చిట్టగాంగ్ విప్లవ వీరుడు!

Sharing is Caring...

Surya sen ………………………

భారత స్వాతంత్ర్యోద్యమ సమరంలో పాల్గొని కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులెందరో ఉన్నారు. వీరిలో కొందరు హింసామార్గం ఎన్నుకోగా మరికొందరు అహింసామార్గంలో పయనించారు. హింసా మార్గంలో నడిచిన వీరులు,వీర నారీ మణులు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది కనీస గుర్తింపుకు కూడా నోచుకోలేదు. అయినా వారి దేశ భక్తి తక్కువైనదేమీ కాదు.

అలాంటి వారిలో సూర్య సేన్ ఒకరు. సూర్య సేన్‌ను మాస్టర్‌డా అని ప్రేమగా పిలుస్తారు. సూర్య సేన్  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1930 ప్రాంతంలో చిట్టగాంగ్ లోని ఆయుధశాల పై దాడికి నాయకత్వం వహించాడు. సూర్య సేన్ చిట్టగాంగ్‌లోని నవోపోరాకు చెందినవాడు, ( ఈనాటి బంగ్లాదేశ్) తన గురువు ప్రేరణతో సేన్ శరత్ చంద్ర బసు నేతృత్వంలోని విప్లవ సంస్థ అనుశీలన్ సమితిలో చేరాడు.

బ్రిటీష్ పాలనను అంతం చేసేందుకు హింసా మార్గం సరైనదని బసు విశ్వసించారు. బెంగాల్‌లో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన మరో విప్లవకారుడు చిత్తరంజన్ దాస్‌తో కూడా సూర్య సేన్ పనిచేశాడు. సూర్య సేన్ ఏప్రిల్ 18, 1930న చిట్టగాంగ్ ఆయుధశాల పై దాడికి పధకం రచించారు. గణేష్ ఘోష్, లోకేనాథ్ బాల్, అనంత సింగ్ వంటి మెరికల్లాంటి యువకులను, మరికొంతమంది మహిళలను ఒక బృందంగా తయారు చేసాడు. 

అతను చిట్టగాంగ్‌ లోని రెండు ప్రధాన బ్రిటీష్ ఆయుధాగారాలను స్వాధీనం చేసుకుని, ఇతర విప్లవకారులకు ఆయుధాలను పంపిణీ చేయాలని ప్లాన్ చేశాడు. ఈ బృందం కమ్యూనికేషన్ ఎటు చేరకుండా టెలిఫోన్..టెలిగ్రాఫ్ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది.  నగరం –బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలతో సంబంధం లేకుండా రైలు మార్గాలను కూడా విచ్ఛిన్నం చేశారు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ 18 రాత్రి సూర్య సేన్ బృందం ఆయుధశాలలను స్వాధీనం చేసుకున్నప్పటికీ .. మందు గుండు సామాగ్రి ఎక్కడ ఉందొ కనుక్కోలేకపోయారు. మందుగుండు సామాగ్రి లేకుండా బ్రిటిష్ సైనికులతో యుద్ధం చేయడం అసాధ్యమని వారు అర్థం చేసుకున్నారు. ఆయుధ శాలపై దాడి పర్యవసానాలను అర్థం చేసుకుని  సురక్షితమైన బస కోసం చిట్టగాంగ్ కొండలకు బయలుదేరారు.

ఏప్రిల్ 22, 1930న, వేలాది మంది బ్రిటీష్ సైనిక సిబ్బంది అక్కడికి వచ్చి సూర్యసేన్ బృందాన్ని పట్టుకునేందుకు  ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 12 మంది విప్లవకారులు ..80 మంది బ్రిటిష్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఈ క్రమంలోనే  సూర్య సేన్ మరికొందరు సహచరులు పక్క గ్రామానికి పారిపోయారు. అక్కడ నుంచి బ్రిటిష్ సేనపై గెరిల్లా దాడులకు దిగారు.

బ్రిటీష్ సైన్యం విప్లవకారులు దాక్కున్న ముస్లిం ఆధిపత్య గ్రామాల చుట్టూ కూంబింగ్ కార్యకలాపాలను నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో సూర్య సేన్ అక్కడ నుంచి క్షేమంగా బయట పడ్డారు. ఈ లోగా సూర్య సేన్ అనుచరుడు నేత్ర సేన్ ను బ్రిటిష్ సైనికులు లోబర్చుకున్నారు. ఒకరోజు నేత్ర సేన్ ఇంట్లో సూర్య సేన్ తల చాచుకోగా  అతగాడు బ్రిటిష్ సైన్యానికి రహస్యంగా సమాచారం ఇచ్చాడు.

అంతే …. సూర్య సేన్ ను అరెస్టు చేశారు. చిత్ర హింసలు పెట్టారు. చివరికి జనవరి 12, 1934న ఉరి తీశారు.  నేత్ర సేన్ ను ద్రోహం చేసినందుకు ఇతర విప్లవకారులు తల నరికేశారు. ఈ చిట్టగాంగ్ కథాంశం తో ఒక సినిమా కూడా తీశారు. మనోజ్ వాజపేయి అందులో సూర్యసేన్ పాత్రలో నటించారు. సినిమా పేరు చిట్టగాంగ్ … యూట్యూబ్ లో ఉంది. ఆసక్తి గలవారు చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!