రౌండ్ క్లాక్ మాదిరి తిరిగే శివ లింగం !!

Sharing is Caring...

Historical city of Barsur …………………

మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ కోవలోనిదే ఛత్తీస్‌గఢ్‌లోని బార్సూర్‌  శివాలయం.. దంతెవాడ జిల్లాలోని చారిత్రక నగరం బార్సూర్‌లో ఉన్న ఈ శివాలయాన్ని ‘బత్తీస్ మందిర్’ అని కూడా అంటారు. ఈ ఆలయంలో రెండు గర్భాలయాలు  … రెండు శివలింగాలు ఉన్నాయి. 

ఒక గర్భాలయంలోని  శివలింగం 360 డిగ్రీలలో చుట్టూ తిరుగుతుంది. తనంతట తాను తిరగదు,భక్తులు ఎవరైనా తిప్పితే తిరుగుతుంది.  ‘బత్తీస్ మందిర్’  లో 32  స్థంభాలతో నిర్మితమైన మండపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. రెండు గర్భాలయాలు ఉన్న ఏకైక ఆలయం కూడా ఇదే.

ఇక్కడ శివలింగం ఉన్న పానవట్టాన్ని చుట్టూ తిప్పుతూ భక్తులు కోరుకునే  కోర్కెలను ఆ శివయ్య తీరుస్తాడని భక్తుల విశ్వాసం. ఈ పానవట్టాన్ని అందులోని శివలింగాన్ని ప్రత్యేకంగా తయారు చేసారని అంటారు. ఇతర శివాలయాల్లో ఇలా తిరిగే శివలింగం ఎక్కడా కనిపించిన ఉదాహరణలు లేవు. 

850 ADలో గంగ వంశీ పాలకుడు బాణాసుర రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు.ఇక్కడికి సమీపంలో మరికొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. శివరాత్రి ఇతర పర్వదినాల్లో మినహా పెద్దగా భక్తులు రారు.
ఇక్కడ ఈ శివలింగాన్ని సీతా సమేత రాముడు, లక్ష్మణుడు ప్రతిష్టించారని అంటారు ..తర్వాత కాలంలో బాణాసుర రాజు ఆలయం నిర్మించారని చెబుతారు.

ఇక్కడ శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే..12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్ముతారు.  తిప్పితే తిరిగే ఈ శివలింగంకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.  
  
బార్సూర్ దేవాలయాలు, చెరువుల నగరం గా ప్రసిద్ధి గాంచినది . ఇక్కడ శతాబ్దాల నాటి దేవాలయాలు, జలపాతాలు ఉన్నాయి. ఒకప్పుడు 147 దేవాలయాలు,147 చెరువులు ఉండేవి. కాలక్రమంలో ఆలనా.. పాలనా లేక కొన్ని దేవాలయాలు దెబ్బతిన్నాయి. నిర్వహణ లేని కారణంగా చెరువులు కూడా ఎండిపోయాయి. జగదల్పూర్ వెళితే అక్కడనుంచి బార్సూర్ కి బస్,టాక్సీ సదుపాయాలు ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!