పీకే చేరికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు !

Sharing is Caring...

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ను పార్టీలో చేర్చుకునే విషయంలో  కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది.

పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన  ప్రతిపాదనలను అంగీకరించాలా వద్దా..? అన్నదానిపై సీనియర్లతో సోనియా  చర్చించినట్లు సమాచారం. కాగా..ఇప్పటి వరకు  పీకేను పార్టీలోకి తీసుకునే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.

దీంతో  పీకే చేరికపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస ఓటములతో సతమతమవుతోన్న కాంగ్రెస్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు పీకే ముందు కొచ్చారు.ఈ క్రమంలోనే ఇటీవల పలుమార్లు పార్టీ అధిష్ఠానంతో ప్రశాంత్‌ కిశోర్‌ సమావేశమైనారు.

2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది చివరిలో జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. వీటిపై అధ్యయనం చేసేందుకు సోనియా గాంధీ కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో ఓ కమిటీ ని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ తమ నివేదికను సోనియాకు అందజేసింది. దీనిపై చర్చించేందుకు సోనియా నివాసంలో పార్టీ సీనియర్‌ నేతలు చర్చించారు.పీకేను కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్చుకుంటే.. ఆయన మరే పార్టీకి పనిచేయకూడదనే  షరతు విధించినట్లు సమాచారం.

కాగా తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్‌ సంస్థ కేసీఆర్ కోసం పనిచేస్తుందని పీకే అన్నట్టు వార్తలు వచ్చాయి. అంటే ఆయన నేరుగా కేసీఆర్ తో పనిచేయకపోయినా ఆయన సంస్థ ప్రతినిధులు మాత్రం కేసీఆర్ కోసం పనిచేస్తారన్నమాట. అదే జరిగితే.. తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని కాంగ్రెస్  పార్టీ నేతలు అంటున్నారు.

అందుకే..పీకే మరే ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయకుండా షరతు విధించాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ తో  తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని రేవంత్ రెడ్డి అంటున్నారు.

పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత  తనతో హైదరాబాద్ లోనే ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెబుతున్నారు. పీకే రాకపై రేవంత్ ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ ను ఓడించండి అని  చెప్పడం వింటారని కూడా రేవంత్ అంటున్నారు. కాగా పీకే త్వరలో ఏపీ సీఎం జగన్ ను కల్సి మాట్లాడవచ్చు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!