గురువును మించిన శిష్యుడు !

Sharing is Caring...

ప్రముఖ చిత్రకారుడు గోపాలన్ కి ఏకలవ్య శిష్యుడే మన తెలుగు జాతి గర్వించదగిన ఆర్టిస్ట్ బాపు. గోపులు ను చూసి తాను స్ఫూర్తి పొందానని ఒక ఇంటర్వ్యూలో కూడా బాపు చెప్పారు. గోపులు తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్ కు రాజకీయ కార్టూన్లు గీసేవారు.

కేవలం రాజకీయాలే కాదు ఏ సబ్జెక్టు పై అయినా అలవోకగా ఆయన చిత్రాలు గీసేవారు.  దైనందిన జీవితంలో తాను పరిశీలించే అంశాలనే కార్టూన్స్ గా గోపులు గీసేవారు. వాటికి అద్భుతమైన స్పందన వచ్చేది. 

గోపులు అంటే అప్పట్లో తమినాడులో చాలా ఫేమస్. తిల్లన మోహనంబల్, వాషింగ్టన్ తిరుమానం వంటి  ప్రసిద్ధ తమిళ నవలలకు ఆయన బొమ్మలు గీశారు.అవి గోపులు కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. 1940 ప్రాంతంలో గోపులు ఉద్యోగం కోసం మద్రాస్ వచ్చి అప్పటి ప్రముఖ కార్టునిస్ట్ మాలి దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేసారు. అలా చేస్తూనే మాలి నుంచి చిత్రకళలో మెళకువలను గ్రహించారు.

తర్వాత ఆనంద వికటన్ లో చేరారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు గోపులు  ఆనంద వికటన్ లో పనిచేసారు. తర్వాత కాలంలో ఇతర మ్యాగజైన్‌ల కు బొమ్మలు వేశారు. కొంత కాలం ఒక యాడ్ ఏజెన్సీని కూడా నడిపారు. సన్ టీవీ లోగో ను తయారు చేసింది ఈయనే. ఆయన అసలు పేరు గోపాలన్ . గోపులు గా మార్చుకున్నారు.

తంజావూరు కి చెందిన గోపులు కుంభకోణం లోని  ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. గోపులు అమెరికన్ చిత్ర కారుడు నార్మన్ రాక్‌వెల్, ప్రముఖ కార్టూనిస్ట్ డేవిడ్ లకు ఏకలవ్య శిష్యుడు. నిరంతరం వారి చిత్రాలను .. కార్టూన్లను పరిశీలించేవారు.  గోపులు చిత్రాలపై వారి ప్రభావం కొంత ఉండేది.  

గోపులు ను 1991 లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది.అలాగే మురసోలి అవార్డు..  ఎంఏ చిదంబరం చెట్టియార్ అవార్డు లు కూడా ఆయన అందుకున్నారు.  2001 లో బెంగుళూరులో “ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ “ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోపులు ను  జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. 2015లో గోపులు 91 ఏళ్ళ వయసులో కన్నుమూసారు. 

ఇక బాపు విషయానికొస్తే ఆయన పుట్టింది .. పెరిగింది చెన్నైలోనే. బాపు చదువుకునే రోజుల్లోనే చిత్రకళను అభ్యసించారు. బాపు నాన్నగారు కూడా బొమ్మలు వేసేవారు. ఆయన అడ్వకేట్ గా చేస్తున్నప్పటికీ హాబీగా బొమ్మలు వేసేవారు.

ఆయన నుంచే ఈ చిత్రకళ బాఫు గారికి అబ్బింది. ఈ చిత్రకళ కూడు పెట్టేది కాదని బాపు తండ్రి గారి  అభిప్రాయం.ఆ రోజుల్లో ఆర్టిస్టుగా బతకడం నిజంగా కష్టంగా ఉండేది. అందుకని బాపును లా చదివించారు.

లా కోర్సు చేసాక కొన్ని రోజులు  బాపు స్నేహితుల దగ్గర నల్లకోటు అరువు తీసుకుని అడపా దడపా కోర్టుకు వెళ్లేవారు. కాలేజీ రోజుల్లోనే గోపులు గురించి బాపుకి ఎవరో చెప్పారు. వెళ్లి కలిసి పరిచయం చేసుకున్నారు. తాను గీసిన గొమ్మలు కూడా చూపారు. గోపులు బాపుని అభినందించారు. అప్పటి నుంచి  ప్రతి ఆదివారం ఆర్టిస్టుల దగ్గరకు బాపు వెళ్లేవారు.

ఎక్కువగా గోపులు దగ్గరికి వెళ్లి  ఆయన బొమ్మలు వేస్తుంటే చూసే వారు. అలా చూస్తూనే అన్ని పరిశీలించేవారు. బాపు అంటే గోపులు చాలా ఇష్టపడేవారు. అలా ఆయనకు ఏకలవ్య శిష్యుడి  గా  చిత్రకళలో కొన్ని మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత కథ అందరికి తెలిసిందే. చిత్రకళలో ఆయన తన గురువును మించి పోయారు. అనంత కీర్తిని సొంతం చేసుకున్నారు. 

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!