Town in the Himalayan ranges ………………………………..
విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ నంద ప్రయాగ పట్టణం ఉన్నది.పంచ ప్రయాగలలో రెండవది ఈ నందప్రయాగ.బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు ఇక్కడ ఆగుతారు. మంచుకొండల నడుమ సుందర ప్రదేశాల పట్టణంగా ‘నంద ప్రయాగ’కు పేరుంది.
న౦దాదేవి అభయారణ్యానికి పైన ఉన్న న౦దఘ౦టి అనే మంచుకొండ లో పుట్టిన ‘నందాకిని’ నది ‘అలకనంద’ నదితో కలిసే ప్రదేశం ఇది.ఇక్కడ ‘నందాకిని’ తన ఉనికిని పోగొట్టుకుని ‘అలకనంద’గా దిగువకు ప్రవహిస్తుంది. ఈ నదులు వేరువేరు రంగుల్లో వచ్చి కలిసి కిందకి పారడం ఒక అద్భుతం.
పురాణం కథనం మేరకు… పూర్వం ఇక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం వుండేదట. ఇక్కడే శకుంతల దుష్యంతుల వివాహం జరిగిందని కూడా చెబుతారు. ఇక్కడ పూజలు చేయడానికి … తర్పణాలు వదలడానికి సదుపాయాలూ ఉన్నాయి.
పూర్వం ఈ ప్రాంతం యదువంశ రాజ్య ముఖ్య పట్టణంగా ఉండేదట. ఇక్కడ నందుడు విష్ణుమూర్తి గురించి యాగం చేసి … ఆయనను పుత్రునిగా పొందే వరం సంపాదించాడట. నందుడు యాగం నిర్వహించిన ప్రదేశంలో చిన్న కోవెల నిర్మించి అందులో బాల క్రిష్ణునికి పూజలు నిర్వహిస్తున్నారు.
రిషికేశ్ బదరీనాధ్ రోడ్డు పైనే వుంటుంది ఈ ఆలయం. నందమందిరం అని స్థానికులు పిలుస్తారు.ఇక్కడి చండికా దేవి ఆలయం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. నందప్రయాగ్‌తో సహా సమీపంలోని ఏడు గ్రామాలకు గ్రామ దేవత. గర్భగుడిలో ఉన్న అమ్మవారి వెండి విగ్రహం ఆకట్టుకునేలా ఉంటుంది.ఈ సముదాయంలో శివాలయం, భైరవాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, గణేష్ మందిర్ , భూమియాల్ ఆలయం ఉన్నాయి.
నంద ప్రయాగ హిమాలయ శ్రేణులలో ఉన్న పట్టణం. శీతల వాతావరణానికి ప్రసిద్ది గాంచింది. వేసవి బారి నుంచి తప్పించుకునేందుకు ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మంచు శిఖరాలను దగ్గరగా తిలకించే అవకాశం కలుగుతుంది.
నంద ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానమైనది.కాశ్మీరీ గేట్ నుండి రిషికేశ్ , శ్రీనగర్ లకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హరిద్వార్ చేరుకుంటే అక్కడనుంచి బస్సులు లభిస్తాయి.
ఈ నందప్రయాగ లో ట్రెక్కింగ్ చేయవచ్చు.ఇది ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ సాహిబ్ వంటి గమ్యస్థానాలకు ప్రవేశ ద్వారం.నందప్రయాగ్ సందర్శించడానికి వేసవిలో ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉత్తమ సమయం.
అలాగే శరదృతువులో సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు బాగుంటుంది.అపుడు వాతావరణం సాధారణంగా ఉంటుంది.ఇక్కడ హోటల్స్ ఉన్నాయి.వసతికి,భోజనానికి ఇబ్బంది లేదు.