ఎవరీ గౌరీ సావంత్ ??

Sharing is Caring...

A difficult journey………………………………

సమాజం లో గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు.ట్రాన్స్ జెండర్ అయిన గౌరీ సావంత్ సెక్స్ వర్కర్లకు అండగా నిలవాలన్న ఆశయం తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారిన క్రమంలో వారికి భద్రతనిచ్చే ఆశ్రమాన్ని నెలకొల్పింది గౌరీ.

‘అజిచ ఘర్’ పేరుతో నిర్మించిన ఈ ఆశ్రమం యాభై మందికి పైగా సెక్స్ వర్కర్ల పిల్లలకు ఆశ్రయమిస్తోంది. గౌరీ భద్రంగా వారి ఆలనా పాలనా చూసుకుంటోంది. ఇక ట్రాన్స్ జెండర్ల యోగక్షేమాల కోసం ‘సఖీ చార్ చౌగీ’ అనే స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించి ఎంతోమందికి అండగా నిలబడింది గౌరీ సావంత్. ముంబయిలో మొదటి ట్రాన్స్ జెండర్ గౌరీయే అంటారు. 

ఈ కార్యక్రమాలకు మిలాప్ ఫండ్ రైజింగ్ వెబ్ సైట్, కౌన్ బనేగా కరోడ్ పతి టీవీషో మొదలైన వాటి ద్వారా డబ్బులు సమకూరాయి. గౌరీ గతంలోకి వెళితే… నాగ్పూర్ లో పుట్టి గణేశ్ పేరుతో పెరిగింది. తన నడక, మాట తీరువల్ల లెక్కలేనన్ని అవమానాలు ఎదుర్కొంది. మరోవైపు తల్లి చనిపోయింది. తండ్రి పోలీస్ అధికారి. తన వల్ల తండ్రి అవమానాలు పడకూడదని 17 ఏళ్ళ వయసులో ఇల్లు విడిచి ముంబాయి చేరుకుంది.

ఎన్నోఅవమానాలు ఎదుర్కొంది. మరెన్నో కష్టాలు పడింది. అయితే వాటి వల్ల తాను మానసికంగా బలపడిందే తప్ప ఏరోజూ వెనకడుగు వేయలేదు. అప్పట్లో  హమ్సఫర్ ట్రస్ట్ గౌరి కి అండగా నిలిచింది. తర్వాత తన పేరును గౌరీగా మార్చుకుంది. 2001లో STDల గురించి అవగాహన కల్పించడానికి సెక్స్ వర్కర్లతో కలిసి పని చేస్తూ గౌరీ తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసింది.

2014లో గౌరీ పేరు జాతీయ మీడియాను ఆకట్టుకుంది. ట్రాన్స్ జెండర్ల పిల్లలను దత్తత తీసుకునే హక్కు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఆమె గాయత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. గాయత్రి తల్లి చనిపోయింది.ఆ తర్వాత సెక్స్ వర్కర్ల పిల్లల సంక్షేమం పై దృష్టి పెట్టింది.

2019లో భారత ఎన్నికల సంఘం  అంబాసిడర్‌గా నియమితులైన మొదటి ట్రాన్స్ పర్సన్ గౌరీయే.  
ఈ గౌరీ జీవిత కథ ఆధారంగా  ‘తాలి’ పేరుతో బయోపిక్ నిర్మిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ బారిన పడుతున్న వారికి గౌరి బయోపిక్  ధైర్యాన్నిస్తుంది. పోరాటస్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితాసేన్ గౌరీ పాత్ర చేస్తోంది. ఈ బయో పిక్ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ లో  దాదాపు 300 మంది ట్రాన్స్జెండర్లు కూడా నటిస్తున్నారు.   జాతీయ అవార్డు-విజేత చిత్ర నిర్మాత రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ను అర్జున్ సింగ్ బరన్, కార్త్క్ డి నిషాందర్, అఫీఫా నడియాద్వాలా నిర్మిస్తున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!