రాజకీయాల్లో దివంగత నేత జయలలిత తీరే వేరు. ఆమె ను వేరొకరితో పోల్చలేము. తనదైన స్టైల్ తో ఆమె పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకమైన ద్రవిడ పార్టీ అన్నాడిఎంకె పై ఒక బ్రాహ్మణ మహిళగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. ద్రవిడ సిద్ధాంతాలను కాదని ఎదురులేని నాయకురాలిగా ఎదిగారు. చివరివరకు పార్టీపై తన పట్టు నిలుపు కున్నారు.
పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా తనదైన శైలిలో పాలన సాగించారు. ఎంజీఆర్ జయలలితను తన వారసురాలిగా ప్రకటించలేదు. అయినప్పటికీ జయ తన సత్తా చాటుకుని వారసురాలిగా మారి పార్టీపై పట్టు బిగించారు. ఎంజీఆర్ మరణానంతరం ఆయన సతీమణి జానకి సీఎం అయినప్పటికీ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్షనేత గా ఎన్నికయ్యారు. జానకి నేతృత్వంలోని పార్టీ దారుణంగా పరాజయం పాలైంది.
అక్కడితో ఆమె సైలెంట్ అయిపోయారు. జయ పార్టీ ని గుప్పెట్లోకి లాక్కున్నారు. 1991లో రాజీవ్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుని జయ సీఎం పీఠాన్ని అధిష్టించారు. ప్రజలచే ఎన్నుకోబడిన తొలి మహిళా సీఎం అయ్యారు.అప్పటి నుంచే పార్టీలో ఆమె ఆధిపత్యం మొదలైంది. ఆపై మెల్ల మెల్లగా ద్రవిడ సిద్ధాంతాలకు నీళ్లొదిలారు.
ఈ క్రమంలో వచ్చిన విమర్శలను కూడా జయ పట్టించుకోలేదు. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నజయ జనాకర్షణ పథకాలతో దూసుకెళ్లారు. నాస్తికవాదమే పునాదిగా పుట్టిన ద్రవిడ సిద్ధాంతాన్ని పక్కన బెట్టారు. ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు . జీర్ణోద్ధరణ పధకాలను ప్రారంభించారు. జయ వైఖరి ఆస్తిక వర్గాలను ఆకర్షించింది.
స్వయం గా తానే ఆలయాల జీర్ణోద్ధరణ పధకానికి విరాళం ప్రకటించారు. పెద్ద ఎత్తున విరాళాలు సమీకరించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ఒక్కపూటైనా పూజలు జరగాలని ప్రత్యేక నిధులు ప్రకటించారు. అలా నాస్తికత్వం నుంచి అన్నాడీఎంకే ను ఆస్తికత్వం వైపు నడిపించారు. అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు.దీనావస్థలో ఉన్న ఆలయాలకు నిధులు కేటాయించారు. అర్చకులకు పెన్షన్ పెంచారు.
ఆనాటి రాజకీయాలను బట్టి జయ తన విధానాలను మార్చుకున్నారు. జయకు ముందు ఏ సీఎం కూడా ఆలయాలపట్ల ఇంత శ్రద్ధ చూపలేదు. చూపకపోవడానికి కారణం ద్రవిడ సిద్ధాంతమే. ద్రావిడ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ జయ ఆ పార్టీ సిద్ధాంతాలను అసలు పట్టించుకోలేదు. జయ బ్రాహ్మణ పక్షపాతి అని విమర్శలు వచ్చినప్పటికీ పట్టించు కోలేదు.ప్రజలను ఆకర్షించే పధకాలు, కార్యక్రమాలతో పాలన సాగించారు.
తమాషా ఏమిటంటే నాటి జయ విధానాలనే ప్రస్తుతం స్టాలిన్ అనుసరిస్తున్నారు. ఆలయాలకు ప్రత్యకంగా నిధులు కేటాయిస్తామని చెబుతున్నారు. హిందువులకు తాము వ్యతిరేకం కాదని ప్రకటిస్తున్నారు. నాడు జయ విధానాలను విపక్షాలు విమర్శించినా .. అన్నాడీఎంకే నేతలంతా మద్దతు పలికారు.
బలమైన బ్రాహ్మణేతర సామాజిక వర్గాలు కూడా జయను కాదనలేకపోయారు. డీఎంకే విమర్శలు చేసినప్పటికీ జనం పట్టించుకోలేదు.ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జయ తన చరిష్మాను కోల్పోలేదు. పార్టీ నేతలంతా వంగి వంగి నమస్కారాలు పెట్టేవారు. అంతటి బలమైన నాయకురాలిగా ఎదిగారు.
మీడియా తో మొదట్లో బాగున్నప్పటికీ .. తర్వాత రోజుల్లో గొడవలు అయినాయి. దాదాపు ఐదేళ్లు మీడియాకు దూరంగా ఉన్నారు. ప్రెస్ మీట్లు కూడా పెద్దగా పెట్టలేదు. మీడియా పై కేసులు కూడా వేశారు. తన పొలిటికల్ కెరీర్ లో ఆమె కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేశారు.
——————K.N.MURTHY