ఒక అన్వేషి యాత్ర – అనుభవాలు 2 !

Sharing is Caring...

Thopudu bandi  Sadiq ………………………….

నిజంగా మహావతార్ బాబాజీ ఉన్నారా?ఆయన గత రెండువేల సంవత్సరాలుగా ,భౌతిక దేహాన్ని త్యజించి ఆత్మరూపంలో  సంచరిస్తున్నారా?సందర్భానుసారంగా భౌతిక రూపంలో దర్శనం ఇస్తారా?లేక యోగానంద పరమహంస సృష్టించిన ఊహాజనిత రూపమా?క్రియాయోగను వ్యాప్తి చేయటానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆ పేరును,ఒక కల్పిత రూపాన్ని ఉపయోగించారా? చాలామందిని వేధించే ప్రశ్న ఇది.

ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం.సృష్టిలో అనేకానేక విచిత్రాలు,అద్భుతాలు ఉన్నాయి.ఏదైనా అనుభవంలోకి వస్తే కానీ అర్ధం కావు. నాలాంటి వారికి అది ఒక విశ్వాసం.లేరూ అని స్వయంగా నిర్ధారణ అయ్యేంత వరకు ఉన్నారూ అనే ఒక విశ్వాసంతోనే ఉంటాను.జీవితం అంటేనే ఒక నమ్మకం .ఆ నమ్మకంతోనే ముందుకు సాగుతుంటాను.

ఒక ఆలయంలో దీపం వెలిగించాలీ అంటే , ముందుగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత గర్భగుడిని శుద్ధి చేయాలి.ఆ తర్వాతే దీపం వెలిగించాలి.అప్పుడే ఆ జ్యోతి దివ్యకాంతిని వెదజల్లుతుంది. అలాగే,నీలో జ్ఞానజ్యోతి వెలగాలీ అంటే, నీ దేహం శుభ్రంగా, ఎలాంటి మలినాలు లేకుండా ఉండాలి.

నీ మనసులో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా చేసుకోవాలి.ఆ తర్వాతే నీ హృదయంలో జ్ఞానజ్యోతి వెలిగించే ప్రయత్నం చేయాలి.అప్పుడే నీలో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి.అప్పుడే నిన్ను నీవు తెలుసుకోవటం మొదలవుతుంది.

కుకూచిన ఒక అపురూపమైన ప్రదేశం.అక్కడి గాలిలో ఒక దైవత్వం ఉంటుంది.ప్రశాంతత గూడు కట్టుకొని ఉంటుంది.అక్కడికి చేరుకోగానే దేహం,హృదయం రెండూ తేలిక అవుతాయి.మేము వచ్చిన దారి కాకుండా మూడు వైపులా ఎత్తైన హిమాలయాలు ఉంటాయి.అయితే ఎక్కడో దూరంగా ఉండే కొండలపై మాత్రమే మంచు ఆవరించి ఉంటుంది.

మిగిలిన కొండలన్నీ పచ్చగా,దట్టంగా కన్పిస్తుంటాయి.జనవరిలో ఆ కొండలు కూడా మంచుతో నిండిపోతాయి. చిన్న కొండమీద జోషిగారి కాటేజీలు ఉంటాయి. మొత్తం కలిపి 20 వరకూ ఉంటాయి.చుట్టూ అందమైన పూలమొక్కలు విరగబూసిన రంగురంగుల పూలతో కళ్ళను తిప్పుకోనివ్వకుండా చేస్తుంటాయి. కింద జోషి గారి కిరాణా షాపు,హోటల్ ఉంటాయి.ఆల్-ఇన్-వన్ మనకు అవసరమైనవన్నీ అక్కడే దొరుకుతాయి.

యాభై ఏళ్ళ క్రితం జోషి గారి తండ్రి దాన్ని ప్రారంభించారు.ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాన్ని నిర్వహిస్తున్నారు. వారంతా ప్రేమాస్పదులు. అతిధి,అభ్యాగతులను ఆదరించటం వారి నుంచే నేర్చుకోవాలి. జోషి గారు నిరంతరం మనస్పూరిగా నవ్వుతూ ఉంటారు.గదులు,ఆహారం కూడా చాలా చవక.అక్కడ అది తప్ప మరే ఇతర వసతి సౌకర్యం లేదు.

