ఫ్రంట్ ప్రతిపాదన అటక ఎక్కినట్టేనా ?

Sharing is Caring...

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఎన్డీయే ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రతిపాదనలు తాత్కాలికం గా అటక ఎక్కినట్టే అనుకోవచ్చు. బీజేపీ పని అయిపోతుందని విపక్ష నేతలు వేసిన అంచనాలన్నీ ఫలించలేదు. అటు మమతా బెనర్జీ ఇటు కేసీఆర్ గత కొన్నాళ్లుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లపై  దృష్టి సారించారు.

యూపీ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించారు. అయితే కొన్ని సీట్లు తగ్గినా బీజేపీ అక్కడ అధికార పగ్గాలు చేపట్టింది. పంజాబ్ మినహా మణిపూర్ ,ఉత్తరాఖండ్,గోవా లలో కూడా బీజేపీ సత్తా చాటుకుంది. అంతకు ముందు మమతా బెనర్జీ కానీ ఇటీవల కేసీఆర్ కానీ బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని కూడా సీఎం కేసీఆర్‌ పిలుపు నిచ్చారు.దేశాన్ని బాగుచేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లు కూడా ప్రకటించారు ఇందులో భాగంగా కేసీఆర్‌.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌లను కలసి చర్చలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్‌తోనూ మాట్లాడే యత్నాల్లో ఉన్నారు.

వీరందరి మద్దతుతో కొత్త ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ లోగానే అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగడం .. ఫలితాలు రావడం జరిగిపోయింది. పంజాబ్‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడటం అటు మమతా ఇటు కేసీఆర్ ఊహించని పరిణామమని  విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో  ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేకులు పడినట్లు భావించాల్సి ఉంటుందని అంటున్నారు.

మోదీని ఢీకొనేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలన్న మమతా బెనర్జీ, కేసీఆర్‌ తదితర నేతల ప్రతిపాదన.. తాజా ఫలితాలతో నీరుగారిపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌యాదవ్‌ సారధ్యం లోని సమాజ్‌వాది పార్టీ గతంతో పోలిస్తే బలం పుంజుకోవడం.. పంజాబ్‌లో ఆమ్‌ అద్మీ పార్టీ అధికారంలోకి రావడం.. ప్రాంతీయ పార్టీలకు కొంత ఊరటనిచ్చే అంశమే.

జాతీయ స్థాయిలో మోదీని ఢీకొనే ధైర్యం ఇక ప్రాంతీయ పార్టీలు చేయక పోవచ్చనే వ్యాఖ్యలు వినబడుతున్నప్పటికీ .. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కొన్నాళ్ల తర్వాత మమతా ,కేసీఆర్ లు మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చని అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. ముఖ్యంగా మమతా బెనర్జీకి ఈ ఫలితాలు పూర్తిగా నిరాశ కలిగించేవే.

దీదీ సొంత పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌.. గోవా, మణిపూర్‌లలో పోటీ చేసినప్పటికీ  ఒక్క సీటు కూడా సాధించలేక పోయింది. ఇక కాంగ్రెస్ పనితీరు మరీ అధ్వాన్నంగా మారడం తో ఆపార్టీ నేతలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. యూపీ లో ప్రియాంక గాంధీ ప్రచారం చేసినప్పటికీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు షాక్ తిన్నాయి. ఈ క్రమంలో యూపీఏ లోని పార్టీలు నీరుగారి పోవడం ఖాయం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!