Bharadwaja Rangavajhala……………………………
Pre-marital HIV testing……………………..
ఒక ఫేసుబుక్కు మిత్రుడు పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలనే నిబంధన పెడితే బాగుంటుందని ప్రతిపాదించారు ఆ మద్దెల .నేను ఇంకాస్త బిగ్ వే లో చించా. అది మనదేశంలో ఎలా అమలు జరుగుతుందో చెప్దామని నా ప్రయత్నం. ఫిట్ ఫర్ మేరేజ్ అనే సర్టిఫికెట్ ఉన్నవారికే పెళ్లిళ్లు అనే చట్టం తీసుకురావచ్చు.
అంటే సంబంధం ఖాయం అనుకున్న తర్వాత అమ్మాయినీ అబ్బాయినీ తీసుకుని ప్రభుత్వం వారి ఫిట్ ఫర్ మేరేజ్ సర్టిఫికెట్లు జారీ చేసే కేంద్రానికి వెళ్లి అప్పాయింట్ మెంటు తీసుకోవాలి. అది త్వరగా ఇవ్వడానికి కొంత మామూలు ఇవ్వాలి. అక్కడో కమిటీ ఉంటుంది. అందులో సైక్రియాట్రిస్టుతో సహా అందరు వైద్యులూ కాబోయే దంపతులను క్షుణ్ణంగా పరీక్షిస్తారు.
ఈ ఇద్దరూ కాపురం మొదలెడితే…శాంతి భద్రతలకుగానీ…నేర విభాగానికిగానీ ఏవన్నా పనిపడుతుందా? అనే కోణంలోనూ… అలాగే ఒకరి వలన ఒకరికి సంక్రమించే వ్యాధులేవైనా ఉన్నవా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తారు. అలాగే వారి ఆరోగ్యాలు పదిలమే అనీ అమ్మాయి పసుపు కుంకాలకు ఢోకా ఉందా ? లేదా ?అనే విషయాన్ని కూడా ఢంకా బజాయించి చెప్తారు.
ఈ మేరకు సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా సర్టిఫికెట్ లేకుండా జరిగే పెళ్లిళ్లను చట్టబద్దమైన వివాహాలుగా ప్రభుత్వం గుర్తించదు.ఇందాక మనం చెప్పుకున్నామే …. అప్పాయింటుమెంటు కోసం మామూలు ఇచ్చుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని… అదే ప్రమాద కరం.
డబ్బులు తీసుకుని కాస్త అటూ ఇటూగా చూసి సర్టిఫికెట్లు జారీ చేయరని గ్యారంటీ లేదు. ఈ సర్ఠిఫికెట్లకు అయ్యే ఖర్చులు వధూవరులిద్దరూ చెరిసగం భరించాల్సి ఉంటుంది. మగ పెళ్లి వారి ఖర్చు కట్నంలో మినహాయించు కోవచ్చనుకోండి.ఎనీహౌ ఈ ప్రక్రియలో ప్రభుత్వాధికారులకు ముఖ్యంగా వైద్యులకు ఓ అదనపు ఆదాయ మార్గంగా ఉంటుంది. అంటే వాళ్లేదో లంచం తీసుకుంటారని కాదండీ… కన్సల్టెంట్లుగా కౌన్సిలింగ్ కు హాజరైన వైద్యులకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది కదా అదేనండి. ఇలా సర్టిఫికెట్ ఉన్న వారికే కళ్యాణ మండపాలు అద్దెకిస్తారన్నమాట.
దీంతో అక్కడ కొంత మంది బ్రోకర్లు వెలుస్తారు. కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకోడానికి వెళ్లినప్పుడు అక్కడుండే బ్రోకర్లు అలియాస్ ఏజంట్లు కొంత మొత్తం తీసుకుని రెండు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చే ఏర్పాట్లు చేస్తారు. అలా కొంతమందికి పని దొరుకుతుంది. ఇలా కొంత కాలం తర్వాత మ్యారేజీ స్కాంలో ఇన్ని కోట్లు తినేసిన అధికారి లాంటి హెడ్డింగులతో వార్తలు రావచ్చు కూడా. ఆయన పోస్టు చూశాక నాకనిపించినవన్నీ మీ ముందు పెట్టాను. ఇక దీన్ని చీల్చి చండాడాల్సింది మీరే… శ్రీరస్తూ శుభమస్తూ