ఈయన ఎవరో తెలుసా? 60 ఇయర్స్ఇన్ పాలిటిక్స్!

Sharing is Caring...

తమిళనాడు లోఈయన చాలా పాపులర్ లీడర్. పేరు దురై మురుగన్. నిండు అసెంబ్లీ లో జయలలిత చీరె లాగి అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నది ఈయనే. అప్పట్లో డీఎంకే అధినేత కరుణానిధికి కుడిభుజం లాంటి వాడు.1989 మార్చి 25 న ఈయన పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. జయలలిత, ఆమె అనుచరులు బహిరంగంగానే దురై మురుగన్ పై ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ ఆరోపణలను దురై మురుగన్ ఖండించారు.

ఆ రోజున  అసెంబ్లీలో సీఎం కరుణానిధి బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. అప్పట్లో ఆర్ధిక శాఖ కూడా ఆయన వద్దనే ఉంది. ప్రతిపక్ష నేత జయ ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ … తన ఫోన్ ట్యాప్ చేశారని ..ఒక క్రిమినల్ బడ్జెట్ ఎలా సమర్పిస్తారని ప్రశ్నించారు. జయ ప్రశ్నతో కోపగించుకున్న కరుణానిధి వెళ్లి శోభన్ బాబు ను అడుగు అంటూ వెటకారం గా సమాధానం ఇచ్చారు. దీంతో సభలో గొడవ మొదలైంది.

జయ పార్టీ సభ్యులు కరుణానిధిని చుట్టుముట్టారు. డీఎంకే సభ్యులు దాడులకు దిగారు. కరుణ సన్నిహితుడు , మంత్రి దురై మురుగన్ మరో అడుగు ముందుకేసి జయ చీర పట్టుకుని లాగారని అంటారు.ఈ క్రమంలోనే సభలో పరిస్థితి అదుపు తప్పింది. చెప్పులు విసురుకున్నారు. మైక్రో ఫోన్లు విరిచి వాటి కడ్డీలతో దాడులకు దిగారు. అన్నాడీఎంకే సభ్యులు , జయ గాయపడ్డారు.నిండు సభలో జయ కన్నీరు పెట్టారు.

చెదిరిన జుట్టు, చిరిగిన చీర తో అసెంబ్లీ బయటకొచ్చిన జయలలిత ఫోటోలు  దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఒక్కసారిగా దేశప్రజల దృష్టి తమిళ రాజకీయాలపై పడింది. దీంతో కరుణానిధి దుర్యోధనుడిగా .. దురైమురుగన్ దుశ్శాసనుడిగా వార్తల్లో కెక్కారు. ఒక గంటలో డీఎంకే కు అతి పెద్ద డ్యామేజీ జరిగిపోయింది. మీడియా ముందుకొచ్చిన జయ కరుణానిధిని ఓడించేవరకు అసెంబ్లీ లో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశారు.

ఆ తర్వాత కేంద్రం డీఎంకే ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా రద్దు చేసింది. దీంతో 1991 లో ఎన్నికలు వచ్చాయి.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తో జయ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల ప్రచారం కోసమే తమిళనాడు వచ్చిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీ పెరంబదూర్ లో హత్యకు గురయ్యారు. రాజీవ్ హత్య కారణంగా వెల్లువెత్తిన సానుభూతి కూడా జయ కు ప్లస్ అయింది. అన్నాడీఎంకే కాంగ్రెస్ కూటమి 224 సీట్లు సాధించింది. డీఎంకే 7 సీట్లకు పరిమితమై దారుణ పరాజయం పాలైంది.  

ఇక దురై మురుగన్ గురించి చెప్పుకోవాలంటే సీనియర్ మోస్ట్ లీడర్. కాట్పాడి నియోజక వర్గం నుంచి 1971, 1989 1996,2001,2006,2011,2016 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 84,91 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకు ముందు రాణిపేట అసెంబ్లీ స్థానం నుంచి 77,80 ఎన్నికల్లో గెలిచారు. అంటే మొత్తం 9 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.

ఓటుహక్కు రాక ముందు నుంచే డీఎంకే లో సభ్యుడు ఈయన. రాజకీయాల్లో మురుగన్ ది ’60 ఇయర్స్ ఇండస్ట్రీ’అని చెప్పుకోవచ్చు.కరుణానిధి క్యాబినెట్లో పలు కీలక పదవుల్లో పనిచేశారు. మంచి స్పీకర్ అనే పేరుంది. ప్రస్తుతం డీఎంకే ప్రధాన కార్యదర్శిగా కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు కాట్పాడి నియోజకవర్గం లో ఆయనతో టిక్కెట్ కోసం పోటీ పడినవారు లేరు. 82 ఏళ్ళ మురుగన్ కొంత కాలంగా వృద్దాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోనే ఉంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా గెలిచారు. 

post upadeated on december 1..2021

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!