రాగాల పూలతోట – భాగేశ్వరి!! (2)

Sharing is Caring...

Taadi Prakash…………………….

FRAGRANCE OF A SOULFUL RAGA

అదిగో… రాగాలు తీస్తూ వస్తోంది ‘భాగేశ్వరి’. కేవలం స్వరాలు ప్రాతిపదికగా కాకుండా, రాగఛాయల్ని మూర్చనల ద్వారా మనసుతో గుర్తించగలగాలి. భక్తి, కరుణరస ప్రధానమైన రాగం యిది. ఎక్కువ టెంపోలో కాకుండా లలితంగా ఆలపిస్తారు. అప్పుడది మన ప్రాణేశ్వరి అవుతుంది.

మొదటిసారి, అక్బర్ దర్బారులో తాన్ సేన్ ఆలపించాడని అంటారు. ఇది ఉత్తర భారత హిందుస్తానీ సంప్రదాయ రాగం. దక్షిణాదిలో కొంత లేటుగానే అడుగు పెట్టింది. ‘గులేబకావళి’ అనే పాత తమిళ సినిమాలో “మయక్కుమ్ దు మా ళై పొళుదు” అనే శ్రావ్యమైన పాటతో ‘భాగేశ్వరి’ దక్షిణాదిని పలకరించింది. జిక్కి, ఏ ఎం రాజా పాడారు.

విశ్వనాథన్, రామ్మూర్తి మనకిచ్చిన ‘తొలి రాగం’ యిది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు సీ. రామచంద్ర ఏ పాట కంపోజ్ చేయాలన్నా ముందుగా ‘భాగేశ్వరి’లో వరస కుదురుతుందేమో అని ఆలోచించేవాడు. ఆయన భాగేశ్వరితో వూడిగం చేయించి ఎన్నో మధుర గీతాలని మనకందించాడు.

@ విరహ వేదనతో ప్రియుని కోసం అభిసారిక ఆలపించే కరుణ రసాత్మక రాగం ‘భాగేశ్వరి’.
@నీకోసమె నే జీవించునది … మాయాబజార్, ఘంటసాల సంగీతం. లీల, ఘంటసాల పాడారు.
@అలిగితివా సఖీ ప్రియా … శ్రీకృష్ణార్జునయుద్ధం, సంగీతం పెండ్యాల. పాడింది ఘంటసాల.
@’గీతాంజలి’లో ఆమనీ పాడవే హాయిగా… ఇళయరాజా బాణీ, బాలు పాడారు.

@సాగరసంగమం లో నాదవినోదము నాట్య విలాపము… కూడా ఇళయరాజానే. గానం బాలు.
@’రాము’లో ఎం ఎస్ విశ్వనాథన్ తమిళ పాట……  నిలవే ఎన్నిడం నెరుంగాదె … పి.బి.శ్రీనివాస్ పాడారు.
అదే తెలుగులో మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనమూ…
@అమరశిల్పి జక్కన్నలో సుశీల పాట నగుమోము చూపించవా గోపాలా… వసంతసేనలో కిలకిల నగవుల నవమోహినీ… రెండూ ఎస్.రాజేశ్వరరావు కట్టినవే!

@’శోభ’లో ఘంటసాల పాడిన, అందాలు చిందించు సీమలో… ఈ రాగమే.
@’బొంబాయి’లో చిత్ర పాడిన రెహమాన్ పాట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే…
@లవకుశలో లీల, సుశీల పాడిన రామ సుగుణధామ… ఘంటసాల సంగీతం. ఇలా తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో హృద్యమైన ఈ రాగానికి ఎన్ని పరిమళాలు పూయించారో మన సంగీత దర్శకులు.

హిందీ సినిమాల్లో సూపర్ హిట్లు
@’సఫర్’లో ఆర్.డి బర్మన్, కిషోర్ కుమార్ గొంతులోంచి ఒంపిన జీవన్ సె భరీ తేరీ ఆంఖే…
@మధుమతిలో లతా మంగేష్కర్ తో సలీల్ చౌధురి పిలిపించిన … ఆజారే పరదేశీ – మైతొ కబ్సె ఖడీ ఇస్పార్.., ఘడీ ఘడీ మొర దిల్ ధడ్ కె … రెండూ ఆ రాగమే!
@’జహాన్ ఆరా’లో మదన్మోహన్ – తలత్, లతతో హృదయాల్ని పిండేసేలా పాడించిన – ఫిర్ వహీ షామ్, వహీ గమ్..,

@’దేఖ్ కబీరా రోయీ’లో హమ్ సె ఆయా న గయా.. అని తలత్ తో పాడించిందీ మదన్మోహనే!
@నాబోలె నాబోలె నాబోలెరే… ‘ఆజాద్’ సినిమాలో లతతో సి రామచంద్ర చేయించిన విన్యాసం – అదే తెలుగులో – రావోయి రావోయి ఓ మాధవా… అంటూ చింతామణిలో భానుమతి పాడింది.
@సీనే మె జలన్ – ఆంఖో మె తుఫాన్ సె క్యూ హై … ‘గమన్’లో సురేష్ వాడేకర్ తో భాగేశ్వరిని పలికించాడు జయదేవ్.

వసంత్ దేశాయ్ గుర్తున్నాడా?
@’ఝనక్ ఝనక్ పాయల్ బాజే’లో నైన్ సె నైన్ నహీ మిలావో … అని లత, హేమంత్ కుమార్ లతో పాడించాడు. వాళ్ళిద్దరితోనే అనార్కలిలో సి రామచంద్ర జాగ్ దర్ దె ఇష్క్ జాగ్ … వినిపించాడు.
@’రాజ్ హథ్’ సినిమాలో శంకర్ జైకిషన్  ఆయే బహార్ బన్ కె లుబాకర్ చలే గయే… అంటూ రఫీ తో సమ్మోహనంగా పాడించాడు. ఈ పాటలన్నీ ఒకే రాగం అని శ్రోత గుర్తించగలిగినపుడు అందులోని అంతర్ లయ, సొగసు, హొయలు అనుభవంలోకి వచ్చి, ఒక అపూర్వమైన ఆనందంతో హృదయం తొట్రు పడుతుంది.
DISCLAIMER :
మన సంగీతం, రాగాలు బాగా తెలిసిన వాళ్ల కోసం ఇది రాయలేదు. శృతిమించిన ‘అతి’ పాటలు పాడుకుంటున్న యువతరానికి కొన్ని మంచి పాటల్నీ, భాగేశ్వరి సొగసునీ పరిచయం చేసే ప్రయత్నమే ఇది. ఈ రాగం ఎన్ని వైవిధ్యాల హొయలు పోతుందో, అలాగే ఈ పాటల్లోని సాహిత్యమూ వేదనననీ, విషాదాన్నీ, కించిత్ ఆనందాన్నీ మనకి పంచి ఇస్తుంది. నాకు రాని, నాకు తెలీని చిత్రలేఖనం, సంగీతం గురించి పట్టుదలతో, శ్రద్ధతో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేశాను.

Pl.Read it Also ……………………..రాగాల పూలతోట – భాగేశ్వరి!! 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!