ఆయన అలిగి హాంకాంగ్ వెళ్ళారా ?

Sharing is Caring...

News Leaks…………………………..

రాజకీయాల్లో, వార్తల ప్రచురణలోనూ అపుడపుడు కొన్ని తమాషాలు జరుగుతుంటాయి. రాజకీయ నాయకులు కొన్ని వార్తలను కావాలనే తమ సన్నిహితుల ద్వారా లీక్ చేయిస్తుంటారు. విషయ ప్రాధాన్యతను బట్టి ఆ వార్తలు సంచలనంగా మారుతుంటాయి. వాటిపై ఇతర పార్టీలు కూడా స్పందిస్తుంటాయి. ఒక్కోసారి లీక్ ఇప్పించినవారే అదేమీ లేదు అని కూడా ఖండిస్తుంటారు.

సహజంగా ఇలాంటి వార్తలు “వారు చెప్పారు .. వీరు తెలిపారు” అని కాకుండా తెలుస్తోంది లేదా తెలిసింది అంటూ రిపోర్టర్  సొంతంగా కనుగొని రాసినట్టుగా ఉంటాయి. కానీ వాస్తవానికి 90 శాతం వార్తలు ఎవరో ఒకరు చెప్పినవే ఉంటాయి. బయటికి ఆ విషయం చెప్పరు.  రిపోర్టర్లు కూడా పొలిటికల్ పార్టీ కార్యాలయాల్లో కీలక వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఏదైనా  మంచి సమాచారం ఉన్నపుడు కీలక వ్యక్తులు రిపోర్టర్లకు ఆ సమాచారం చెబుతుంటారు. ఇదంతా నమ్మకం మీద జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అంతే. ఇక అసలు విషయం లోకి వెళితే …..  

1983 జనవరి లో ఎన్టీఆర్  అధికారంలోకి వచ్చారు. కొద్దీ రోజుల తర్వాత  చంద్రబాబు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన కొత్తల్లో బాబు పార్టీ నాయకులతో కలవడానికి కొంత ఇబ్బంది పడేవారు. అప్పట్లో పార్టీ కార్యకలాపాలు అబిడ్స్ ఎన్టీఆర్ ఇంటి నుంచే ఎక్కువగా జరిగేవి. బాబు  ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే టెలిఫోన్ ఆపరేటర్ రూమ్ లో కూర్చునే వారు. ఎన్టీఆర్ పిలిస్తే పైకి వెళ్లే వారు.

పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ వెన్నంటే ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు మటుకు స్వేచ్ఛగా తిరుగుతుండేవారు. ఎన్టీఆర్ ఆయనతోనే ఎక్కువ గా మాట్లాడుతుండేవారు. ఈ క్రమంలోనే దగ్గుబాటి ని తెలుగు యువత అధ్యక్షునిగా ఎన్టీఆర్ నియమించారు. రోజూ కార్యాలయానికి వచ్చే చంద్రబాబు ఆ తర్వాత రెండురోజులు పార్టీ ఆఫీసుకి రాలేదు. ఆ రోజు xyz అనే రిపోర్టర్ పార్టీ కార్యాలయానికి  వెళ్లారు.

పార్టీ లో ఆయనకు కొంతమంది కీలక వ్యక్తులతో మంచి పరిచయాలున్నాయి. ఒక వ్యక్తి మంచి హాట్ న్యూస్ చెప్పారు. వెంటనే ఆఫీసుకి వెళ్లి వార్త రాసి ఎడిటర్ ని కలసి చెప్పారు. మర్నాడు పత్రికలో ” అలిగి హాంకాంగ్ వెళ్లిన చంద్రబాబు ” అన్న శీర్షికతో వార్త వచ్చింది. తెలుగు దేశం వర్గాల్లో  హాట్ టాపిక్ అయింది. జనాలు కూడా మామపై బాబు అలిగాడట కదా అని చెప్పుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. బాబుకి తిక్క కుదిరింది అనుకున్నారట అక్కడి నేతలు.  వార్త వచ్చిన రెండు రోజు xyz రిపోర్టర్ టీడీపీ కార్యాలయానికి వెళ్ళాడు. బాబు .. హాంకాంగ్ వెళ్లారని  సమాచారం ఇచ్చిన వ్యక్తి వచ్చి ‘అన్నా పొరపాటు అయింది’ అన్నాడు. “ఏంటి ” అన్నాడు మన రిపోర్టర్.  “బాబు గారు హాంకాంగ్ వెళ్ళలేదు .. ఇక్కడే ఉన్నారట” అన్నాడు అతగాడు. ఆ మాట విని మనోడు కూడా కంగారు పడ్డాడు.

“సర్లే ..తప్పు అనుకుంటే ఖండిస్తారుగా చూద్దాం” అని మన రిపోర్టర్  ఆఫీస్ కొచ్చి ఎడిటర్ కి ఆ విషయం చెప్పాడు. “చూడబోతే … ఈ వార్త కావాలనే ఆయనే లీక్ ఇప్పించి నట్టు నా డౌట్. తాను అలిగిన విషయం మామ గారికి తెలియజేయడం ఇక్కడ ఇంపార్టెన్స్.”  అని ఎడిటర్ గారు విశ్లేషించారు. 

ఇక వాస్తవాని కొస్తే బాబు అపుడు హాంకాంగ్ నిజంగా వెళ్ళలేదు. అలా అని పత్రికలో వచ్చిన వార్తను ఈ రోజు వరకు  ఖండించలేదు. లీక్ ఆయనే ఇప్పించాడా .. అది తెలీదు ..ఒక్కోసారి ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయి.  ఆ పత్రిక ఈనాడు కాదు. ఆ రిపోర్టర్ ను నేను కాదు. 

——-K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!