దూరంగా మరో చిన్న అల్పాహార హోటల్ కం కిరాణా షాపు ఉంటాయి .అంతకన్నా అక్కడ ఇంకెవరూ ఉండరు.కేంద్రమంత్రి ఉమాభారతి ,రజనీకాంత్,జుహీ చావ్లా ,మన పిరమిడ్ యోగి సుభాష్ పత్రీ లాంటి వారు తరచూ అక్కడికి వస్తుంటారు.ఎవరు వచ్చినా జోషి గారి దగ్గర ఉండాల్సిందే. రూములు చాలా సాధారణంగా ఉంటాయి.

రాత్రుళ్ళు చలి గజగజ లాడిస్తుంది.దానికి తగిన రగ్గులు అక్కడ అందుబాటులో ఉంటాయి.నక్షత్రాలు టెన్నిస్ బంతుల సైజులో చేతికి అందేలా ఉంటాయి.స్నానానికి వేడినీళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మేము వెళ్లేసరికి ఒక బెంగాలీ ప్రొఫెసర్ ఉన్నారు.అప్పటికి ఆయన వచ్చి పదిరోజులు అయ్యిందట.ప్రతీ ఏడాది వచ్చి కొంతకాలం అక్కడ గడిపి వెళ్తూ ఉంటారట.

జోషిగారి కాటేజ్ నుంచి బాబాజీ గుహ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.నడక తప్ప వేరే మార్గం లేదు.స్థానిక గైడ్ సహాయం లేకుండా మనం అక్కడికి వెళ్ళలేము.అది కూడా జోషి గారు ఏర్పాటు చేశారు.అతనికి నాలుగు వందల రూపాయలు ఫీజ్ చెల్లించాలి.మాతో వచ్చిన గైడ్ పేరు అమిత్పహాడీ.

మార్గం అంత కష్టమైనది కాదు.అలాగని సునాయాసమూ కాదు.రాళ్ళూ,రప్పలూ సహజంగానే ఉంటాయి.విషపూరితమైన బిచ్హూ ఘాస్ ఉంటుంది.ఆ మొక్క పొరపాటున తగిలితే తేలు కుట్టినంత బాధగా ఉంటుంది.కొంచెం ఒర్చుకోగలిగితే,ఆ మొక్కతో మోకాళ్లమీద మెల్లమెల్లగా రాస్తే ఎంతటి కీళ్ళ నొప్పులైనా పదిరోజుల్లో మాయమైపోతాయని అంటారు. 

బాబాజీ గుహ ఇప్పుడు యోగానంద పరమహంస స్థాపించిన యోగోదా సత్సంగ్ సొసైటీ వారి ఆధీనంలో ఉంది. అది ధ్వంసం,శిధిలం కాకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ,ఆ సంస్థ వారు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. గుహకు చేరుకోవటానికి కొద్దిగా ముందుగా ఒక సమతల ప్రదేశంలో మహావతార్ బాబాజీ స్మారక మందిరం ఒకటి ఉంది.

అక్కడే బాబాజీ తన శిష్యుడైన లహరి మహాశయుల కోరిక మేరకు రాత్రికి రాత్రే స్వర్ణ మందిరాన్నినిర్మించారనీ,మరుసటి రోజే దాన్ని అంతర్ధానం చేశారనీ ఒక యోగి ఆత్మకథలో రాసి ఉన్నారు. ఆ స్మారక మందిరం తప్ప అక్కడ ఏ ఇతర నిర్మాణమూ లేదు.వాటికోసం ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు.

అలా ఇచ్చి ఉంటే యోగోదా సంస్థ వారు ఇప్పటికే అక్కడ ఆశ్రమం నిర్మించి ఉండేవారు. గుహ,స్మారకమందిరం నిర్వహణ బాధ్యతను అక్కడి గిరిజన గూడెం లోని ఒక కుటుంబానికి అప్పగించారు. బాబాజీ గుహకు ఇనుప గేటు ఉండి తాళం వేసి ఉంటుంది.

