.
కొన్నివేల సంవత్సరాల క్రితం నాటి ఇతిహాసాలు ఈనాటికీ మానవునికి ఆదర్శవంతంగా వుండి సమాజాన్ని కొంత మేరకు నడిపిస్తున్నాయంటే సాహిత్య ప్రభావం సమాజంపై ఎంతో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సాహిత్యం కూడా వారి వారి మనోధర్మాన్ని బట్టి పాఠకుని ప్రభావితం చేస్తుంది.
మన దేశాన్ని ఈనాటి బంగ్లాదేశ్ ను కలుపుతూ ప్రవహించే ఒక నది ఇచ్ఛామతి.
19వ శతాబ్ది ఉత్తరార్థంలో దక్షిణ బెంగాల్లోని పాంచ్ పోతా అనే గ్రామమూ, దాని సమీపంలోని మొల్లాహాతీ లో ఏర్పాటైన ఒక నీలి పంట ప్లాంటేషన్ ఈ రచనలోని కథాస్థలం. బ్రిటిష్ దొరల యాజమాన్యంలో నడిచిన ఇండిగో ప్లాంటేషన్లను అక్కడి ప్రజలు ‘నీలకుటి’ లని పిలిచేవారు.
ఈ నవలలోని ప్రధాన పాత్రలు: రాజారాం: బ్రిటిష్ వారికి దివాన్, కర్కోటకుడు, రైతులను, ప్రజలను పీల్చి పిప్పి చేసేవాడు. భవాని భరుజీ: సన్యాస జీవితాన్ని స్వీకరిద్దామనుకొని ఐదు పదుల వయసులో రాజారామ్ ముగ్గురి చెల్లెల్ల ను వివాహమాడినవాడు.
నలూపాల్: సరుకులు నెత్తిన పెట్టుకొని సంతలో అమ్ముకునే స్థాయి నుండి ఆ ప్రాంతాన్ని శాసించే ధనికుడిగా ఎదిగిన వ్యక్తి. ఇంకా రాజారాం చెల్లెల్లు తులూ, బిలూ, నీలూ, బుర్ర సాహెబ్ అనే ఆంగ్లేయుడు విచిత్ర పాత్ర చిత్రణ గయా .. ఆవిడ తల్లి, పిప్టాన్ సాహెల్ ,ప్రసన్న చక్రవర్తి( భూమి కొలతల వాడు), నాటి కట్టుబాట్లను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ‘నిస్తారిని ‘అనే బ్రాహ్మణ స్త్రీ లాంటి ముఖ్యమైన పాత్రలు.
19వ శతాబ్ది ఉత్తరార్ధంలో నీలకుటి యజమానులైన తెల్లదొరలు బ్రాహ్మణులైన రాజారామ్ లాంటి దివాన్లు, ఎస్టేట్లో ప్రైవేట్ సైన్యంగా పనిచేసే లాఠీయాల్ అనే వస్తాదులు ..,.ఈ అధికార యంత్రాంగం చలాయించే దౌర్జన్యం కింద పేద ప్రజల జీవితాలు నలిగిపోయాయి. ధాన్యం పండించుకునే వ్యవసాయ భూముల్లో బలవంతంగా నీలి పంట సాగు చేయించడంతో ఇటు తిండి గింజలు కరువై అటు నీలి పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు ఆర్థికంగా చితికిపోయారు.
వాళ్ల లోలోపల రగులుతూ వచ్చిన అసంతృప్తి అగ్రహం కన్నీళ్ల ఉప్పదనం ఈ నది జలాల్లోనే కలిసిపోవడమేగాక, అసంతృప్తి, ఆగ్రహం 1859,1862 నాటికి సాయుధ తిరుగుబాటుగా బద్దలైంది. ఆ పరిణామమే ‘ఇండిగో రివోల్ట్ ‘గా చరిత్రలో నమోదయింది.
బెంగాల్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల నడుమ అనుసంధానంగా రైలు మార్గాలు, మోటార్ బోట్లు ప్రవేశించాయి. దీనితో ఆర్థిక, రాజకీయ పరిణామంగా మార్పులు, ముఖ్యంగా నాడు కులవృత్తులలో వస్తు మార్పిడి పద్ధతిలో జరుగుతూ వున్న క్రమంలో క్రమంగా… డబ్బు ప్రవేశించింది. అలాగే కులీన,సామాన్య మహిళల విషాద స్ఫూర్తిని మోసుకుంటే ప్రవహించే ఇచ్చామతి నది తన వేగాన్ని, రూపాన్ని మార్చుకుంటూ అవిశ్రాంతంగా ప్రవహించే జీవనదిని మానవ జీవితానికి ప్రతీకగా రచయిత నిలిపాడు.
ఆ నదీ తీరం వెంబడి తరతరాలుగా వికసించి గతించిన జీవితాల జాడలను అన్వేషిస్తూ అతను సాగించిన తాత్వికమైన ప్రయాణమే ఈ రచన. బలవంతంగా నీలిమందు పండించే రైతులు తిరగబడి రాజారామ్ ను హత్య గావించడం,తదనాంతరము నాటి బెంగాల్ సమాజం ఎన్నో మార్పులకు నాంది అయినది.కులీనులు, ఇంగ్లీష్ దొరలు అనామకులుగా, అనామకులు ఆర్థికంగా పరిపుష్టి అవ్వడం, ఈ సంధి యుగాన్ని అక్కడి మనుషుల బహిరాంతర సంఘర్షణలను నిష్పాక్షికంగా నమోదు చేశాడు భిభూతి భూషణ్.
ఈ నవలలో దాదాపు ప్రతి పాత్ర వైవిద్య భరితమైన వ్యక్తిత్వ ఛాయలతో కనబడుతుంది. జీవిత గమనంలోనే వివిధ దశల గుండా సాగుతూ, తనను తాను సమీక్షించుకుంటూ మార్పుకు సిద్ధపడుతూ ఉండే భవాని భరోజీ లాంటి పాత్రలే కాక, విషాద భరితంగా ముగిసిన బుర్ర సాహెబు, ప్రసన్న చక్రవర్తి, గయా లాంటి సజీవ పాత్రలు కూడా మనల్ని వెంటాడుతాయి.
అందుకేనేమో ఈ కథకు ఒక నిర్దిష్టమైన ముగింపును ఇవ్వలేదు రచయిత. ఈ విధంగా ఇచ్చామతిని మానవ జీవితానికి ప్రతీకగా ఆయన నిలిపాడు. ఒక దేశ చరిత్రను రాయటం అంటే ఏ గుర్తింపు లేని, నోరులేని ప్రజల గాధలను నమోదు చేయడమేనన్నది భిభూతి భూషణ్ స్వయంగా ప్రకటించుకున్న సాహిత్య దృక్పథం, దానికి ఒక మేలిమి ఉదాహరణ వారి ఈ చిట్టచివరి రచన.
తాను ప్రకటించుకున్న ఈ సాహిత్య దృక్పథానికి అనుగుణంగా ఇచ్చామతి నది తీరంలోని ప్రజా జీవనాన్ని ఈ నవలలో చిత్రీంచారు. ఈ నవల అనువాదమని పాఠకునికి అనిపించకుండా కాత్యాయని గారు తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. లోగిలి బుక్స్ లో లేదా Flipkart లో ఈ పుస్తకం దొరుకుతుంది.