లక్ష ఏళ్ళ నాటి ఆదిమానవుల అవశేషాలు ఇటీవల ఇటలీ దేశంలో బయటపడ్డాయి. ఆగ్నేయ రోమ్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఒక పురాతన గుహలో ఈ అవశేషాలను గుర్తించారు. శాన్ ఫెలిసె సిసెరో అనే పట్టణంలోని గువాట్టారి కొండగుహలో మొత్తం తొమ్మిదిమంది ఆదిమానవులకు సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు.
ఇక్కడ తవ్వకాలు జరిపినపుడు పుర్రె ముక్కలు.. విరిగిన దవడ ఎముకలు వంటి అవశేషాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఏడుగురు బాలురు .. ఒక బాలిక .. ఒక యువకుడికి చెందినవిగా భావిస్తున్నారు. ఎముకలను పరిశీలించిన పిదప చని పోయిన వారందరూ వేర్వేరు కాలాల్లో బతికి ఉండవచ్చని అంచనా వేశారు.
కొన్ని ఎముకలు యాభై .. అరవై ఎనిమిది వేల ఏళ్ళ నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరందరూ హైనాలు దాడి లో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. హైనాలు దాడి చేసి చంపిన వారి మృత దేహాలను కొండ గుహలోకి లాక్కుని వచ్చివుంటాయని అంటున్నారు. ఈ కొండగుహ ప్రాంతంలో మొదటిసారిగా 1939 లో ఆదిమానవుల అవశేషాలు గుర్తించారు.
భారీ భూకంపాల కారణంగా ఈ కొండ గుహ దాదాపు 60 వేల ఏళ్ళు రాళ్లతో మూసుకుపోయింది. దీంతో అందులోని అవశేషాలు పాడవకుండా భద్రంగా ఉన్నాయి. అక్కడ ఆదిమానవుల అవశేషాలతో పాటు కూరగాయల ముక్కలు, ఖడ్గమృగం, పెద్ద జింక, హైనాల అవశేషాలను కనుగొన్నారు.
వీటితో పాటు అంతరించిపోయిన బోవిన్, ఏనుగులు,ఎలుగుబంట్లు,అడవి గుర్రాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. మనుష్యులు ఎలా మరణించారో ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇటాలియన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ విశేషాలను ప్రకటించింది. గుహ వేల ఏళ్ళు మూసుకుపోవడం .. అందులోని అవశేషాలు ఇప్పటికి భద్రంగా ఉండటం చిత్రం ఉంది కదా.