‘ఈనాడు’ పేరు వెనుక కథ !

Sharing is Caring...

మంగు రాజగోపాల్ …………………………………

ఈనాడు దినపత్రికకు ఆ పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. మొదట్లో విశాఖలో ప్రాంతీయ దినపత్రికగా మొదలైన ఈనాడు ఇవాళ లార్జెస్ట్ సర్కులేటెడ్ డైలీగా ఎదిగింది. విజయవంతంగా ౫౦ సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక అసలు విషయం లోకి వెళితే …

1974 లో విశాఖలో ‘ఈనాడు’ ప్రారంభించడానికి చాలా కాలానికి ముందే రామోజీరావు గారికి పత్రికారంగం మీద ఆసక్తి ఉండేదని, ‘వినోదిని’ అనే పేరుతో  ఒక మేగజైన్ పెడదామనుకున్నారనీ ఆయన మిత్రుడు, ‘సితార’ ప్రథమ సంపాదకుడు అయిన మా మేనమామ పన్యాల రంగనాథరావు నాతో చెప్పారు. అది ఎందుకు ఆగిందో తెలియదు.

విశాఖలో ‘ఈనాడు’ ప్రారంభించడానికి ముందు  మా ఉత్తరాంధ్ర జిల్లాల్లో  చాలా సాదా సీదా పబ్లిసిటీ ఇచ్చారు. అప్పట్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు లేవు. ‘సపట్ లోషన్’ ‘జాలిమ్ లోషన్’ ప్రకటనల మాదిరిగా గోడల మీద ముందు తెల్లటి సున్నం పూసేసి, అది ఆరిన తర్వాత దాని  మీద నీలం అక్షరాలతో ‘ఈనాడు’ అని పెద్ద అక్షరాలతో రాయించారు. దాని మీద మీ ప్రాంతీయ దిన పత్రిక అని ఉండేది.

కింద చిన్న అక్షరాలతో “ఈ పత్రిక మీది, మీ కోసం మీ వాళ్లే నడిపేది” అని టాగ్ లైన్ ఉండేది. ( దీని అంతరార్ధం ఆ తర్వాత తెలిసింది. అప్పట్లో విజయవాడ నుంచి వచ్చే ‘ఆంధ్ర ప్రభ’ నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అయితే దాని యజమానులు తెలుగువారు కారు. అది దృష్టిలో పెట్టుకుని ఇలా కాయిన్ చేశారట.)

‘ఆంధ్ర ప్రభ’, ‘ఆంధ్ర పత్రిక’, ‘ఆంధ్ర జ్యోతి’ పేర్లకు అలవాటు పడిన పాఠకులకు ‘ఈనాడు’ పేరు కొత్తగా, వింతగా అనిపించింది. చాలామంది వేళాకోళం కూడా చేశారు. ఎందుకంటే పశువులు ప్రసవిస్తే “ఈనింది” అంటారు. దానికి పుల్లింగంలా “ఈనాడు” అని ఉంది అని జోకులేశారు. నిజానికి ‘ఈనాడు’ పేరు రామోజీరావు గారికి ఎలా తట్టిందో నాకు తెలియదు గాని ఆ పేరుతో అప్పటికే కర్నూలులో అనుకుంటా, ఒక స్థానిక దిన పత్రిక ఉండేది. ఆ టైటిల్ ని రామోజీ రావు గారు కొనుక్కుని 1974 ఆగస్టులో విశాఖ నుంచి ‘ఈనాడు’ ప్రారంభించారు.

పొద్దున్న పది గంటలైతే కాని వార్తా పత్రికల మొహం చూసి ఎరగని ఉత్తరాంధ్ర పాఠకులు తెల్లారకముందే తలుపు తట్టి లేపి పలకరించిన ‘ఈనాడు’ కు బ్రహ్మ రథం పట్టారు. ‘ఈనాడు’ ను ఉత్తరాంధ్ర ప్రాంతీయ దిన పత్రికగానే పరిమితం చేద్దామనుకున్న రామోజీ రావు గారు అనూహ్యమైన ఈ రెస్పాన్స్ చూసి, ‘ఈనాడు’ను రాష్ట్రవ్యాప్తం చేయాలని నిర్ణయించుకుని, ఆ తర్వాత ఏణ్ణర్థానికే హైదరాబాద్ ఎడిషన్ ని ప్రారంభించారు.

1975 డిసెంబర్ రెండో వారంలో సోమాజిగూడా విద్యుత్ సౌధ పక్కన రికార్డు స్థాయి వేగంతో నిర్మించిన సొంత భవనం ప్రాంగణంలో ‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్లాను. అప్పుడు నేను ‘సినీ హెరాల్డ్’ లో పని చేస్తుండేవాడిని. ఆనాటి ఆ కార్యక్రమానికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, సి. నారాయణ రెడ్డి గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినారె గారు తన ప్రసంగంలో ‘ఈనాడు’ పేరుకు భాష్యం చెప్పారు.

“ఈనాడు అంటే అర్ధం ఇవాళ, ఈ రోజు అని మాత్రమే కాదు.. ఈ నాడు ..అంటే ఈ నేల అని కూడా అర్ధం. ఇంత మంచి పేరు ఎంచుకున్నందుకు రామోజీరావు గారిని అభినందించాలి” అన్నారు సినారె. ఆ తర్వాత ఏడాదికే ‘ఈనాడు’ విజయవాడ ఎడిషన్ ప్రారంభం కావడం, తెలుగు పత్రికల్లో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించి రాష్ట్రవ్యాప్తంగా విజయ విహారం చేయడం అందరికీ తెలిసిందే. ‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన మూడు నెలల తర్వాత నేను అందులో సబ్ ఎడిటర్ ట్రయినీ గా చేరాను. అది వేరే కథ.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!