విశాఖ ఉక్కు విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. అఖిలపక్షంతో కలసి వస్తామని … తమ ఆందోళనను నేరుగా వివరిస్తామని ప్రధాని మోడీకి లేఖ రాయడం మంచి పరిణామమే. అయితే ప్రధాని మోడీ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో ఓ మెట్టు దిగివస్తారా ? లేదా ? అనేది సస్పెన్స్.ఏపీ బీజేపీ నేతలు ఈ విషయంలో చేతులెత్తేశారు. జనసేన అధిపతి మౌన వ్యూహం దాల్చారు. ఇపుడు జగన్ తన ప్రయత్నం మొదలెట్టారు.ఈ ప్రయత్నంలో జగన్ విజయం సాధించగలిగితే జగన్ ఇమేజ్ పెరుగుతుందనడంలో సందేహమే లేదు. అయితే మోడీ ని ఒప్పించాలి. ఈ విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారో అని విపక్షాలు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రదాని తో ఏం మాట్లాడాలి ? ఏయే కీలకాంశాలు ప్రస్తావించాలనే విషయం లో జగన్ కసరత్తు చేస్తున్నారు.విశాఖ కార్మిక సంఘ నాయకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.విశాఖ ఉక్కు, చారిత్రిక ప్రాధాన్యత, ఆంధ్రుల సెంటిమెంట్ తోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా 20 వేలమంది ఉపాధి పొందుతున్న తీరు గురించి ప్రధానికి వివరించనున్నారు. ప్రధానికి అర్ధమయ్యేలా సమగ్రంగా కీలక పాయింట్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. 2002-2015 మధ్య స్టీల్ ప్లాంట్ పనితీరు .. లాభాలు వచ్చిన వైనం గురించి ప్రధానికి వివరిస్తారు.అలాగే ప్లాంట్ పరిధిలో 19,700 ఎకరాల భూముల గురించి .. వాటి విలువ గురించి వివరిస్తారు. ప్రధాని పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా అండగానిలిచి కొంత సపోర్ట్ ఇస్తే లాభాల బాట పట్టే అవకాశాలున్నాయి.
డిసెంబర్ 2020లో విశాఖ స్టీల్ రూ.200 కోట్ల లాభం కూడా ఆర్జించింది. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే… ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బ్యాంకులనుంచి తెచ్చిన రుణాల మొత్తాన్ని వాటాల రూపంలోకి మారిస్తే రుణభారం తగ్గుతుంది. కొత్త రుణ సౌలభ్యత పెరుగుతుంది. వడ్డీరేట్లు కూడా తగ్గిస్తే ప్లాంటుపై భారం చాలా వరకు తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సీఎం జగన్ కు లేకపోలేదు. అవన్నీ ప్రధాని సుముఖత చూపితే … తదుపరి చర్చల్లో ఖరారు కావచ్చు. కొంత కాలం నడిపే ఛాన్స్ ఇస్తే లాభాల బాట పట్టవచ్చని … అప్పటికి కోలుకోకపోతే ప్రయివేటీకరణపై నిర్ణయం తీసుకోమని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే బైలడిల్లా గనుల నుంచి కొనుగోలు చేసే ముడి ఖనిజం రేటు తగ్గించమని … వైజాగ్ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకుపోవచ్చని సూచించవచ్చు.
ప్లాంట్ పనితీరు మెరుగుపడేందుకు నిపుణల కమిటీ వేసి పర్యవేక్షణలో ఏపీ సర్కార్ కు అవకాశం కల్పించమని అడగవచ్చు. ఆంధ్రుల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కోరవచ్చు. ఈ అంశాలను విని మోడీ ప్రయివేటీకరణ వాయిదాను వేయవచ్చు.లేదా మొత్తానికి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవచ్చు. ఏదైనా మోడీ అపాయింట్మెంట్ ఇచ్చి స్వయంగా చర్చిస్తే సానుకూల నిర్ణయాలు వెలువడవచ్చు. మోడీ తలుచుకుంటే వీలు కానిదేమి లేదు. ఏమి జరుగుతుందో చూద్దాం.సీఎం జగన్ అఖిలపక్షనేతలతో మోడీ ని కలిస్తే చర్చలన్నీఓపెన్ గా జరుగుతాయి కాబట్టి విపక్షనేతలు ఆపై జగన్ ను విమర్శించలేరు.
—————K.N.MURTHY