ఆ కారణంగానే ఆయన పార్టీపెట్టలేదా ? Tamil politics-9

Sharing is Caring...

What is the real reason for Rajni’s backsliding?………………….

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతా.. పెడతా అంటూ చివరికి తుస్సుమనిపించారు. దీంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. 2020 డిసెంబర్ 31 న పార్టీ పేరు వివరాలు ప్రకటిస్తామన్న రజనీ సరిగ్గా వారం ముందు హైబీపీ కారణం గా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు.

తర్వాత రజనీ ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి చెన్నై వెళ్లారు. ఆవెంటనే అనూహ్యంగా పార్టీ ప్రకటన వాయిదా పడింది. కుటుంబసభ్యులు ఆయనను విశ్రాంతి తీసుకోమని … పార్టీ పెట్టే విషయం విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు ప్రచారం లో కొచ్చాయి. నిజంగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు. పార్టీ ప్రకటన వాయిదా పడటమే వాస్తవం.  

రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ముందు ఆసుపత్రిలో చేరడం పొలిటికల్ స్టంట్ అనే విమర్శలు కూడా వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ 31 న రజనీ పార్టీ పేరు, ఆశయాలు, పార్టీ పతాకం, గుర్తు తదితర వివరాలను ప్రకటిస్తామన్నారు. జనవరి 14 సంక్రాంతి రోజున పార్టీని ప్రారంభిస్తే ఆ సెంటిమెంట్‌ బాగా వర్క్‌ఔట్‌ అవుతుందనే  ప్రచారం కూడా జరిగింది.  

స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు అప్పట్లో చెప్పారు.పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల  నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని  ప్రచారం జరిగింది.

కాగా ఒక సందర్భంలో రజనీ ముఖ్యమంత్రి పదవి కి తాను పోటీ పడనని, పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని  ప్రకటించారు. ఈ మాటతోనే అభిమానులు సగం డీలా పడ్డారు. వేరే ఎవరినో సీఎం పీఠం పై కూర్చోపెడతా అంటే అభిమానులు హుషారుగా పార్టీ కోసం పని చేస్తారా అని సందేహాలు వ్యక్తమైనాయి. అప్పట్లో రజనీ చేసిన ప్రకటనను బట్టి ఆయనకు అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదని … అందుకే తటపటాయిస్తున్నారనే విశ్లేషణలు వినిపించాయి. 

అదేసమయంలో తమ పార్టీ కుల మతాలకు అతీతమైనదని, “ఆధ్యాత్మిక” రాజకీయాల” తో ముందుకు సాగుతుందని రజనీ ప్రకటించారు. కులమతాలకు అతీతం అంటే అందరిని కలుపుకు పోతారని భావించవచ్చు. మరి ఆధ్యాత్మిక రాజకీయాలకు అర్ధం ఏమిటో … అవి ఎలా సాగుతాయో రజనీ  అప్పట్లో వివరణ ఇవ్వలేదు. 

ఒక దశలో రజనీ  బీజేపీ కి అనుకూలంగా కనిపించారు. ఆయన బీజేపీ విధానాలను సమర్ధించిన సందర్భాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌కున్న ప్రత్యేక హోదాను ఎత్తివేసిన  సందర్భంలో రజనీకాంత్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా  లను కృష్ణార్జునులతో పోల్చారు. ఆ తర్వాత  పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు కూడా ఇచ్చారు.

రజనీకాంత్ అభిప్రాయాలు బిజెపి అభిప్రాయాలను పోలి ఉన్నాయి కాబట్టి  మద్దతు ఇవ్వమని కోరుతున్నామని బీజేపీ నేతలు అప్పట్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. తమిళనాడులో కాలు మోపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ రజనీ సినీ  గ్లామర్ ను ఉపయోగించుకోవాలని భావించినట్టు అప్పట్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.  బీజేపీ, ఆర్ ఎస్ ఎస్  నేతలు రజనీ తో చర్చలు కూడా జరిపారు. అయితే రజనీ ఎటు తేల్చి చెప్పలేదు.

అప్పట్లోనే  అన్నా డీఎంకే తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. రజనీ కూడా ఆ ఫ్రంట్ లో చేరవచ్చు అనే ఊహాగానాలు సాగాయి. కాగా అన్నాడీఎంకే అంటే రజనీ కాంత్ కు పడదు. 1995 ‘బాషా’ సినిమా విజయోత్సవ సభలో అప్పటి  ముఖ్యమంత్రి జయలలిత  సమక్షంలోనే రాష్ట్రంలో బాంబుల సంస్కృతి ఎక్కువైందని రజనీకాంత్‌ ఘాటైన విమర్శలు చేశారు.

ఆ దరిమిలా రజనీ  అభిమానులపై కొన్ని చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రజనీ కాంత్ కారు కూడా ధ్వంసమైంది. కొన్నిచోట్ల ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 96 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ కి వ్యతిరేకంగా  డీఎంకే, టీఎంసీ కూటమికి రజనీ కాంత్  బహిరంగంగా మద్దతు  ప్రకటించారు.

మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే తమిళనాడును  దేవుడు కూడా కాపాడలేడంటూ రజనీ వ్యాఖ్యలు చేశారు. కొన్నిచోట్ల ప్రచారం చేశారు. నాటి నుంచి రజనీ పై అభిమానుల ఒత్తిడి పెరిగింది. అయితే అప్పట్లోనే ఆయన పార్టీ పెడితే బాగుండేది. కానీ ఎందుకో రజనీ వెనుకడుగు వేశారు. 2020 లో పార్టీ పెడతా అని ప్రకటించి కూడా 70 ఏళ్ళ వయసులో ఇంత రిస్క్ ఎందుకులే  అని సైలెంట్ అయిపోయారని అంటారు. బీజేపీ నుంచి ఒత్తిడి ఎక్కువై పార్టీ ఆలోచనకు స్వస్తి పలికారని కూడా విశ్లేషణలు వినిపించాయి.

———-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!