ఉదయం 11 గంటలకు తెరుస్తారు.మధ్యాహ్నం రెండు గంటలకు మరల తాళం వేసేస్తారు. సందర్శకులకు కేవలం ఆ మూడు గంటలు మాత్రమే అనుమతి ఉంటుంది.మేము ఒక పావుగంట ముందుగానే చేరుకున్నాం.మా గైడ్ అమిత్ చెప్పటంతో మా కోసం కొంచెం ముందుగానే తెరిచారు.

బాబాజీ గుహ లోకి అడుగు పెడుతూ ఉండగానే ఒక అనుభూతికి లోనయ్యాను. అది ఇదీ అని మాటల్లో చెప్పలేను. నేను గతంలో చూసిన గుహలతో పోల్చుకుంటే చాలా చిన్నది.ఒకే సారి ఏడెనిమిది మంది కన్నా ఎక్కువ పట్టరు. చాలా చిన్న గుహ పెద్ద పెద్ద కొండరాళ్ళ మధ్యలో ఉంటుంది.

పూర్తి  ప్రశాంతత.లోపల వాతావరణం సమశీతలంగా ఉంటుంది.రెండు చాపలు పరిచి ఉంటాయి.అక్కడ మూడు గంటలు ధ్యానం చేసుకోవచ్చు.కొద్దిసేపు పద్మాసనంలోనూ,మరికొద్దిసేపు వజ్రాసనంలోనూ ధ్యానంచేసే ప్రయత్నం చేశాను. ధ్యానంలో ఉండగా కర్ణాకర్ణిగా కొన్ని శబ్దాలు విన్పించాయి.

అవి అజ్ఞాత వ్యక్తుల గుసగుసలా?లేక రాళ్ళమధ్యలో వుండే క్రిమికీటకాలు సృష్టించిన శబ్దాలా? అనేది తేల్చుకోలేక పోయాను.  యాత్ర నుంచి తిరిగి వచ్చాక ఒక మిత్రుడు నన్ను అడిగారు,మీకెలా అన్పించింది?ధ్యానంలోకి వెళ్ళగలిగారా?ఏమైనా వైబ్రేషన్స్ వచ్చాయా?లాంటిప్రశ్నలు వేశారు.

నిజం చెప్పాలీ అంటే ,అక్కడున్న మూడు గంటల్లో గొప్పగా చెప్పుకోదగ్గ అనుభూతి నాకు కలగలేదు.అది అంత సులభమూ కాదు. రోజూ ఇంట్లో ధ్యానం చేసే అలవాటు ఉండటం వల్ల కొంత మేరకు ధ్యానంలో అచంచలంగా ఉండగలిగాను తప్ప మరే ప్రత్యేకమైన అనుభవం కలగలేదు.

నిజానికి అది ఒక్క పూటతో,ఒక్క సిట్టింగ్ తో సాధ్యం కాదు.దానికి నిరంతర సాధన అవసరం.రోజులు,నెలలు,సంవత్సరాలు సాధన చెయ్యాలి.అప్పుడే ఇన్నర్ జర్నీ సాధ్యమవుతుంది.అదే విషయం ఆ మిత్రుడికి చెప్పాను.దానికి ఆయన అంగీకరించారు.

ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో నా సాధన కొనసాగటానికి అవసరమైన శక్తి,స్పూర్తి,సంకల్పం నాకు అక్కడ లభించాయి. ఆ గుహ నాలాంటి ఎందరికో పాజిటివ్ వైబ్రేషన్స్ ను కానుకగా ఇచ్చి పంపిస్తుంది.

మున్ముందు మరింత అంకితభావంతో,దీక్షతో సాధన చేయగలిగే శక్తి మనకు తోడుగా వస్తుంది.ఆ తర్వాత 40 రోజులపాటు నేను చేసిన యాత్రలో ఏ ఆటంకాలూ,ఇబ్బందులూ,అనారోగ్యమూ లేకుండా ఆ శక్తి, వైబ్రేషన్స్,  రక్షణ కవచంగా నిలిచాయని నమ్ముతున్నాను.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!