The landmarks are alive……..
ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో బౌద్ధ మతం విలసిల్లింది. ఇప్పటికి ఆ ఆనవాళ్లు సజీవంగా ఉన్నాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో చందవరం, మోటుపల్లి, కనపర్తి వంటి ప్రదేశాల్లో బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి.చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు.
క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దంలో ఇక్కడ ఆరామాలు నిర్మించారు. ఈ చందవరం సుమారు 800 ఏళ్ల పాటు ధార్మిక కేంద్రంగా, హీనయాన బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. ఈ ఆరామాలను శాతవాహన వంశీయులు నిర్మించారు.
వేల ఏళ్ళక్రితం బౌద్ధులు ధాన్యకటకం (అమరావతి) నుండి పుష్పగిరి – కంచి – రామేశ్వరం మీదుగా శ్రీలంక కు పెద్ద సంఖ్యలో వెళ్ళే వారు. అలాగే వారణాసి నుంచి కంచి వెళ్లేవారు.వారందరికీ ఈక్షేత్రం విశ్రాంతి కేంద్రంగా ఉండేది.
అశోకుని కుమార్తె సంఘమిత్ర చందవరం స్తూపాన్ని దర్శించినట్టు చెబుతారు.చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ రచనల్లో చందవరం స్తూప ప్రస్తావన ఉందని చరిత్రకారులు చెబుతారు.దొనకొండ మండలంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది.
బౌద్ధ స్థూపం ఉన్న ఈ కొండను “సింగరకొండ”గా పిలుస్తారు. పురావస్తు శాఖ 1972 లో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. 200 అడుగుల కొండ మీద 120 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ స్థూపం, మరో 15 పెద్ద స్థూపాలు, వందలాది చిన్న స్థూపాలు తవ్వకాలలో బయట పడ్డాయి. బౌద్ధ స్థూపం హిమవత్ శైలిలో నిర్మించబడిన స్తూపం.
ఈ బౌద్ధ స్థూపం చుట్టూ బుద్ధదేవుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాలను చెక్కారు. అలాగే అశోక చక్రం ఉన్నశిల్పం, బౌద్ధ భిక్షువుల సమాధులు.. అప్పట్లో వారు విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యాన మందిరాలు. పూసలు,నాణేలు .. బ్రాహ్మి శాసనాలు,బుద్ధుని పాద ముద్రలు, ఛత్రాలు తవ్వకాలలో వెలుగు చూశాయి.
నాడు భిక్షువులు కొండపై నుంచి నీరు కిందికి వెళ్లేందుకు నిర్మించిన కాలువ.. వారు ఉపయోగించిన రోలు,తదితర వస్తువులను కూడా అధికారులు కనుగొన్నారు. అలాగే ఆ మధ్య కాలంలో గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వుతుండగా రెండు పాలరాతి విగ్రహాలు కనిపించాయి.
ఇక్కడ దొరికిన ప్రధాన స్థూపం సాంచీలోని బౌద్ధ స్థూపాన్నిపోలి ఉంది. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద బౌద్ధ స్థూపమని చెబుతారు. గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నఈ బౌద్ధారామం అతి ప్రాచీనమైనది. కాల క్రమంలో ఇక్కడి బౌద్ధారామాలను కూలగొట్టి అందులోని శిల్పాలు,రాళ్లు, మట్టి మొదలైన వాటిని చందవరంలోనే ఉన్న మహాబలేశ్వర ఆలయ నిర్మాణానికి ఉపయోగించారని కూడా అంటారు.
జిల్లా వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఈ చందవరం బౌద్ధ స్థూపాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు.చందవరానికి మూడు మైళ్ల దూరంలో దూపాడు బౌద్ధ స్థూపం ఉంది. ఇది శిధిల స్థితిలో ఉన్నది.
దీనిని ద్వీపగడ్డ అని కూడా పిలుస్తారు. తవ్వకాల నుండి వెలికితీసిన అన్ని వస్తువులను ప్రదర్శన కోసం ఉంచాలన్నఉద్దేశ్యంతో ప్రభుత్వం 1980లో సైట్కు సమీపంలో ఒక భవనాన్ని నిర్మించి మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది.
అయితే మూడు సార్లు చోరీ ప్రయత్నాలు జరిగాయి. దీంతో శిల్పాలన్నింటినీ చందవరం గ్రామ పంచాయతీ భవనానికి తరలించారు. గ్రామంలో మ్యూజియం భవన నిర్మాణానికి రెవెన్యూ అధికారులు భూమిని మంజూరు చేశారు.ఇక్కడ పర్యాటకం అభివృద్ధి చెందే సూచనలున్నాయి.. ప్రభుత్వం అంత శ్రద్ధ చూపడం లేదు.
చందవరం ఒంగోలు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. దొనకొండ నుంచి 14 కి.మీ. ఉంటుంది. దొనకొండ నుంచి ప్రైవేట్ వాహనాలు దొరుకుతాయి.
ఇక మోటుపల్లి విషయానికొస్తే ఇదొక చారిత్రక ఓడరేవు గ్రామం..ఇది చీరాల/ఒంగోలు సమీపం లో వేటపాలెం కి దగ్గర్లో ఉంది. ప్రాచీన కాలంలో అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మోటుపల్లి వర్ధిల్లింది. ఇక్కడి నుండి చైనా, సిలోన్ (శ్రీలంక), ఆగ్నేయాసియా దేశాలకు బౌద్ధ భిక్షువులు, వర్తకులు ప్రయాణించేవారు. ఇక్కడ బౌద్ధ సంస్కృతికి సంబంధించిన అనేక ఆనవాళ్లు, ప్రాచీన నాణాలు లభించాయి.
కనపర్తి గ్రామం..నాగులుప్పలపాడు మండలం సముద్ర తీర ప్రాంతం ఇది.ఇక్కడ జరిపిన తవ్వకాలలో బౌద్ధ కాలానికి చెందిన ఇటుకల నిర్మాణాలు, బుద్ధుని విగ్రహాల శకలాలు లభించాయి. ఇక్కడి నుండి కూడా సముద్ర మార్గాన బౌద్ధమతం ఇతర దేశాలకు వ్యాపించిందని చరిత్రకారులు చెబుతారు.
క్రీస్తు శకం 4వ, 5వ శతాబ్దం తర్వాత ఇక్ష్వాకుల పాలన అంతం కావడం, వైష్ణవ, శైవ మతాల ప్రభావం పెరగడంతో ప్రకాశం జిల్లాలో బౌద్ధమతం క్రమంగా క్షీణించింది. అనేక బౌద్ధ క్షేత్రాలు కాలగర్భంలో కలిసిపోగా, మరికొన్ని హిందూ దేవాలయాలుగా మార్పు చెందాయి
నోట్ … పైన మీరు చూసిన ఫొటోలోని బౌద్ధ ప్యానల్ 2001 లో చోరీకి గురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మ్యూజియంలో ఉంది. చోరీ జరగక ముందు నాటి ఫోటో అది.

