who thwarted that mafia…………………………………చిన్నమ్మ బ్యాచ్ కి ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టింది ఇప్పటి తమిళనాడు సీఎం ..ఒకప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్. మన్నార్ ప్రాంతం నుంచి శశికళ చెన్నైవచ్చి జయ వద్ద చేరి చక్రం తిప్పింది, ఆమె బంధుగణం రాష్ట్రం నలుమూలల ఉన్నారు. అందుకే స్టాలిన్ వారిని మన్నార్ గుడి మాఫియా అన్నారు .
ఈ విషయాన్ని చిన్నమ్మ సోదరుడే ఒక సందర్భంలో మీడియాకు చెప్పారు. మమ్మల్ని అలా పిలిచినా అభ్యంతరం లేదు.. మేమున్నది డీఎంకే మాఫియాను ఎదుర్కోవడానికే అని దివాకరన్ ఎదురుదాడి చేశారు. స్టాలిన్ ఆ మాటలను లైట్ గా తీసుకున్నారు. అప్పటినుంచి మన్నార్ గుడి మాఫియా అన్న మాట మోత మోగిపోయింది.
ఆ విషయం అలా ఉంచితే చిన్నమ్మను ఇంటి నుంచి గెంటి వేసే కొన్ని రోజుల ముందు బెంగళూరులో శశికళ కుటుంబ సభ్యులంతా బెంగళూరులో ఒక రహస్య సమావేశం పెట్టుకున్నారు. దాని గురించి కర్ణాటక డీజీపీ శంకర్ బిదారి కి తెలిసింది. ఆ సమావేశం వివరాలను కూపీ లాగారు. కొన్ని సంభాషణలను రికార్డు చేశారు.
ఆ టేపులను తమిళనాడు డీజీపీ రామానుజంకు పంపారు. ఆయన వాటిని జయకు భధ్రం గా చేర్చారు. అవి విన్న జయ నిర్ఘాంత పోయింది. పరిస్థితి చేజారిపోతున్నదని అర్థమైంది.శశికళ పైనా, ఆమె కుటుంబసభ్యుల పైనా నిఘా పెట్టించింది. వారి ఫోన్ లన్నిటినీ ట్యాప్ చేశారు.
ఆ తర్వాత ఎవరైతే శశికళకు సన్నిహితంగా ఉన్నారో … ఆ అధికారులను బదిలీ చేశారు. ఇకపై అన్ని నిర్ణయాలు తనను అడిగే తీసుకోవాలని… మంత్రులకు … ఉన్నతాధికారులకు జయ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతనే చిన్నమ్మను .. బంధువులను పంపించేశారు.
శశికళను కూడా పార్టీ నుండి బహిష్కరించారు. అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించి నందుకు ఆమె కుటుంబ సభ్యులలో కొందరిని జైలు కు పంపారు.
ఒకరోజు మంత్రి కె.వి. రామలింగం జయ ను కలవటానికి వచ్చారు. జయలలిత ఆయనను చూసి చిరునవ్వు నవ్వి.. భవిష్యత్తు ముఖ్యమంత్రి గారికి స్వాగతం’ అని వ్యంగ్యంగా ఆహ్వానించారట. దాంతో రామలింగానికి ముచ్చెమటలు పట్టాయి.
ఈ రామ లింగం కూడా శశికళ మనిషి.ఆయన మంత్ర,తంత్రాలను నమ్ముతారని అంటారు. రామలింగం కేరళలో ఉన్న ఒక తాంత్రికుడి ద్వారా పూజలు చేయిస్తున్నాడని నిఘా వర్గాలు జయకు సమాచారాన్ని చేరవేశాయి.
జయలలితను తొలగించి శశికళను ముఖ్యమంత్రి చేయాలని పూజలు చేయించానని ఆయన పైకి చెబుతున్నా.. రామలింగం శశికళను కూడా మోసం చేశారట. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకే పూజలు చేయించారని ప్రచారం జరిగింది. ఈ విషయం తెలియడంతో జయ ఆయనను “భవిష్యత్తు ముఖ్యమంత్రి గారు” అని వ్యంగ్యంగా సంబోధించారని అంటారు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ (2012 లో) శశికళ వచ్చి జయ కాళ్లపై పడి తప్పై పోయింది .. క్షమించమని కోరింది అంటారు. తన కుటుంబ సభ్యులు పన్నిన కుట్ర గురించి తనకు తెలియదని చెప్పి ప్రాధేయ పడిందని అంటారు.
జయ ఆమె మాటలను ఎందుకు నమ్మింది ? ఎందుకు క్షమించి మళ్ళీ దగ్గరకు చేర్చుకుంది అనేది ఇప్పటికి మిస్టరీయే. చిన్నమ్మ నిజంగా క్షమించమని అడిగిందా ? లేక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిందా ? మరేదైనా చేసిందా ? ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ఆ తర్వాత కథ అందరికి తెలిసిందే.
జయ మరణం తరువాత … సీఎం కాబోయే సమయంలోనే చిన్నమ్మ జైలు కెళ్ళడం కూడా అనూహ్య పరిణామం. తెరవెనుక నుంచి ఎవరో పావులు కదిపారని అనే సందేహాలు లేకపోలేదు. ఆమె జైలు కు వెళ్ళగానే పన్నీర్ సెల్వం కానీ పళనీ స్వామి ఆమె వర్గం వారే అయినప్పటికీ ఆమెను శాశ్వతంగా దూరంగా పెట్టారు. ఈ మొత్తం కథలో తెర వెనుక ఎవరి పాత్ర ఉన్నప్పటికీ మన్నార్ గుడి మాఫియా విస్తరించకుండా బ్రేకులు వేశారు.
ఆమె జైలులో ఉన్న సమయంలో ఆస్తులపై దాడులు చేయించి ఆర్ధిక మూలాలు దెబ్బ తీశారు. 2016 నాటికి శశికళ వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.15000 కోట్ల కు పైనే ఉంటుందని అంటారు. చిన్నమ్మ పెట్టుబడులు తమిళనాడు, కర్ణాటక, కేరళలతో పాటు.. దుబాయ్, సింగపూర్‌లకు కూడా విస్తరించాయని చెబుతారు. ఇపుడు అధికారం స్టాలిన్ చేతిలో ఉంది. అతడు కూడా మన్నార్ గుడి మాఫియాకు వ్యతిరేకి. ఆయన కూడా ఆ మాఫియాను మళ్ళీ ఎదగకుండా నిలువరించవచ్చు.
————-KNMURTHY